Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మహా గోదావరి

wtr

హిమాలయాల నుంచి కింది వరకు నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించాలి 

938 టిఎంసిల జలరాశితో అనుసంధించాలి
దక్షిణాది వాటర్‌గ్రిడ్ రక్షణకు అదే శరణ్యం
నేడు హైదరాబాద్‌లో జరిగే జలవనరుల ప్రాంతీయ సదస్సులో సూచించనున్న నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్: గోదావరి నదిని హిమాలయాల నుంచి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించనుంది. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరి కి మళ్లించడమొక్కటే భవిష్యత్తు తరాలకు నీటి కొరతను తీరుస్తుందని, సుమారు 938 టిఎంసిల నీటితో గోదావరిని లింకు చేయడం వల్ల దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టమవుతుందని మంత్రి అభిప్రాయం. నగరంలో మంగళవారం జరిగే దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ ప్రాంతీయ సదస్సులో రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఈ మేరకు హిమాలయాల నుంచి గోదావరి లింకును ప్రతిపాదించనున్నారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని మంత్రి నిర్ణయించారు. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు తెలంగాణ, ఎపి, తమిళనాడు, కేరళ, కర్నాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల మంత్రులు హాజరవుతున్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే సమయంలో కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా తేల్చడంపై మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని, అకినేపల్లి నుంచి 247 టిఎంసిల నీటిని నాగార్జున సాగర్, సోమశిల మీదుగా, కావేరికి వరకు మళ్లించాలని కేంద్రం తొలుత నిర్ణయించగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న అనుమానాలు, సాధ్యాసాధ్యాలు, అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతోంది. పట్టిసీమ ప్రాజెక్టులో తెలంగాణ వాటా 45 టిఎంసిలు, పోలవరంలో 45 టిఎంసిలు, మొత్తంగా 90 టిఎంసిలు అదనంగా కావాలని ప్రభుత్వం కోరనుంది. పోతిరెడ్డిపాటు నుంచి నీటి అక్రమ మళ్లింపు, టెలీమెట్రీ ఇప్పటికీ ఏర్పాటు కాకపోవడం, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా ఆపరేషన్ ప్రోటోకాల్ అమలులోని ఇబ్బందులు, తదితర అంశాలను హరీశ్‌రావు ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్రను కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావడం, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం, తదితరాలపై కూడా మంత్రి ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.

Comments

comments