Home రంగారెడ్డి ఆకుపచ్చ జిల్లాగా రంగారెడ్డి

ఆకుపచ్చ జిల్లాగా రంగారెడ్డి

Haritha haram Program In Ranga Reddy District

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హరిత తెలంగాణ దిశగా ఒక్కో అడుగు ముందుకు సాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో మూడు విడతలలో ఇప్పటికే 2.03 కోట్ల మొక్కలు నాటిన యంత్రాంగం మరో 86 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తుంది. పల్లె పల్లెన పచ్చని మొక్కలు నాటి హరిత తెలంగాణ తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఖాళీ జాగా ఉన్న ప్రాంతంలో పచ్చని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టడానికి ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందచేస్తుంది. వర్షం పడిన వెంటనే మొక్కలు నాటాలన్న లక్షంతో జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 86 లక్షల మొక్కలు నాటడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసుకున్న అధికారులు గత సీజన్‌లో వాతావరణం అనుకూలించక హరితహారం లక్షసాధనలో వెనకబడటంతో ప్రస్తుతం ఖచ్చితంగా లక్షం చేరుకోవలన్న ఉద్దేశంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు అన్ని వర్గాల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి సిద్దం అవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 94.83 లక్షల మొక్కలు నాటడానికి సిద్దంగా ఉన్నాయి. గత సంవత్సరం నాటకుండా మిగిలిన 66.92 లక్షల మొక్కలకు అదనంగా అటవీశాఖ అద్వర్యంలో 41, డిఆర్‌డిఓ అద్వర్యంలో 14 నర్సరీలను ఏర్పాటు చేసి మరో 27.91 లక్షలను సిద్ధం చేశారు.
మొక్క మొక్కకు బాధ్యత….
మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. ప్రతి మొక్కకు లెక్క ఉండేలా జియో ట్యాగింగ్ చేస్తున్న యంత్రాంగం వాటి సంరక్షణ సైతం సీరియస్‌గానే తీసుకుంటుంది. రైతులు వ్యవసాయంతో పాటు మొక్కలను సంరక్షించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేసింది. పండ్ల మొక్కలను విస్తారంగా పెంచడం ద్వారా ఆర్థికంగా ఏదగడానికి అవకాశం ఉందని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్దమైంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో అత్యధికంగా 32 లక్షల మొక్కలను నాటాలన్న లక్షం పెట్టుకుంది. ఐదు ఎకరాలలోపు వ్యవసాయ పొలం ఉన్న రైతులు గట్ల వెంబడి మొక్కలను నాటితే గుంతలు తవ్వడానికి ఖర్చుతో పాటు సంరక్షణకు ఒక్కో మొక్కకు నెలకు ఐదు రూపాయల చొప్పున రెండు సంవత్సరాల వరకు అందచేయనున్నారు. జామ 200 ఎకరాలు, మామిడి వంద ఎకరాల్లో ప్రస్తుత సీజన్‌లో నాటించి వడాటి సంరక్షణకు మొక్కకు నెలకు రూ.15 చొప్పున మూడు సంవత్సరాలు అందచేస్తారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 32 లక్షలు, ఈత 4.41లక్షలు, కర్జూర 2.05లక్షలు, బురుగు 1.83 లక్షలు, చింత 1.61 లక్షలు, ఇప్ప 3.41 లక్షలు, నెమలినార 6.41 లక్షలు, రావి 1.67 లక్షలు నాటడానికి సిద్దంగా ఉన్నాయి. ఇళ్లలో నాటుకోవడానికి పండ్ల మొక్కలకు ప్రజల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో దానికి అనుగుణంగా నర్సరీలలో వాటిని సిద్దం చేశారు.
శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని….
జిల్లాను పచ్చదనం వెల్లివిరిసిలా చూడటానికి శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని సిద్దం అవుతున్నారు. చినుకు పడితే చాలు రంగంలోకి దిగడానికి రేడిగా ఉన్నారు. అటవీశాఖ 10 లక్షలు, విద్యాశాఖ లక్ష, పంచాయతీరాజ్ శాఖ 2 లక్షలు , పంచాయతీ అధికారి 3 లక్షలు, ఇరిగేషన్ శాఖ 50 వేలు, ఎక్పైజ్ శాఖ 5 లక్షలు, షాద్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, బండగ్‌పేట్, ఇబ్రహింపట్నం, మీర్‌పేట్, జల్‌పల్లి, జిల్లాల్‌గూడ మున్సిపాలిటిలలో ఒక్కో మొన్సిపాలిటిలో లక్ష చొప్పున మొక్కలను నాటనున్నారు. సైబారాబాద్ పోలీసులు రెండు లక్షలు, రాచకొండ పోలీసులు 4 లక్షలు, పరిశ్రమల శాఖ 2 లక్షలు, ఉద్యానవన శాఖ 5 లక్షలు, డిఆర్‌డిఓ 25 లక్షలు, వ్యవసాయ శాఖ 12 లక్షలు, దేవాదాయ శాఖ 15 వేలు, సాంఘిక సంక్షేమ శాఖ 25 వేలు, గిరిజన సంక్షేమ శాఖ 10 వేలు, బిసి సంక్షేమ శాఖ 10 వేలులతో పాటు ఇతర స్వచ్చంద సంస్థలు మరో ఐదు లక్షల మొక్కలను నాటాలన్న లక్షం నిర్దేశించుకున్నారు.