Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

‘హరితహారం’తో పాటే బిసిలకు వరాలజల్లు

భూపాలపల్లి నుంచి సిఎం శ్రీకారం

CM-KCR

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘హరితహారం’ నాల్గవ విడత కార్యక్రమాన్ని మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ప్రారంభించే సందర్భంగానే వెనకబడిన తరగతుల యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం చేసే పథకాల్ని కూడా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. బిసిలకు పూర్తిగా వంద శాతం ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకులతో ఎలాంటి సంబంధం లేకుండా గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు ఆర్థికసాయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని వీలైనంత త్వరగా అమలులోకి తీసుకొచ్చేలా హరితహారంతోపాటే దీనికి కూడా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గ్రామ స్థాయిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని, జిల్లా స్థాయిలో కలెక్టరు చైర్మన్‌గా బిసి సంక్షేమ అధికారి కన్వీనర్‌గా కమిటీని నియమించాలని, లబ్ధిదారుల జాబితాను తయారుచేసి ఆర్థిక సాయం అందించాలని గత వారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షతన పలువురు మంత్రులు బిసిలకు అందించే ఆర్థిక సాయం, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు.

పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని రజకులు, నాయీ బ్రాహ్మణులు, పూసల సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిధారులను గుర్తించే ప్రక్రియ జరిగిందని, వీరికి స్వయంగా ముఖ్యమంత్రి ఉపకరణాలను అందజేస్తారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. దీర్ఘకాలం నుంచి బిసి కులాలకు చెందినవారికి ఆర్థికంగా సాయం చేయడంతో పాటు స్వయం ఉపాధికి వీలుగా ప్రభుత్వం చేయూతనందించాలని, స్వంత కాళ్ళమీద ఆధారపడే తీరులో వారికి సహకారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి పలుమార్లు స్పీకర్ మధుసూధనాచారి విజ్ఞప్తి చేశారు.

బిసి వర్గాల అభ్యున్నతి కోసం మధుసూధనాచారి పడుతున్న తపనను దృష్టిలో పెట్టుకుని ఆయన నియోజకవర్గంలో నాల్గవ విడత ‘హరితహారం’ను ప్రారంభిస్తూనే బిసిలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగినట్లు జిల్లా వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయా కులాల సొసైటీలు, సమాఖ్యలు కులవృత్తిపై ఆధారపడే చిరు వ్యాపారాలు చేసుకోడానికి సబ్సిడీమీద రుణాలను అందజేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు పూర్తిగా ప్రభుత్వమే వంద శాతం గ్యారంటీతో బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం బిసి సంక్షేమ కార్పొరేషన్, ఎంబిసి కార్పొరేషన్‌ల దగ్గర ఉన్న నిధులను వినియోగించాలని సిఎం స్పష్టం చేశారు.

Comments

comments