Home జాతీయ వార్తలు నెగ్గిన ఎన్ డిఎ

నెగ్గిన ఎన్ డిఎ

Harivansh as the deputy chairman of Rajya Sabha

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక
హరిప్రసాద్ (కాంగ్రెస్)పై 20 ఓట్ల ఆధిక్యం
టిఆర్‌ఎస్ ఓట్లతో గట్టెక్కిన జెడి(యు) అభ్యర్థి

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికోసం గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి, జెడి(యు) ఎంపి హరివంశ్  నారాయణ్ సింగ్ 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హరివంశ్ కు 125 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బికె హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. గత నెల 1న పిజె కురియన్ రిటైరయినప్పటినుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ప్రతిపక్షా ల్లో టిఆర్‌ఎస్, బిజూ జనతాదళ్‌లు  హరివంశ్‌కు అనుకూలంగా ఓటు వేయగా, వైకాపా, ఆప్ పా ర్టీలు ఓటింగ్‌కు గైరుహాజరయ్యాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయిన హరివంశ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సహా మొత్తం సభ అభినందించింది. హరివంశ్‌ను అభినందించిన ప్రధాని ఇక అందరూ హరి(భగవంతుడి) దయపై ఆధారపడి ఉండాలని అన్నారు.

కాగా కిడ్నీ ఆపరేషన్ కారణంగా దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తొలిసారి సభకు వచ్చిన సభా నాయకుడు అరుణ్ జైట్లీ, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయిన హరివంశ్‌ను అభినందించారు. హరివంశ్ నామినేషన్‌ను రామ్‌ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా కేంద్రమంత్రి, ఆర్‌పిఐ సఖ్యుడు రామ్‌దా అతవాలే బలపరిచారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, శివసేనకు చెందిన సంజయ్ రసత్, అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా కూడా నామినేషన్‌ను బలపరిచిన వారిలో ఉన్నారు. మొదటిసారి జరిగిన ఓటింగ్‌లో లోపాలు జరిగినట్లు కొందరు సభ్యులు ఎత్తి చూపించడంతో రెండోసారి ఓటింగ్ జరిగింది. మొదటిసారి ఓటింగ్‌లో ఎలక్ట్రానిక్ స్క్రీన్‌పై హరివంశ్‌కు అనుకూలంగా 122,వ్యతిరేకంగా 98, మొత్త పోలయిన ఓటు ్ల222గా చూపించింది. కాగా తుది కౌంటింగ్‌లో హరివంశ్‌కు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 రాగా, ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు గైర్‌హాజరయ్యారు.

ఆటగాళ్లకన్నా అంపైర్‌కే ఎక్కువ సమస్యలు: మోడీ
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నిక ఫలితాలను ప్రకటించగానే సభా నాయకుడు అరుణ్ జైట్లీ, ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌లు హరివంశ్‌ను ప్రతిపక్ష నాయకుడి పక్కన ఉన్న డిప్యూటీ చైర్మన్ సీటువద్దకు తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా హరివంశ్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. సభలో అందరు సభ్యులకు ఆయన న్యాయం చేస్తారన్న అవశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేస్తూ , ఆటగాళ్లకన్నా అంపైర్ ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేలా సభలో పరిస్థితి ఉంటుందని నవ్వుతూ అన్నారు. హరివంశ్‌కు రిజర్వ్‌బ్యాంకులో ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా ఆయన దాన్ని నిరాకరించారని చెప్పారు. ఈ రోజు దేశం క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని జరుపుకొంటూ ఉన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ,1857నుంచి కూడా స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడి ఉన్న ప్రాం తాల్లో ఒకటయిన బలియా ప్రాంతానికి చెందిన వ్యక్తి హరివంశ్ అని అన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌తో ఆయన స్ఫూర్తి పొందారని ప్రధాని అంటూ, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌తో కూడా ఆయన కలిసి పని చేశారన్నారు.

చంద్రశేఖర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే విషయం హరివంశ్‌కు ముందే తెలిసినప్పటికీ, ఆయన సొంత దినపత్రికకు ఈవార్త తెలియదని మోడీ అంటూ, నైతిక విలువలు, ప్రజా సేవ పట్ల రఘువంశ్‌కున్న నిబద్ధత అదని అన్నారు. అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులు తమ సమస్యలను ప్రస్తావించడానికి వారికి తగినంత అవకాశాన్ని హరివంశ్ ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హరివంశ్ ఎప్పుడు కూడా ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని జైట్లీ అంటూ, డిప్యూటీ చైర్మన్‌గా ఆయనహయాంలో సభలో చర్చలు మరింత మెరుగుపడుతాయన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయిన హరివంశ్‌ను చైర్మన్ వెంకయ్య నాయుడు స్వాగతిస్తూ, సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశాల్లో హరివంశ్ నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేవారని అన్నారు. సభ పని తీరు పట్ల తాను ఒక్కోసారి అసహనానికి గురయినా, హరివంశ్ మాత్రం ఎప్పుడూ, ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటారని అన్నారు. ‘ పెద్దల సభ’ డిప్యూటీ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇవి ఆయనకు తోడ్పడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం హరివంశ్ చైర్మన్ స్థానంలో కూర్చుని కొద్ది సేపు సభా కార్యకలాపాలను నిర్వహించగా, సభ్యులందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.