Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పరాజయాల హ్యాట్రిక్

న్యూజిలాండ్‌తో మహిళా హాకీ  సిరీస్

hockeyన్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మహిళా హాకీ సిరీస్‌లో భారత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 3-2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆతిథ్య కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు పోటీలు మిగిలివుండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. కిందటి మ్యాచ్‌లో 8-2 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడి పోయిన భారత్ మూడో మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. ఆట ప్రారంభంలోనే భారత్ గోల్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీప్ గ్రేస్ ఎక్కా 9వ నిమిషంలోనే గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. 13వ నిమిషంలో ఎల్లా గున్సన్, మరో రెండు నిమిషాల తర్వాత డియానా రిట్చి గోల్స్ సాధించడంతో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ప్రథమార్ధంలో స్కోరును సమం చేసేందుకు భారత్ తీవ్రంగా పోరాడింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ద్వితీయార్ధంలో కూడా పోరు హోరాహోరీగా సాగింది. రెండు జట్లు కూడా నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. భారత్‌కు పలు అవకాశాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. అయితే 39వ నిమిషంలో షిలో గ్లోయిన్ న్యూజిలాండ్‌కు మూడో గోల్ అందించింది. దీంతో భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఆట ఆఖరి క్షణాల్లో మోనికా భారత్‌కు రెండో గోల్ సాధించి పెట్టింది. అప్పటికే సమయం మించి పోయింది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న భారత్ 2-3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది.

Comments

comments