Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సత్యమే సత్యం

Ayesha-Meera-Rape-Case

ఆయేషా హత్య కేసులో 8 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబు నిర్దోషి: హైకోర్టు సంచలన తీర్పు,  సాక్షాలు లేకున్నా నేరస్థులను రక్షించడానికి పోలీసులు కట్టుకథ అల్లారని న్యాయస్థానం వ్యాఖ్య, అసలు దోషుల వేటకు దర్యాప్తు అధికారులపై చర్యలకు ఆదేశం, న్యాయం గెలిచింది : తల్లి 

ఆనాడే లోకం కోడై కూసిన సత్యం దాదాపు పుష్కర కాలం తరువాత  హైకోర్టులో రుజువైంది. 11 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించి అప్పటి రాజకీయ ప్రముఖులపై అనుమానాలు రేకెత్తించిన బిఫార్మా విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్య కేసులో దళిత బిడ్డ సత్యం బాబును ఇరికించి అన్యాయంగా శిక్ష వేయించారని ఆనాడు బాహాటంగా వెల్లడయిన అనుమానాలు ఇప్పుడు రుజువయ్యాయి. విజయవాడలోని మహిళా కోర్టులో జీవితఖైదు పడి 8 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబు ఆ కేసులో పూర్తిగా నిర్దోషి అని హైకోర్టు శుక్రవారం నాడు సంచలనాత్మక మైన తీర్పు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సాక్షాలు లేకున్నా నేరస్థుల ను రక్షించడానికి పోలీసులు కట్టుకథ అల్లారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  అసలు దోషులను పట్టుకోవాలని, నిర్దోషిగా ప్రకటించిన సత్యం బాబుకు పరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే 8 ఏళ్ల కాలం జైలు శిక్ష అనుభవించి మంచి భవిష్యత్తును కోల్పోయిన సత్యంబాబుకు కేవలం లక్ష రూపాయలు పరిహారం ప్రకటించడం పట్ల సమాజం ఆశ్చర్యాన్ని, బాధను వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసులో ఎనిమిదేళ్లుగా జైలు శిక్ష అనుభవించిన పిడతల సత్యంబాబును నిర్దోషిగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్యాయంగా కేసులో ఇరికించి మానసిక వేదనకు గురిచేసినందుకు ఎపి ప్రభుత్వం సత్యంబాబుకు లక్ష రూపాయల పరిహారంగా చెల్లించాలని శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. గుంటూరుకు చెందిన ఆయేషా మీరా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో ఉంటూ నిమ్రా కాలేజీలో బి ఫార్మసీ చదివేది. 2007 డిసెంబర్ 27న అదే హాస్టల్‌లో ఆయేషామీరాపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం రేకెత్తించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి సత్యంబాబును నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన విజయవాడలోని మహిళా కోర్టు సత్యంబాబునే దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. ఆయేషాను హత్య చేసినందుకు జీవితఖైదు, వెయ్యి రూపాయల జరిమానా, అత్యాచారం చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సత్యంబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ కేసును హైకోర్టు న్యాయమూర్తు సి.వి. నాగార్జునరెడ్డి, ఎం.ఎస్.కె.జైశ్వాల్ తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది.

“దళితుడైన సత్యంబాబును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. ఆయేషాను సత్యంబాబు హత్య చేశాడన్న ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. లేడీస్ హాస్టల్ గోడ ఎనిమిది అడుగులు ఎత్తు. ఆ గోడను రెండుసార్లు సత్యంబాబు ఎక్కి దిగాడని, రెండోసారి ఒక చేత్తో రోకలి బండ పట్టుకుని ఆయేషా గదికి వెళ్లాడన్న పోలీసు వాదన వాస్తవ విరుద్ధంగా ఉంది. అయిదున్నర అడుగులు ఎత్తు, 50 కిలో బరువున్న వ్యక్తి ఒక చేత్తో రోకలి బండ పట్టుకుని మరో చేత్తో 8 అడుగుల గోడ ఎలా ఎక్కగలడు. ప్రాసిక్యూషన్‌లో ఆయేషాతో సత్యంబాబుకు చిన్నతనం లోనే పరిచయం ఉందని ఒకరు, అత్యాచారం చేసేందుకే వచ్చాడని మరొకరు పరస్పర విరుద్ధంగా చెప్పారు. మరొ కరు సత్యంబాబుకు ఆయేషా యాధృచ్చికంగా కనపడిం దని చెప్పారు. ఈ సాక్ష్యాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉన్నాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఆయేషా నిరాక రించిందనే కోపంతోనే సత్యంబాబు హత్య చేశాడని ఒకసారి, లైంగిక వాంఛ తీర్చుకోడానికే హత్య చేశాడని మరోసారి పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగి నప్పుడు అదే హాస్టల్‌లో పక్కనే 55 మంది విద్యార్థినులు ఉన్నారు.

అలికిడికి ఒక్కరు కూడా నిద్ర లేవలేదా? అంతమంది ఉండగా అత్యాచారం చేస్తే అరుపు, కేకలు వినపడవా? పైగా ఆయేషా గదిలో పెన్ను, పెన్సిల్ తీసుకుని సత్యంబాబు రాశాడని చెబుతున్నారు. అత్యా చారం చేసి, హత్య చేసిన వ్యక్తికి అంతసమయం ఉండడు కదా? ఆయేషా శరీరంపైగానీ, మర్మాంగంపైగానీ గాయాలు లేవు. ప్రతిఘటించినట్లు కూడా ఆధారాలు లేవు. రెండుసార్లు సత్యంబాబు ఆయేషాపై అత్యాచారం చేశారన్నది పోలీసుల కట్టుకథేనని స్పష్టం అవుతోంది. పైగా ఆయేషా తల్లి అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తికి నార్కో టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు ఆ పరీక్ష చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్ధం కావడం లేదు. ఆయేషాపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని పోలీసులు చెప్పడం వెనుక అసలు దోషుల్ని తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చేందుకే అనిపిస్తోంది. పోలీసుల వైఫల్యాన్ని క్రింది కోర్టు గమనంలోకి తీసుకోలేదు. పోలీసులు చెప్పిన విషయాలను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు అర్ధం అవుతోంది. అందుకే క్రింది కోర్టు తీర్పు చెల్లదు. జీవిత ఖైదు, జరిమానా విధింపు తక్షణమే రద్దు చేయాలి. వేరే కేసులతో సంబంధాలు ఉంటే తప్ప సత్యంబాబును పోలీసులు వెంటనే విడుదల చేయాలి. ఈ కేసులో క్రింది కోర్టు తీర్పు మేరకు సత్యంబాబు ఏమైనా జరిమానా చెల్లించి ఉంటే వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

సత్యంబాబుకు ఖర్చు నిమిత్తం ఎపి ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లించాలి. సత్యంబాబుకు, అతని కుటుంబానికి పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి, మానసిక, శారీరక వ్యథకు పరిహారం చెల్లించాలనే ఆదేశాలు జారీ చేసే పరిధి కోర్టుకు లేదు. అందుకే ఉద్దేశపూర్వకంగా దురుద్ధేశంతో విచారించిన ఎపి సర్కార్‌పై దావా వేసేందుకు బాధితుడు సత్యంబాబుకు సర్వహక్కులు న్నాయి. దీనిపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం సత్యంబాబుకే ఉన్నాయి. సత్యంబాబును అన్యాయంగా కేసులో ఇరికించారు. సత్యంబాబుపై ఉన్న కేసులను కింది కోర్టు కొట్టేసినా అతన్ని పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడిగానే పరిగణించారు. సత్యంబాబు తప్పు చేయకపోయినా పోలీసులు అతన్ని విచారించి కేసులో ఇరికించారు. బలమైన రాజకీయ పార్టీ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా కేసులో ఇరికించారని సత్యంబాబు వాదనకు తమ ముందున్న ఆధారాలు సరిపోవడం లేదు అని డివిజన్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది. ఇలాంటి కేసుల్లో అమాయకులను అన్యాయంగా ఇరికించినప్పుడు గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రం ఒక అపెక్స్ కమిటీని 2017 ఫిబ్రవరి 14న ఏర్పాటు చేస్తూ జిఒ 20 జారీ చేసింది. ఈ కేసులో అసలైన దోషుల్ని గుర్తించేందుకు ఈ కేసును కమిటీకి సిఫార్సు చేస్తున్నాం. సత్యంబాబును అన్యాయంగా కేసులో ఇరికించి జైలుపాలు చేయడానికి కారణమైన పోలీసులను గుర్తించి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి” అని బెంచ్ తన కీలక తీర్పులో పేర్కొంది.

Comments

comments