Home లైఫ్ స్టైల్ సామాజిక చైతన్యమే విద్య

సామాజిక చైతన్యమే విద్య

He is the life of many social education movements

ఏక కాలంలో నాలుగు కాలాల అనుభవం, స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమంతోపాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకూ…ఇలా ఎన్నో సామాజిక విద్యా ఉద్యమాల జీవితం ఆయనది. ఐఐటి రామయ్యగా మొదలై  అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్యనందించిన విద్యావేత్త.  అనేక రంగాలను స్పృశించి ఎంతో  మందిని ఉత్తేజపరిచి సామాజిక ఉద్యమాలపై ప్రభావం వేశాడు. సామాజిక, రాజకీయ విద్యావేత్తగా, మేధావిగా ప్రముఖ స్థానం సంపాదించుకుని, 92 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా సమాజాన్ని చైతన్యం చేయడానికి మీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న విద్యావేత్త చుక్కా రామయ్య  తన అనుభవాలను మన తెలంగాణ సకుటుంబంతో పంచుకున్నారు.  

విద్య మనిషికి సామాజిక జ్ఞానం, చైతన్యం ఇవ్వాలి కాని వ్యక్తిగతంగా స్వార్థాన్ని ఇవ్వకూడదు.

సార్ మీ కుటుంబ నేపథ్యం ?
మాది వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గూడురు. మాది పురోహిత కుటుంబం. మా అమ్మనాన్నలకు మేము నలుగురం పిల్లలం. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నేను మా ఇంట్లో పెద్దవాడిని. మాకు ఆస్తులు, భూములు ఏమి లేవు. మా నాన్న పూజారి. అర్చకత్వం చేస్తూ మా కుటుంబాన్ని నడిపేవారు. ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు. అందర్నీ ఐఐటి, ఇంజనీరింగ్ చదివించాను. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు వారంతా అమెరికాలో ఉంటున్నారు.

మీ బాల్యం గురించి ..
నా చిన్నతనంలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఆ రోజుల్లో ఎక్కువగా బ్రాహ్మలు, కోమట్లు, రెడ్డిలు మాత్రమే చదువుకునేవారు. మా అమ్మానాన్నలు నాకు పురోహితం నేర్పించారు. ఉర్దూ చదివాను. మా ఊళ్లో చాతాని పంతులు నాకు చదువు చెప్పాడు. ఆ చదువు నాకు సామాజిక ధృక్పథాన్ని కలిగించింది. నేను మూడో తరగతి వరకూ ప్రైవేటు బడిలో చదువుకున్నాను. తరువాత హనకొండలో చదువుకుంటానంటే మా నాన్న వద్దన్నారు. ఎందుకంటే వాడు ఊరి విడిచి పోతే ఇక ఊరికి రాడని ఆయన ఉద్దేశం. తరువాత వరంగల్‌లో ఇంటర్ పూర్తి చేసి బిఎస్‌సికి హైదరాబాద్ వచ్చాను.

చుక్కా రామయ్య ఐఐటి రామయ్యగా ఎలా ఎదిగారు…
నేను మొదటగా 1951లో సంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగంలో చేరి 10 సంవత్సరాలు పని చేశాను. తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్‌సి మాథ్స్‌లో గోల్డుమెడలిస్టు అవార్డు వచ్చింది. ఆ తరువాత మళ్లీ సిద్దిపేటలో లెక్చరర్‌గా 12 సంవత్సరాలు పనిచేశాను. 1983 నాగార్జున సాగర్‌లో గవర్నమెంట్ కాలేజీలో వరకూ డిగ్రీ లెక్చరర్ , పిన్సిపాల్‌గా కూడా పని చేసి రిటైర్డ్ అయ్యాను.
అప్పటికి నాకు ముగ్గురు పిల్లలు. మా అమ్మాయిని ఐఐటిలో సీటు కోసం ముంబై తీసుకెళ్లినప్పుడు అక్కడ ఒక్కరు కూడా తెలుగువారు లేరు మా అమ్మాయి తప్పా..అప్పుడు మనమే ఐఐటి కోచింగ్ ఎందుకు చెప్పకూడదు అనుకుని గోరఖ్‌పూర్ వెళ్లి మెటీరియల్ బుక్స్ తీసుకువచ్చి 1983 నుంచి మా ఇంట్లోనే ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను.ఉదయం 4గంటలకు మొదలయ్యేది. ప్రతి బ్యాచ్‌కి 120 మంది ఉండేవారు. నా దగ్గర చదువుకున్న పిల్లల ప్రతిభను చూసి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అడిగేవారంట మీది ఏ ఇనిస్టిట్యూట్ అని అలా నా కోచింగ్ బాగా గుర్తింపు పొందడమే కాకుండా నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కోచింగ్ మాత్రమే ఇచ్చాను కాని ఐఐటి చదవలేదు. 2011లో ఆరోగ్యం సహకరించక చెప్పడం ఆపేశాను. ఇలా ఐఐటి రామయ్య అనే పేరు వచ్చింది నాకు. తెలంగాణలో ఐఐటి కావాలని పోరాటం చేస్తే చివరికి బాసరలో పెట్టించారు.

విద్యావేత్తగా విద్య గురించి మీ అభిప్రాయం….
విద్య అనేది మనిషికి సామాజిక జ్ఞానం ఇవ్వాలి కాని వ్యక్తిగతంగా స్వార్థాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు చదువులు విలువలను మరిచి, చదువంటే డబ్బు సంపాదించడానికే అన్నట్లుగా మారిపోయింది. అది అభివృద్ధి కాదు. సమ సమాజం వచ్చి వంద శాతం అక్షరాస్యత వైపు అడుగులు వేయాలి. 2005 లో ఎమ్‌ఎల్‌సిగా పని చేశాను. నా ఆధ్వర్యంలో ప్రతి బడిలో ఆడ పిల్లలకు టాయిలెట్స్ కట్టించాలనే బిల్లు ప్రవేశ పెట్టి వారికి వసతులు కల్పించడం జరిగింది. సిలబస్ పుస్తకాలు రాశాను. ఉపాధ్యాయులు సిలబస్ కోసమే పాఠాలు చెప్పకూడదు. ఎందుకంటే సమాజ అవగాహన విలువలు అనేవి స్కూల్లో ఉన్నప్పుడే నాలుగు గోడల మధ్య తీర్చిదిద్ద బడతాయి. అలా ఉపాధ్యాయులు కొత్త సమాజాన్ని తయారు చేస్తూ, విలువలతో కూడిన మనుషుల్ని దేశానికి అందించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడూ ప్రభుత్వ, ప్రజల ఆధ్వర్యంలో ఉండాలి.కాని ఇప్పుడు ప్రైవేట్ అయిపోయింది.

మీ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి …
నా సామాజిక చైతన్యానికి మా అమ్మ స్ఫూర్తి. మా ఊరు జాతీయ భావాలకు కేంద్రంగా ఉండేది. మా గ్రామంలో అస్పృశ్యత కూడా ఎక్కువ. దళితులు కనపడితే అశుభం అనుకునే పరిస్థితి ఉండేది. మాది పురోహిత కుటుంబం అయినప్పటికీ, నాకు చిన్నప్పటి నుండి కుల మత భేధాలు ఉండేవి కావు. నేను అంటరానితనం పోవాలని మా ఊరిలో దళితుల ఇళ్లకు పోయి వాళ్ల ఇండ్లలో తిని, వాళ్ల జీవన విధానాన్ని పరిశీలించేవాడిని. మాల మాదిగలకు సరిగ్గా పని దొరక్క పోయేది. ఇప్పటికీ అంటరాని తనం లేదని చెప్పడంలేదు. కాని ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నాం కాని మనిషి తత్వం జ్ఞానం అభివృద్ధి చెందుతుందా అని నా ప్రశ్న… ఇంకా మా ఊర్లో వయోజన కేంద్రం నడిపించేవారు. అక్కడ నన్ను “మాక్సిం గోర్కి రాసిన ‘అమ్మ’ నవల చదివి వినిపించమంటే చదివాను ,కాని వాళ్ల కోసం చదివిన నవల నాకు రాజకీయ, సామాజిక చైతన్యాన్ని ఇచ్చింది.

తెలంగాణ సాయుధ పోరాటం గురించి…
తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసే అవకాశం వచ్చినందుకు ఆ పోరాటంలో నా వంతు పాత్ర ఉన్నందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా. ఆ పోరాటం అంతా భూమి కోసమే చేశారు. ఆ పోరాటంలో నాకు ఒక సంవతరం జైలు శిక్ష పడింది. 1947లో ఖైదీలతో జైళ్ల్లు నిండిపోయాయి. అప్పుడు నన్ను ఔరంగాబాద్ జైలుకి పంపించారు. మాతో పాటు చాకలి ఐలమ్మ కూడా పని చేసిన సందర్భాలున్నాయి. ఇంకా కె.రామచంద్రారెడ్డి, కమలాదేవి, లాంటి వారందరితో కలిసి పనిచేశాను.ఆ పోరాటం ఈ మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి .

సమాజానికి మీరిచ్చే సూచనలు..
తెలంగాణలో ఎడ్యుకేషన్ వెనుకబడి ఉంది. 21వ శతాబ్దంలో కొన్ని ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే, మనం 19 శతాబ్దంలో ఉన్నాం. ఎడ్యుకేషన్ అభివృద్ధికి కావాల్సింది గుర్తించి అందుకోలేక పోతున్నాం. ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థను మెరుగు చేస్తే విద్య బాగుంటుంది. సమాజం బాగుపడుతుంది. పిల్లలకు ఆలోచనాశక్తి , సృజనాత్మకత పెరగాలి. సమాజాన్ని మెరుగుపరిచే చదువులు రావాలి కానీ మార్కెట్ కోసం కాదు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ప్రజల అభివృద్ధి రక్షణ కల్పించబడింది.. అంబేడ్కర్ కాంక్షను సమాజ అభివృద్ధి కోసం తు.చ తప్పకుండా అమలు చేయాలి.

                                                                                                                                                    – బొర్ర శ్రీనివాస్
                                                                                                                                                     ఫొటోలుః సుధీర్