Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నత్తే నయం

Heal the Snail

సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీ అస్తవ్యస్తం
54,613 గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడమే లక్షం
ఏడాది గడిచినా 14,104 యూనిట్లే పంపిణీ
రెండో విడత ప్రారంభించని వైనం
గడువులోగా పంపిణీ కష్టమే…
ఆందోళనలో గొల్ల, కురుమలు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: రాష్ట్రంలోని గొల్ల,కురుమలకు  లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతీష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా అధికారుల్లో చలనం కరువైనట్లు దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్‌పై పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రశ్నార్థాకంగా మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు విడుతల్లో జిల్లా వ్యాప్తంగా 54613 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా మొదటి విడుతలో భాగంగా ఇప్పటి వరకు అధికారులు 14104 గొర్రెల యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారు. మరో 40509 గొర్రెల యూనిట్లను జిల్లాలో పంపిణీ చేయాల్సి ఉంది. కాగా 2018-19 వార్షిక ఏడాది ముగింపుకు 9 నెలలు మాత్రమే గడువు ఉండడంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం అమలుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గొర్రెల యూనిట్ల మంజూరి ఇలా…
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి గొల్ల, కురుమ కుటుంబాలకు రాయితీ గొర్రెలను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో 75శాతం రాయితీపై గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇలా వీటి ని రెండు విడుతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతేడాది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొదటి విడుత కింద 27,075 గొర్రెల యూనిట్లు, రెండో విడుత కింద 27,538 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇలా రెండు విడుతల్లో 54,613 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇలా పంపిణీ చేసే రాయితీ గొర్రెల యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25లక్షలుగా నిర్ణయించింది. అందులో 75శా తం రాయితీ రూ.93,750లను ప్రభుత్వం భరిస్తుండగా మరో 25శాతం రాయితీ రూ.31,250లను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో రూ.1.11లక్షలను 20గొర్రెలు, ఒక గొర్రె పోట్టేలును కొనుగోలు చేసేందుకు కేటాయించారు. మరో రూ.6300లను గొర్రెల రవాణా కోసం మరో రూ. 3780లను గొర్రెల బీమా, రూ.3465లను దాణా,మరో రూ.425లను మందుల కోసం వినియోగిస్తుంటారు.

ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలో మూగజీవాల సంఖ్యను పెంచి గొల్ల, కురుమలకు ఆర్థిక పురోగతిని పెంచడంతోపాటు మటన్ ఎగుమతులను పెంచాలనే ఉద్దేశ్యం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించే గొర్రెలను ఇతర రాష్ట్రాల్లోనే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం జిల్లాలోని లబ్ధిదారులకు గొర్రెలను అందించేందుకు ప్రభుత్వం ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తోంది. కాగా వెళ్లిన చోట లబ్ధిదారులకు నచ్చిన గొర్రెలు లభించకపోవడంతో కాపారులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

రెండో విడుత ప్రారంభం ఎప్పుడో?
రాష్ట్ర ప్రభుత్వం రాయితీ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికీ ఏడాది గడిచినా ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలను సాధించలేకపోయింది. మొదటి విడుత కింద 27075 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా నేటికి 14104 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్ చేయగలిగారు. మరో 13వేల యూనిట్ల పంపిణీ జరగాల్సి ఉంది. కాగా ఏడాది గడిచినా సగానికిపైగా మాత్రమే యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. దీంతో మిగిలిన యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు మరింత గడువు పట్టే అవకాశం ఉంది. దీంతో రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తేనే గడువులోగా వీటిని పంపిణీ చేసే అవకాశం ఉంది. లేదంటే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం ఇదే విధంగా నత్తనడకన కొనసాగితే మరో రెండెళ్లు పట్టే అవకాశం ఉందంటూ కాపారులు ఆరోపిస్తున్నారు.

సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం : అబ్దుల్ రషీద్, ఏడీ, పశుసంవర్ధకశాఖ, మహబూబ్‌నగర్
జిల్లాలో 54,613 గొర్రెలను పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చే శాం. ఇప్పటి వరకు మొదటి విడుత కింద 14,104 యూనిట్లను పంపిణీ చేశాం. మిగితా యూనిట్లను సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తాం

Comments

comments