Home ఎడిటోరియల్ ఆరోగ్య చైతన్య కార్యక్రమాలతో క్షయవ్యాధిని అరికట్టాలి

ఆరోగ్య చైతన్య కార్యక్రమాలతో క్షయవ్యాధిని అరికట్టాలి

TBక్షయవ్యాధి (టిబి)ని ఒక భయంకరమైన వ్యాధిగా పాత రోజుల్లో పరిగణించేవారు. అప్పట్లో ఉన్న మూఢ నమ్మకాలు, సామాజిక చైతన్యంలో లోపాలు క్షయ రోగులను సమాజం దరిదాపుల్లోకి కూడ రానిచ్చేవి కాదు. అయితే రోజులు మారుతున్నాయి, ఇంచుమించు అన్ని వ్యాధులకు మందులు వస్తున్నాయి. ఇదే క్రమంలో లెప్రసి, పోలియో తదితర వ్యాధులు గణనీయంగా భారతదేశంలో తగ్గాయి. పోలియో రహిత భారతదేశంలో ఈ వ్యాధిపై ప్రజాచైతన్యం తీసుకురావటంలో అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ఉంది. ఇతను చేసిన నిరంతర చైతన్య కార్యక్రమాల వల్లే చాలా వరకు పోలియో టీకాన్ని ప్రజలు ప్రభుత్వం ద్వారా వినియోగించా రనవచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి భారత్‌ని పట్టిపీడి స్తున్న క్షయవ్యాధి ఇంకా లక్షల్లో ప్రబలుతూ ప్రతి నిముషానికి నలుగురిని పొట్టన పెట్టుకుంటున్నదన్న నివేదికలు అమితాబ్ బచ్చన్‌ని కలచివేసాయంటూ, అంతెందుకు స్వతహాగా తనే ఈ వ్యాధి బారిన పడి బాధపడటంతో ఈ వ్యాధిపై పలురకాలుగా చైతన్యం తీసుకువచ్చి నిర్మూలించాలనే ఉద్దేశంతో జాతీయ టిబి నియంత్రణ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
లభిస్తున్న గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 30లక్షల టిబి కేసులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల డ్బ్బై వేలమంది మృత్యువాత పడు తున్నారు టిబి వలన.
వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకపోవటం, తమకి ఈ వ్యాధి ఉంది అని తెలియకపోవటం వలన ప్రతి సంవత్సరం 22లక్షల కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ టిబి కేసుల్లో సుమారు 26% భారత్‌లో ఉన్నాయంటే దేశంలో వ్యాధి తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ టిబి వ్యాధికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 2006-2015 సం॥ మధ్యకాలంలో తమ వంతు కృషి ప్రపంచవ్యాప్తంగా చేసింది. అయితే ఈ కృషి పాక్షికంగానే సఫలీకృత మైందన టానికి నిదర్శనం ఇంకా వెలుగులోకి వస్తున్న కొత్త కేసులు. 2016-2035 సం॥ మధ్య కాలంలో టిబిని పూర్తిగా రూపు మాపాలని క్రొత్త పాలసీలు తెచ్చింది ప్ర.ఆ.స. 2035 సం॥కల్లా ప్రపంచంలో టిబి మర ణాలు 95% తగ్గించటమే ఈ పాలసీ లక్షం.
మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40వేల టిబి కేసులు ప్రతి సం॥ నమోదవు తున్న నివేదికలు వ్యాధి తీవ్రతను తెలుపుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ గణాం కాల ప్రకారం ప్రతి సం॥ లక్షమందిలో సగటున ‘115’ టిబి కేసులు తేలుతున్నాయి. ఈ కేసులలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1962 వ సం॥లో జాతీయ స్థాయిలో స్థాపించబడిన ‘జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం’ అనుకున్న స్థాయిలో వ్యాధి నియంత్రణ చేయట్లేదన్న ఉద్దేశంతో 1993వ సం॥లో ఈ కార్యక్రమంని సవరించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్షయవ్యాధి నిర్మూలనకి ‘రివైజ్డ్ నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రాం’ను భారత ప్రభుత్వం స్థాపించింది. దశలవారీగా అభివృద్ధి చెందుతూ వచిన ఈ సంస్థ తమ వంతు కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు అందట్లేదని తెలుస్తోంది. ప్రజల్లో టిబి మీద అవగాహన లేక నియంత్రణ – నిర్మూలన కష్టమవుతున్నది. టిబి వ్యాధి గ్రస్తులకి ప్రభుత్వం ఉచిత వైద్యం చేసి ఆరునెలల వరకు ఉచిత మందులు ‘నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రాం’ క్రింద ఇస్తుంది. ఒకవేళ మందులు ప్రభుత్వం నుండి పొందినా వాటిని తూచ తప్పకుండా వేసుకునేలా వ్యాధి గ్రస్తులకి అవగాహన కల్పించాలి.
మందుల అర్థాంతర నిలిపివేత వలన రోగం తిరగబడటమే కాకుండా వ్యాధి ముదిరి ఏ మందు పనిచేయని పరిస్థితి దాపురించిన సుమారు 64 వేల కేసులు భారతదేశంలో ఉన్నాయంటే ప్రజా చైతన్యంలో లోపం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ప్రభుత్వం – ప్రైవేట్ వైద్యశాలలు అనుసంధానంతో పని చేస్తూ ప్రభుత్వ ఖర్చుతో టిబి వ్యాధి నిర్మూలనకి జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన తేవాలి. ప్ర.ఆ.స ఆమోదిం చిన మందులతో ప్రభుత్వ వైద్యశాలల్లో అంతర్జాతీయ ప్రమాణా లతో జరిగే ట్రీట్‌మెంట్‌పై చైతన్యం కలిగించాలి. ఇలా చేస్తే తప్ప వ్యాధి నిర్మూలన కేంద్రీకృత స్థాయిలో కనపడదు.
ముందు ఫలితాలొచిన ఔషధాలు ప్రస్తుత కాలంలో టిబిపై పనిచేయకపోవటంవలన నిరంతరం టిబి మందులపై పరిశోధన జరుగుతుంది. క్రొత్తగా వస్తున్న మందులపై ఇప్పటికే పరిశోధనలు జరిగి మార్కెట్‌లోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. దాదాపు 15 టీకాలపై క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్నాయన్న ప్ర.ఆ.స “గ్లోబల్ టిబి రిపోర్ట్ – 2015” శుభసూచకం. టిబిని వైద్యవిపత్తుగా గుర్తించి సంబంధిత వైద్యపరీక్ష పరికరాలపై, మందులపై టాక్స్ కూడా తీసివేసే దిశగా ప్రభుత్వం కేంద్రస్థాయిలో ఆలోచనలు చేస్తే ప్రజలు టిబి బారిన పడకుండా ఆరోగ్యాలు కాపాడుకునే దారి సులభమవుతుంది.