Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాలికలకు ఆరోగ్య పరిరక్షణ కిట్లు

 Healthcare kits for girls

మన తెలంగాణ/పెద్దశంకరంపేట : విద్యార్థులు బడిమానేయకుండా ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో విద్యార్థునులు బడి మానేయకుండా వారికి వివిధ రకాల సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కస్తూర్బాల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పాఠశాలలకు రెగ్యులర్‌గా హాజరయ్యే బాలికలకు ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందజేయనున్నారు. మెదక్ జిల్లాలో దాదాపు 30 వేల మంది విద్యార్థునులకు ఈ కిట్లు అందజేయడంతో లబ్ది చేకూరనుంది. ఉన్నత స్థాయి తరగతుల నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యనభ్యసించే విద్యార్థునులకు ఈ కిట్లు అందజేయనున్నారు. దాదాపు రూ. 1600 విలువ చేసే కిట్లు సమకూర్చి ఆయా విద్యాసంస్థల ద్వారా వీటిని విద్యార్థునులకు అందించనున్నారు.ఆడుతూ పాడుతూ బడికి రావల్సిన ఆడపిల్లలు ప్రకృతి సిద్దమైన ఇబ్బందుల కారణంగా అప్పుడప్పుడు పాఠశాల, కళాశాలలకు గైరాజ్హరు అవుతున్నారు. వీరి ఆరోగ్యం పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు విద్యార్థునులకు అండగా నిలిచేందుకే నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. అడపిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి నెలకు నాలుగు విడతలుగా నాప్‌కిన్లు పంపిణీ చేస్తూ వాటితో పాటు మరికొన్ని వస్తువులను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసతి గృహాల విద్యార్థులకే పరిమితమైన ఈ ఆరోగ్య కిట్ల పంపిణీ ఇక నుంచి ఉన్నత తరగతి నుంచి ఇంటర్ స్థాయి విద్యార్థులకు అంచించాలని నిర్ణయించారు. ప్రతి మూడు నెలల కోసారి ఏడాది లో నాలుగు సార్లు రూ. 1600 విలువ చేసే ఆరోగ్య కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలో జిల్లాలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న దాదాపు 25,000 మంది తో పాటు మరో 5 వేల మంది ఇంటర్ విద్యారులకు సైతం ఈ కిట్లు అందనున్నాయి. కిశోర బాలికలుగా గుర్తించిన బాలికలకు ప్రత్యేకంగా వీటిని సరఫరా చేస్తారు. తద్వారా బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు నెలసరి సమయంలో పడే ఇబ్బందులనుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక కిట్లు సరఫరా చేయనున్నారు. ఇంతవరకు కస్తూర్బా వసతి గృహాలు, హాస్టళ్ బాలికలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్య కిట్ల పంపిణీ ఇక నుంచి అందరికి అందివ్వనున్నారు. ఆ సమయంలో నాప్‌కీన్‌లు కొనే ఆర్థిక స్థోమత లేక ఇతర ఆపరిశ్రుభమైన వస్త్రాలను వాడుతూ అనారోగ్యానికి గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోన లేక చాలా మంది విద్యార్థునులు ఆ సమయంలో పాఠశాలలకు, కళాశాలలకు గైర్హాజరు అవుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన తెలంగాణ సర్కారు ఆరోగ్య పరిరక్షణ కిట్లు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. గత మే నెలలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం పలువురు విద్యాభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కిట్లలో 9 రకాల వస్తువులు : ప్రభుత్వం విద్యార్థునులకు సరఫరా చేసే ఆరోగ్య పరిరక్షణ కిట్లలో 9 రకాల వస్తువులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో శానిటరీ నాప్కి న్లు, టూత్ పేస్టు, బ్రష్, కొబ్బరి నూనె, టికిలి బోట్లు, పౌడర్‌డబ్బా, ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుక, తదితర వస్తువులు ఉంటాయని తెలుస్తోంది. ఒక ప్రత్యేక ప్లాస్టిక్ బుట్టిలో వీటిని ఉంచి ప్యాకింగ్ కిట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కిట్‌లో అన్ని బ్రాండెడ్ వస్తువులే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కోక్క కిట్టుకు దాదాపు రూ. 400 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇవి ప్రతి మూడు నెలల కోసారి ఏడాదిలో నాలుగు విడతలుగా అందజేయనున్నారు. అంటే ఏడాదికి ఒక్కోక్క విద్యార్థిని పై దాదాపు రూ. 1600 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాధారణగాం పాఠశాలలు, కళాశాలలు 10 నెలల పాటు పని చేస్తాయి. కాని వీరికి సంవత్సరానికి ఉపయోగపడేలా ఆరోగ్య పరిరక్షణ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మండల వనరుల కేంద్రం నుంచి మండల పరిదిలోని పాఠశాలలు,కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్ల ద్వారా వీటిని విద్యార్థునులకు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి వీటిని ఆరంభించేందుకు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రభుత్వ యోచన ప్రశంసనీయం : ప్రభుత్వం పాఠశాల,కళాశాల విద్యార్థునుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించడం ప్రశంసనీయమని పలువురు భావిస్తున్నారు. ముఖ్యం గా సర్కారు బడుల్లో హైస్కూలు స్థాయి విద్యార్థునులకు శానిటరీ నాప్కీన్లతో పాటు హెల్త్‌కిట్లను అందజేయాలని ఆలోచించడం హర్షణీయం. దీంతో ఆడపిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. ఎదిగే వయస్సులో వ్యక్తిగత పరిశ్రుభత పాటించక పోవడం పట్ల ఆడపిల్లలకు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇన్‌ఫెక్షన్ కారణంగా వారు ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదముంది. హెల్త్‌కిట్ల పథకం ఎంతో ప్రయోజనకరం. దీంతో ఆడపిల్లలకు వారి వారి వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. నాప్‌కీన్లను ఉచితంగా ఇవ్వడం వల్ల వాటిని కొనలేని బాలికలకు ఎంతో మేలు చేకూరనుంది. వారు హెజెనిక్ పద్ధతులు నేర్చుకోగలుగుతారు.

Comments

comments