Home తాజా వార్తలు నిదురపో హాయిగా…

నిదురపో హాయిగా…

Healthy Sleepమూసిన కనురెప్పల మాటున కమ్మని కలలు కంటూ నిద్రించటం అనేది నిజంగా ఓ వరం. పగలంతా నిరంతరాయంగా పనిచేస్తున్న అవయవాలు చక్కటి నిద్రలో సేదతీరకపోతే రేపు ఉదయానికి శరీరానికి ఉత్తేజం అవదు. ఉత్సాహం రాదు. పసిబిడ్డలు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే వస్త్తుంది. నిద్రపోతేనే చక్కగా ఎదుగుతారు. కొంచెం పెద్దయ్యాక ఈ గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది.

ఇంత సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే నిద్ర పట్టకపోతే అన్నీ అనారోగ్యాలే. ఏ వయసు వారైనా హాయిగా నిద్రపోలేక పోతే ఆ నిద్రలేమి వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి కుంగుబాటుకు గురవుతారు. ఒక అధ్యయనం ప్రకారం మిగతా కారణాల వల్ల వచ్చే డిప్రెషన్స్ కన్నా, నిద్రలేమి వల్ల కుంగుబాటు ఏడురెట్లు ఎక్కువ ఇబ్బంది పెడుతోందని చెబుతోంది.
నిద్ర అవసరం గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే నిద్రలో మన మనసులో కొన్ని తరంగాలు లయబద్దంగా కదులుతూ ఉంటాయి. వాటిని షార్ట్‌వేవ్ రిపుల్స్ అంటారు. ఇవి జ్ఞాపకశక్తిని కలిగిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం జ్ఞాపకాలు మెదడులో హిప్పో కాంపస్ నియో కార్డెక్స్‌కు బదిలి అయి అక్నెడ్ జ్ఞాపకంగా నిలిచిపోతాయి. ఇవన్నీ జరగాలంటే నిద్ర పోవాలి. నిద్ర ఉంటేనే జ్ఞాపకాలు నిలబడతాయి. అసలు నిద్రలేకుండా మనిషి 11 రోజులు మించి బతకలేడంటారు వైద్యులు. నిద్ర విలువ తెలుసుకొని, ఇతర వ్యాపకాలతో నిద్రను దూరం చేసుకోవద్దంటారు.

ఆరోగ్యకరమైన నిద్రకోసం…

* ఒకే వేళకు నిద్రపోవటం ఒకే వేళకు నిద్రలేవటం వంటివి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.
*నిద్రపోయే ముందు, ఫోన్స్, ల్యాప్‌టాప్‌లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పక్కన పెట్టేయాలి.
వాటి నుంచి వెలువడే కాంతి నిద్రకు దూరం చేస్తుంది.
* ఎనిమిది దాటాక కాఫీ, టీ చాక్లెట్లు, ఇతర పానీయాలు తీసుకోకూడదు. అన్నింటిలోనూ కెఫైన్ ఉంటుంది.
* రాత్రివేళ భోజనం చాలా తేలికగా ఉండాలి. నిద్రకు భోజనానికీ మధ్య రెండు గంటల సమయం ఉండాలి.
* పడుకొనే గదిలో అతి తక్కువ వెలుగు ఉండాలి.
* శరీరాకృతికి తగినట్లు పరుపు, దిండు ఉండాలి.
* శరీరాన్ని సాగదీసి నిద్రించటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
చక్కని నిద్ర వస్తుంది. వెల్లకిలా పడుకొంటే శ్వాస సరైన తీరులో సాగుతుంది.

బెడ్ రూమ్ కేవలం నిద్రకోసం ఉండాలి. దాన్ని వర్క్‌ప్లేస్‌గా మార్చకూడదు. నిద్రకు ముందు చక్కని పుస్తకాలు చదువుకోవచ్చు. మంచి సంగీతం వినవచ్చు. నిద్రకు ఉపక్రమించే ముందర గోరువెచ్చని నీళ్లలో స్నానం చేస్తే మంచిది. శరీరపు ఉష్ణోగ్రత తగ్గి మంచి నిద్రవస్తుంది. ది జనరల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రెనాలజీ అండ్ మెటబాలిజమ్ లో ప్రచరితం అయిన ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేక బాధపడే వ్యక్తుల్లో శృంగారాన్ని ఉద్దేపింపజేసే హార్మోన్ల పాళ్ళు గణనీయంగా తగ్గుతాయి. అది దాంపత్య జీవితాన్ని దెబ్బ తీస్తుంది.

నిద్ర విలువ తెలుసుకోండి..

నిద్రచేసే మేలు తెలుసుకుంటే ఈ తరం యువత సోషల్ మీడియాను అవతల పెట్టి నిద్రపోయేందుకే చూస్తారు. బాగా నిద్రపోయే వారిలో ఏజింగ్ ప్రకియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. దీర్ఘకాలంపాటు యవ్వనం నిలిచి ఉంటుంది. ఆరోగ్యకరమైన నిద్రతో చర్మం ముడతలు పడదు.

చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు దోహదం చేసే కొలాజెన్ కణాలు చాలా కాలం పటుత్వంతో ఉంటుంది. కళ్ల కింద నల్లని ముడతలు రావు. నుదుటిపైన గీతలు పడవు. ఎలాగంటే పగటి శ్రమతో కలిగే ఒత్తిడితో కార్డిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్రవిస్తుంది. దీనితో మచ్చలు ముడతలు వస్తాయి. అయితే నిద్రలో దాని స్రావాలు ఆగుతాయి. కనుక చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది.
శరీరాన్ని కొవ్వులేకుండా ఉంచుకోవాలని చూసే వాళ్లు చక్కగా నిద్రపోవాలి. అలాగే చదువుకొనే వయసులో ఉన్నవాళ్లు నిద్రపోతే చురుకుదనం లోపిస్తుంది. ఏదైన అంశంపైన కేంద్రీకరించే శక్తీ, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు తగ్గుతాయి.
పగలంతా విశ్రాంతి లేకుండా పనిచేసిన శరీరానికీ మనసుకీ నిద్ర కావాలి. ఆ నిద్రలో భవిష్యత్ స్వప్నాలు రావాలి. ఆ నిద్ర లేకపోతే జీవితం కలతగా మారుతుంది.

శరీరాన్ని అనారోగ్యాలు ఆక్రమించుకొంటాయి. నిద్ర అవసరం తెలిసే కాబోలు చివరక ముల్లోకాలను పరిపాలించే బ్రహ్యాండనాయకుడిని కూడా భక్తులు జో అత్యుతానంద జోజో ముకుందా అంటూ కాసేపు నిద్రపొమ్మనే లాల పాటలూ, జోల పాటలూ పాడుతారు.

Healthy Sleeping Tips