Home అంతర్జాతీయ వార్తలు హృద్రోగులకు వూబకాయం

హృద్రోగులకు వూబకాయం

OBESITYవాషింగ్టన్ : గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారిలో వూబకాయం , ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల బృందం అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్‌లో అత్యంత తీవ్రస్థాయి స్టెమి తరహా గుండె జబ్బు రోగులు 3,900 మందిని 1995 నుంచి 2014 దాకా నాలుగు దఫాల్లో పరీక్షించిన అనంతరం ఈ విషయాన్ని తేల్చారు. హృద్రోగ చికిత్స కంటే, రోగ నివారణపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అధ్యయనం చెబుతోందని పరిశోధకుల్లో ఒకరైన భారతీయ వైద్య నిపుణుడు సమీర్ కపాడియా తెలిపారు. ఈ తరహా హృద్రోగుల్లో బరువు తగ్గించడం, సరైన ఆహారం తీసుకునేలా చేయడం, శారీరకంగా చురుకుగా ఉండేలా చేయడం కష్టసాధ్యమువుతోందని కపాడియా వెల్లడించారు. రోగుల ధమనులు పూర్తిగా గారతో పూడుకుపోవడంతో రక్త ప్రసరణ ఆగిపోయి అత్యధిక శాతం మరణాలకు, తీవ్ర వైకల్యానికి కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యాయామం, ధూమపానం ఆపడం, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. 20ఏళ్ల రికార్డులు పరిశీలించిన అనంతరం హృద్రోగుల ఆయు ప్రమాణం సగటున 64 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. వూబకాయం 31 నుంచి 40 శాతానికి పెరిగిందని లెక్కగట్టారు. మధుమోహం బారినపడేవాళ్లు 24 నుంచి 31 శాతానికి , అధిక రక్తపోటు 55 నుంచి 77 శాతానికి చేరిందని  కపాడియా స్పష్టం చేశారు.