Home లైఫ్ స్టైల్ వేడిపై దాడికి…

వేడిపై దాడికి…

Chaas

ఎండ సుర్రుమంటుంది..ఏమన్నా చల్లగా తాగాలనిపి స్తుంటుంది..వెంటనే ఏ కూల్‌డ్రింకో గడాగడా తాగేస్తుంటాం..అది ఆ కొంచెం సేపే బాగుంటుంది. తర్వాత దాహం డబల్ అవుతుంది.. దాహంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడేది మజ్జిగ. దీంట్లో కొంచెం కరివేపాకు, నిమ్మకాయ కలుపుకుని తాగితే ఆ హాయే వేరు.. ఎండలో బయటకు వెళ్లేవాళ్లు ఇలా తయారుచేసుకున్న మజ్జిగను బాటిల్‌లో పోసుకుని బ్యాగులో పెట్టుకోవాలి. దాహం వేసినప్పుడల్లా తాగితే  శరీరంలో నీటిశాతం పడిపోకుండా ఉంటుంది. వడదెబ్బ తగలదు. అంతేకాకుండా భోజనం చివర్లో మజ్జిగ అన్నం తిన్నా  లేదా మజ్జిగ తాగినా మొత్తం జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మజ్జిగలోని సూక్ష్మజీవులు, పోషకాల వల్ల శరీరానికి కలిగే మేలు అధికం. కొవ్వు పదార్థాలు చాలా తక్కువ.  పొటాషియం, విటమిన్  బి 12, రిబోఫ్లావిన్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల కడుపు పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. పేగుల్లో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులకు మజ్జిగ మేలు చేస్తుంది. అజీర్ణం, నీళ్ల విరోచనాలు,  డీహైడ్రేషన్ వంటి సమస్యలకు మజ్జిగ చక్కని పరిష్కారం. దాహాన్ని తీర్చడం, బరువుని తగ్గించడం, శరీరంలోని కొన్ని విషాలను తొలగించడం, పేగులను శుభ్రం చేయడం వంటి పనులను చేస్తుంది. మజ్జిగలోని  ప్రొటీన్లు సులభంగా జీర్ణం అవుతాయి. అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మజ్జిగ మంచి మందు. కడుపులో పుళ్లు రాకుండా, ఎసిడిటి సమస్య తలెత్తకుండా కాపాడుతుంది.