Home వార్తలు చలిపులి?

చలిపులి?

చలి మంచు దుప్పటి కప్పుకున్న చీకటి రాత్రులు, తెలి మంచు తెరల్లో చిక్కుకున్న ఉదయకిరణాలు చూస్తే చలికాలం వచ్చేసిందహో అంటూ టముకు వేసి పిలిచినట్లుండదూ…

గ్రామాల్లో రాత్రి వేళల్లో కర్రలు,మొద్దులు అన్నీ పోగు చేసి చలిమంట కాచుకుంటూ కబుర్లతో కాలక్షేపం చేయడం కోసం పిల్లలూ,పెద్దలూ అంతా ఎదురు చూడడంలో ఎంత సంబరం..

చదువుకోవడానికో,ఉద్యోగానికో వెళ్లడానికి టైమవుతుంటుంది. కాని తెల్లవారుతున్నా దుప్పట్లో మూడంకె వేసుకుని ముఖం మీదకి ముసుగు తన్ని పడుకుని లేవాలనిపించదు. అందులో ఎంత హాయి ఉంటుంది..

అల్లంత దూరం వరకు అలముకుని ఉన్న తెల్లటి పొగమంచుని చూస్తే..మబ్బుల్లో ఉన్నట్టు భావన..అలాటప్పుడు వేడి ఆవిర్లు చిమ్మే కాపీ రుచిని ఆస్వాదించడంలో ఆనందమే వేరు…

సాయంత్రం అవగానే గూటికి చేరిపోకపోతే చలిపులి తరుముతుందని కంగారు పడటంలోనూ,రంగు రంగుల,పలు వెరైటీల చలిదుస్తులు ధరించిమురిసిపోవడంలోనూ చలికాలం అంటే ఉన్న ఇష్టం కనిపించదూ…

ఇలా చలికాలపు చిరు అనుభూతులు,అనుభవాలు ఇష్టపడనివారెవరు చెప్పండి! కాని పళ్లు కొరికించి,ఒంట్లో వణుకు పుట్టించే చలి దాఖలాలు డిసెంబర్ నెల సగం అయిపోతున్నా కనిపించట్లేదు. బయటకు వెళ్తే నెత్తి మాడిపోయే ఎండ. ఇదేం విచిత్రం అంటూ చాలామందే అనుకుంటుంటారు. వాళ్లలో మీరూ ఉన్నారా..

chillsఇప్పుడు ఏ కాలమైనా ఎండాకాలం లానే అనిపిస్తుంది. మండించే ఎండాకాలం అయిపోయింది చిరుజల్లులు మురిపిస్తాయంటే అవీ నోచుకోవట్లేదు. ఎలాగోలా ఒకచోట కరువు,ఇంకోచోట వరదలతో అల్లాడించిన వర్షాకాలం ముగిసింది, తర్వాత వంతు చలికాలానిదే. కాని ఏకాలంలో అయినా ఎండ వేడి తప్ప ఇంకోటి కనిపించట్లేదు. ఏంటి ఈ పరిస్థితులకు కారణం? చిన్నా,పెద్దా అందరూ వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను గమనిస్తూనే ఉన్నారు. ఇక ముందు పిల్లలకు మనం ఏ రుతువులో ఉన్నామో కూడా గుర్తించలేని పరిస్థితి రావచ్చు. ఇప్పటికే లక్షణాలు కొద్దికొద్దిగా తెరమీదకి వస్తున్నాయి. సెప్టెంబర్,అక్టోబర్ వరకు వానలు విస్తారంగా పడితే నెమ్మదిగా అప్పటి నుంచే పెట్టెల్లోనో,బీరువాల్లోనో దాచిన స్వెట్టర్లు బయటకు వస్తాయి. పిల్లలకు స్కూల్ యూనిఫాం మీద వారి స్కూల్ ఎంబ్లమ్‌తో స్వెట్టర్ వేసి పంపాల్సి వస్తుంది. కాని ఇప్పటి వరకు ఆ జాడలేవీ కనిపించట్లేదు.ఎక్కడ చూసినా నేపాలీ వాళ్ల స్వెట్టర్ అమ్మకాలు జోరందుకుంటాయి. కాని వాళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.
వెచ్చని చలికాలం ముగిసీ ముగియగానే ఫిబ్రవరి నుంచే ఎండాకాలం మొదలైపోతోంది. అందరి మనసులో ఒకటే ప్రశ్న. ఇదేంటి? ఎందుకిలా జరుగుతోంది అని. చలి ఎక్కువ ఉంటే బయటకు వెళ్లలేక ఒణుక్కుంటూ ఇంట్లోనే కూర్చునే వాళ్లు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బయటకు వెళ్లి తమ పనులు చేసుకుంటున్నారు. చలి భయంతో దుప్పట్లో దాక్కునే అవసరం లేకుండా హాయిగా జాగింగ్,వాకింగ్,జిమ్ వర్కవుట్లు చేసుకుంటున్నారు.

నూట పధ్నాలుగేళ్ల నుంచి
మన దేశంలో గత వందేళ్లుగా చలికాలంలో వేడి పెరుగుతోంది. నూట పధ్నాలుగు ఏళ్లుగా ఎండాకాలం కంటే ఉష్ణోగ్రతలు చలికాలంలో పెరుగుతున్నాయి అని ఐఎమ్‌డి(ఇండియన్ మిటియొరలాజికల్ డిపార్ట్‌మెంట్) తన లెక్కల ప్రకారం తెలుపుతోంది. చలి మొదలవ్వాల్సిన అక్టోబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా,అక్టోబర్ కన్నా డిసెంబర్,ఫిబ్రవరిలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని చెప్తోంది. గతం కంటే డిసెంబర్,ఫిబ్రవరిలలో 1.5 సెల్సియస్ డిగ్రీలు,నవంబర్‌లో 1.4 సెల్సియస్ డిగ్రీలు,అక్టోబర్‌లో 1.1 సెల్సియస్ డిగ్రీలు వేడి పెరిగింది. నిజానికి వేడి అన్ని సీజన్లలో పెరుగుతోంది. కాని చలికాలం మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతోంది. ఈ వేడి పెరగడం ఇక్కడితో ఆగేట్టు లేదు. మన దేశంలో చలికాలంలో ఉష్ణోగ్రత రానున్న 2016 నుంచి 2035 వరకు0.4 నుంచి 0.8 డిగ్రీలకు,మళ్లీ 2046 నుంచి 2065 లోపు ఇంకో రెండు,మూడు డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పుడున్నదాని కన్నా రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. పైన చెప్పిన కాలాల్లో దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

గ్లోబల్ వార్మింగ్ కారణం
భారతదేశంలో వర్షాకాలం మరింత పెద్దదిగా ఉండబోతోందని, రాబోయే యాభై ఏళ్లలో సాధారణ సమయం కన్నా ముందుగానే వర్షాలు వస్తాయని, ఈదురు గాలులు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. వర్షాలు పెరుగుతాయి దాని వలన వాతావరణంలో తేమ అధికమవుతుంది. తద్వారా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు పడటంలో వచ్చే తేడాలు వ్యవసాయం మీద ప్రభావం చూపుతాయి. వర్షాల మీద ఆధారపడే వ్యవసాయం మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ తర్వాత వచ్చే చలికాలం మీద కూడా ప్రభావం చూపుతాయి. 2012 లో జరిగిన పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశోధకులు వాతావరణంలో వస్తున్న గణవీయమైన మార్పుల గురించి హెచ్చరిస్తున్నారు.రానున్న దశాబ్దాలలో ఈ పరిస్థితులు మరింత బలంగా అయ్యే అవకాశం ఉంది.
వర్షాకాలం తర్వాత,చలికాలం రాబోయే ముందు వేడి పెరుగుతోంది. ఏడాది మొత్తం మీద ఉష్ణోగ్రత దాదాపుగా 0.6 డిగ్రీలకు పెరుగుతోంది. ఎందుకిలా చలికాలాలు వేడెక్కుతున్నాయనేది ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు చర్చనీయాంశంగా మారింది. గ్లోబల్ వార్మింగ్,మానవ జన్య కార్యక్రమాల వలన జరుగుతుందనేది నిస్సందేహం.

ఎరోజల్స్ స్థాయి పెరిగితే..
వర్షాకాలం ముందు నెలల్లో విడుదలయే వాయువుల్లో ఎరోజల్స్ గ్రహింపు ఎక్కువ అవడమే వాతావరణం వేడెక్కడానికి కారణం. పర్యావరణంలో ఎరోజల్స్ అనే విడుదలలు పెరిగితే సోలార్ రేడియేషన్ భూమి ఉపరితలానికి తగ్గుతుంది. దానితో వర్షాకాలం తర్వాత,చలికాలం ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎరోజల్స్ స్థాయి పెరిగేకొద్దీ ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుంటుంది. గత నూట పధ్నాలుగేళ్లుగా జరిగే వాతావరణ మార్పులే కాక ఈ ఏడాది అక్టోబర్‌లో విపరీతమైన వేడి కనిపించింది. ఇలా జరగడానికి వర్షాలు పడకపోవడం కూడా ముఖ్య కారణమే. మబ్బులు ఏర్పడక సూర్య కిరణాలు భూమిని ప్రత్యక్షంగా తాకడం వలన ఉష్ణోగ్రత పెరుగుదల జరుగుతంది.

క్రిస్‌మస్ షాపింగ్‌లు పెరిగాయి
క్రిస్‌మస్ వేడుకలతో పాటు చలి గిజగిజలు కూడా ఉంటాయి. స్వెట్టర్‌లు,స్కార్ఫ్,గ్లోవ్స్,జాకెట్‌లు బీరువాల నుంచి బయటకు వస్తాయి. చలికాలం ముగిసే సమయం కూడా ఇదే. చలిని సాగనంపే సమయం కూడా సంక్రాంతి లోపే. నిండా చలిలో ఎంతకీ కరగని ఐస్‌క్రీమ్ తినడం ఇష్టపడేవాళ్లుంటారు. కాని ఇంకా మొదలవని చలిని సాగనంపేదెలా..
అయితే ఈ పరిస్థితి అన్ని ప్రదేశాల్లో లేదు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటే ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండ తన ప్రతాపాన్ని చూపుతోంది. మనమే కాదు, చలికాలం ఎక్కడ అని అమెరికన్లు కూడా వెతుక్కుంటున్నారు. డిసెంబర్ వచ్చేసినా ఇంకా సెప్టెంబర్ లాగానే ఉంది. అందుకే క్రిస్‌మస్ షాపింగ్‌లు కూడా జోరందుకున్నాయి. అమెరికాలో తూర్పు భాగంలో సగం ప్రడేశంలో చలికాలం సీజన్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల కనిపిస్తోంది. అత్యంత చలి ప్రదేశం అయిన అమెరికాలో 75 శాతం జనాభా వేడి పెరుగుతోందంటున్నారు. డిసెంబర్ సగం నెల అయిపోయినా షార్ట్‌లు వేసుకుని తిరుగుతున్నారుఅమెరికాలో వేరే సీజన్ల కన్నా చలికాలం వేడెక్కుతుందని సైంటిస్టులు,వాతావరణ మార్పు గురించిన అధ్యయనాలు చెప్తున్నాయి. కాని, పోయిన ఏడాదే కాదు గత 20 ళ్లుగా చలి పెరుగుతూనే ఉంది. గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికదారులు చెప్పేదంతా అబద్ధం అని అనేవారున్నారు. గత నలభై ఐదేళ్ల డేటా చూస్తే గ్లోబల్ వార్మింగ్ చాలా తక్కువ ఉన్నట్టే అంటున్నారు. అయితే, అత్యధికంగా మంచు కురవడం కూడా గ్లోబల్ వార్మింగ్ కిందకే వస్తుంది. మీరెక్కువ మురిసిపోకండి అని సమాధానమిస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికదారులు.

సోలార్ రేడియేషన్ మార్పులు
ప్రతి ఏడాది,ప్రతిరోజు,ప్రతి గంట వాతావరణంలో మార్పులు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. సరాసరి ఉష్ణోగ్రత,సరాసరి ఒత్తిడి,సరాసరి వర్షం వీటన్నిటినీ బట్టి వాతావరణాన్ని క్రమానుసారంగా కొలుస్తారు. ఆ సరాసరి,ఒక నెలకు,ఒక ఏడాదికి,చాలా ఏళ్లకు, ఎలాగైనా కావచ్చు. ఇలా సరాసరి కట్టి వాతావరణంలో జరిగే అతిమార్పులను లెక్కగడతారు. ఒక్కోసారి ప్రపంచంలో రెండు విభిన్న ప్రాంతాలలో ఏడాది ఉష్ణోగ్రతల సరాసరి చూస్తే సంఖ్యలో ఒకటే ఉండి ఉండచ్చు కాని, ఏడాది మొత్తంలో చూసుకుంటే తేడాలు తెలుస్తాయి. వాతావరణ మార్పులలో తేడాలకు కారణం, భూమి మీద విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో గ్రహించుకునే సోలార్ రేడియేషన్ మార్పులే కారణం. భూమధ్య రేఖ దగ్గరలో సోలార్ రేడియేషన్ గ్రాహ్యత ఎక్కువ ఉంటుంది. అదే ధృవంపై ఏటవాలుగా కిరణాలు పడే చోట సోలార్ రేడియేషన్ గ్రాహ్యత అంతగా ఉండదు. సూర్యుని కిరణాలు దగ్గరగా పడినప్పుడు వేడి,దూరంగా తాకినప్పుడు చల్లగా ఉంటుంది. వీటిలో వచ్చే తేడాలే ఉష్ణోగ్రతల్లో మార్పులకు కారణం అవుతున్నాయి.

నెల్లూరు ఉష్ణోగ్రత బట్టి అర్థం చేసుకోవచ్చు
ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ సైంటస్టులు గత రెండు దశాబ్దాలుగా వేడి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. 1961 నుంచి 2010 వరకు 103 ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అన్ని కాలాల్లో నమోదవుతున్నాయి. ఎండాకాలంలో అన్ని ప్రాంతాల కన్నా తెలుగు రాష్ట్రాలలో నెల్లూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆ వేడి లెక్కన చూసుకుంటే 1964 లో 30 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత ఉంటే గత యాభయ్యేళ్లుగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదవుతోంది. ఎండాకాలంలో ముస్సోరి,సిమ్లా,డార్జిలింగ్,డల్హౌసి లాటి ప్రదేశాల్లో గత యాభయ్యేళ్లుగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెంపు ఉంది. హిల్ స్టేషన్లలో కూడా ఈ వేడికి కారణం క్రమబద్ధీకరణ లేని నిర్మాణ చర్యలు,ట్రాఫిక్ కాలుష్యం,అడవులు కొట్టివేయడం లాటివి ఎన్నో కారణాలుగా నిలుస్తాయి.

ఇంకా నిరూపించాలంటున్నారు
చలికాలంలో పెరిగే వేడి వాతావరణంలో జరుగుతున్న మార్పులకు ప్రమాద ఘంటిక. వాస్తవానికి ఫిబ్రవరి కూడా చలికాలం కిందకే వస్తుంది. కాని ఫిబ్రవరికి ఎండాకాలం మొదలైపోతోంది. మన దేశంలో చలికాలం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. అయితే అది ఇప్పటి వాతావరణ పరిస్థితుల బట్టి జనవరి నుంచి ఫిబ్రవరికి కుదించబడినట్లే కనిపిస్తోంది. పరిశ్రమల కాలుష్యం, వర్షాలు లేకపోవడం వేడి పెరగడానికి కారణం అవుతున్నాయి. మీడియా తనవంతు తాను గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చలు జరుపుతూ, కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉంది. అయితే మెటీరియోలాజిస్ట్‌లు, గ్లోబల్ వార్మింగ్ జరిగిందని అప్పుడే చెప్పలేం, నిరూపించడానికి మరింత సమాచారం సేకరించాల్సి ఉందంటున్నారు.

అసలు చలిమాసాలు ఎప్పుడు
లెక్కప్రకారం చలికాలం ఢిల్లీ,హర్యాణా,పంజాబ్,జమ్మూ,కాశ్మీర్‌లలో మొదలైపోతుంది. అయినా అక్టోబర్ చలికాలం కిందకి రాదు. కేవలం సౌత్ వెస్ట్ రుతుపవనాల నుంచి నార్త్ ఈస్ట్ రుతుపవనాలకి మెల్లగా మారుతున్న ఉష్ణోగ్రతల్లో తేడా తెలుపుతుంది ఈ మాసం. మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,గుజరాత్,ఛత్తీస్‌గఢ్‌తో సహా భారతదేశంలో చల్లని వాతావరణం అక్టోబర్‌లోనే మొదలైపోతుంది. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకి తగ్గుతాయి. మంచుతెరలు కమ్ముకోవడం మొదలవుతుంది. మధ్య భారతంలో అంటే మధ్య ప్రదేశ్,గుజరాత్,మహారాష్ట్ర,గుజరాత్ లలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచుకురిసే చలికాలం. తమిళనాడు,కేరళ,కర్నాటక,బెంగుళూరులో చలికాలంలో 15,17 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయి. ఊటీలో 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్,పశిచమ బెంగాల్‌లో కూడా చలి నవంబర్ నుంచి తన సత్తా చూపుతుంది.

హైదరాబాద్‌లో మారుతున్న వాతావరణం
హైదరాబాద్‌లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు గ్లోబల్ వార్మింగ్‌కు ఉన్న సంబంధాల గురించి తర్జన భర్జన కూడా ఉంది. వాతావరణ మార్పులు హైదరాబాదీలను ప్రభావితం చేస్తున్నాయి. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 60 శాతం మంది నగరంలో వాతావరణంలో మార్పు వచ్చిందనే చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా వీచే గాలుల్లో కూడా మార్పులు ఉన్నాయని 2013 సర్వే నివేదిక చెప్తోంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, 64 శాతం మంది ప్రాథమిక స్థాయి విద్యార్థులు కూడా హైదరాబాద్ వాతావరణంలో మార్పులు తాము గుర్తించామన్నారు. అది నిజమని ఏడాదికేడాది తెలుస్తూనే ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ ఉష్ణోగ్రతలు 28,29 డిగ్రీలు ఉన్నాయి. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెరుగుతున్న వేడి వాతావరణంలో తగ్గుతున్న తేమను గురించి చెప్పకనే చెప్తాయి. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎండలోకి వెళ్లినా తెలిసేది కాదని, గాలిలో తేమను,చల్లదనాన్ని అనుభవించేవాళ్లమని, ఆశ్చర్యకరంగా హైదరాబాద్‌లో కూడా చెమట,ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయని చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు చెప్తున్నారు. సౌత్ ఈస్ట్ నుంచి రుతుపవనాలు రాకపోవడం,నార్త్‌ఈస్ట్ రుతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు బలోపేతం అవడం గాలిలో తేమ తగ్గడానికి కారణం అంటున్నారు. దానితో పాటు బంగాళాఖాతంలో ఒత్తిడి తక్కువ ఉండటం,నార్త్ ఈస్ట్ రుతుపవనాలు బలోపేతం అవడం వాతావరణంలో తేమ తగ్గడానికి కారణమే.

ఐక్యరాజ్యసమితి కృషి
వాతావరణంలో వచ్చే మార్పులకు మనం జియోలాజికల్ యుగం నుంచి చేస్తూ వస్తున్న కార్యకలాపాలే కారణం. 17 వ శతాబ్దం నుంచే గ్రీన్ గ్యాస్ పర్యావరణలోకి విడుదల అవడం,పట్టణీకరణ,అడవులు నరికివేత ఇవన్నీ కారణాలే. ఐక్యరాజ్యసమితి వాతావరణాల్లో వచ్చే మార్పులను త్రీవ్రమైన విషయంగా పరిగణిస్తోంది. ‘ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ’అనే విభాగం కిందకి వాతావరణ మార్పులు వస్తాయి. ప్రతిదేశం, వారి దేశంలో గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల గురించిన నివేదికను ఈ విభాగానికి సమర్పిస్తుండాలి. పర్యావరణాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం మీద మార్గదర్శకాలను 1984 లో యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ విభాగం ప్రచురించింది. అవి అన్ని దేశాలు అనుసరిస్తే పరిష్కారం లభిస్తుంది.

గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి?
ఇంత అనర్థానికీ కారణం గ్రీన్ హౌస్ వాయువులే. పర్యావరణం నుంచి పీల్చుకున్న నీటి ఆవిరి,కార్బన్ డైఆక్సైడ్,మీథేన్,నిట్రస్ ఆక్సైడ్,ఓజోన్,క్లోరోఫ్లూరోకార్బన్‌లు, వీటన్నిటినీ కలిపి గ్రీన్‌హౌస్ గ్యాసెస్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ వాయువుల ఫలితమే గ్లోబల్ వార్మింగ్. గ్రీన్‌హౌస్ వాయువులు పర్యావరణంలోకి చేరడానికి కారణం మనమే. కార్బన్ డైఆక్సైడ్,గ్రీన్ హౌస్ గ్యాస్‌కి ముఖ్య కారణం. అతిగా వాడే ఇంధనాల వినియోగం, మీథేన్,నిట్రస్ ఆక్సైడ్,హ్యాలో కార్బన్‌లు వాతవరణంలో మార్పులకు కారణం అవుతున్నాయి. మీథేన్,నిట్రస్ ఆక్సైడ్,హాలో కార్బన్లు, ఆవులు,పందుల వంటి జంతువుల వలన,వరి పంటల వలన,గనుల తవ్వకాల వలన విడుదల అవుతుంది. నిట్రస్ ఆక్సైడ్, వ్యవసాయం,భూమి నిర్వహణ,జంతువుల ఎరువుల నిర్వహణ,ఇంధనాల వినియోగం,ఎరువులు,నిట్రిక్ యాసిడ్ నుంచి విడుదల అవుతుంది.

– శ్రీదేవి కవికొండల