Home తాజా వార్తలు నీళ్లు ఫుల్

నీళ్లు ఫుల్

Heavy Flood Water Inflow to Sripada Yellampalli Project

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ప్రాజెక్టులకు భారీగా వరద తాలిపేరు, ఎల్లంపల్లి, కడెం రిజర్వాయర్లకు విశేషంగా నీరు                                                          నిండిన చెరువులు                                                                                                                                      కొట్టుకుపోయిన కరీంనగర్, నిజామాబాద్ ప్రధాన రహదారి అప్రోచ్ రోడ్డు                                                                          రెండు జిల్లాల మధ్య నిలిచిన రాకపోకలు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు,  సల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షాల కారణంగా  తాలిపేరు, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. మరోవైపు వాగులు ఉప్పొంగుతుండగా, మరోవైపు చెరువులు మత్తడి పోస్తుతున్నాయి. పలు చోట్ల వరద నీరు రోడ్లపై పారుతుండడంతో అనేక పట్టణాలు, గ్రామాలలో రాకపోకలు స్తంభించిపోయాయి. కరీంగనర్ నిజామాబాద్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుడడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ముంపు బాదితులందరు బిక్కుబిక్కుమంటు కాలం వెల్లబుచ్చల్సిన పరిస్థితి ఏర్పడింది.  వర్షం కారణంగా ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర  జిల్లాల ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. నిన్నమొన్నటి వరకు వరద తాకిడికి గురైన ప్రాంతాలన్నీ ఇప్పుడిప్పుడే తెరుకుంటుండగా మరో సారి ఒక పక్క గ్రామాలు, కాలనీలో వరద ముంపుతో తల్లడిల్లుతుండగా మరో పక్క పొంగిపోర్లుతున్న వాగులువంకలు జలశయలుగా మారుతన్న చెరువుల కారణంగా పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరద దెబ్బ నుంచిరైతులు కొలుకోకముందే మరోసారి నదులు, వాగులు పరివాహక ప్రాంతాల్లోని భూములు వరద నీటిలో మునిగి తెలుతున్నాయి.   వరద నీటి కారణంగా తెలంగాణ  ఆంధ్ర సరిహద్దులోని గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద దాదాపు 400 మంది చిక్కుకుపోయారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగాఉండాలని అధికారులు సూచిస్తూ కొన్ని గ్రామాలప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించి వారికివసతులు కల్పించారు. సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో లో భారీగా వరద నీరు చేరడం వల్ల గత మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్ ,కళ్యాణఖని, రామక్రిష్ణాపూర్,బెల్లంపల్లి, కైరిగూడ,డొర్లి-1, డొర్లి-2 ఓపెన్‌కాస్టులలో 36వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కేవలం బెల్లంపల్లి ఏరియాలోని మూడు ఓపెన్‌కాస్టులలో 20వేల టన్నుల బొగ్గుఉత్పత్తి నిలిచిపోయింది. పనుల స్థలాలలో వరద నీరు భారీగా చేరడంతో యంత్రాలు నడువడం లేదు.భద్రాచలం జిల్లాలోని మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన తాలిపేరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దిగువన ఉన్న తాలిపేరులోనికి పెద్ద ఎత్తున వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లను ఎత్తి 1 లక్ష 72 వేల 200 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు.

గత ఐదేళ్ల కాలంలో ఇంతపెద్ద ఎత్తున గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం ఇదే ప్రథమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి  పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఈరోజు ఉదయానికి గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వరద నీరు 43అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పత్తి, వరి, జామాయిల్ తోటలు గోదావరి నీటిలో మునిగాయి. భద్రాచలం రామాలయం పడమర మెట్ల వద్దకు వర్షపు నీరు చేరి మోకా ళ్ల లోతు వరకూ ప్రవహిస్తున్నాయి. రామాలయం వద్ద పలు దుకానాల్లోనికి వర్షపు నీరు చేరడంతో దుకాణాదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని తూర్పుగూడెం చెరువులోకి భారీ నీరు చేరి చెరువుకట్ట మధ్యభాగంలో కుంగిపోయింది. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన భూములు, నీట మునిగిన పంట పొలాల సంఖ్య లక్ష 23వేల ఎకరాలకు చేరుకుంది.

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నారాయణరెడ్డి ప్రాజెక్ట్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి నీరు అధికంగా ఉంది. అధికారులు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తివేసి 6916 క్యూసెక్కుల నీటిని గోదావరికిలోకి  వదిలారు. కాగా 2వ వరద గేటు విరిగి ఒకవైపు వంగిపోవడంతో భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోకు 2వ గేటు ఉంటుందా?  అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రాజెక్ట్‌లో 4 గేట్లు మొరాయిస్తుండగా, 2వ గేటు విరిగిపొయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.700 అడుగులు. కాగా ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదనీరు రావడంతో 4వ గేటు, 5, 6, 7, 8, 9, 11 గేట్లను 9 ఫీట్ల ఎత్తు వరకు  7916 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పెన్‌గంగతో పాటు కడెం వాగు, గడ్డెన్న వాగులు పొంగిపోర్లుతున్నాయి. బజార్‌హత్నూర్, సిరికొండ, ఇచ్చోడ పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కడెం ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి వరద నీరు ఉధృతంగావస్తున్న కారణంగా ఉదయం 6 గేట్లు తెరవగా సాయంత్రానికి 13 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు.

స్వర్ణా ప్రాజెక్టులో నీరు ఎగువ నుంచి ఉదృతంగా వస్తున్న కారణంగా రెండు గేట్లను తెరిచారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సదర్‌మాట్‌కు జలకళ సంతరించుకోంది.    మంచిర్యాల జిల్లా హాజీపూర్‌మండలంశ్రీపాద ఎల్లంపల్లిప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థం 20,175 టిఎంసిలు కాగా ప్రస్తుతం 19.003 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1,47,878 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,86,228 క్యూసెక్కులుఉంది. ప్రాజెక్టులో వాటర్ లెవల్ 148 మీటర్లకు గాను 147.07 మీటర్ల వద్ద నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి18 గేట్లనుఎత్తివేసి రెండు మీటర్ల పైకి దిగువకు నీటిని విడుదల చేశారు.  మంచిర్యాల జిల్లాలోని కొమురంభీం అడ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా ప్రస్తుతం 240.500 మీటర్లకు చేరుకుంది.