Home తాజా వార్తలు హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

Heavy Rain in Hyderabad

లోతట్టు ప్రాంతాలు జలమయం

పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

మన తెలంగాణ / హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ శాఖ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా కరెంటు సరఫరాను నిలిపివేయగా మరికొన్ని చోట్ల నిలిచిపోయింది. అనేక ప్రధాన రోడ్లపై వాహనాల రాకపోకలు స్థంభించిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకుపైగా కురిసిన వర్షం కారణంగా ముషీరాబాద్, ఆర్‌టిసి క్రాస్ రోడ్డు, విద్యానగర్, నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్, కాచిగూడ, సోమాజీగూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై జన జీవనం స్థంభించిపోయింది. హైదరాబాద్ నగరంలోని మైత్రీవనం దగ్గర 5.5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా షేక్‌పేటలో 4.5, గోల్కొండలో 2.5, ఖైరతాబాద్ 2.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవుదినం కావడంతో చాలా మంది నాంపల్లిలోని ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో వర్షం కారణంగా దారిలోనే చిక్కుకుపోయారు.

అకాల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు రెండు రోజుల ముందే హెచ్చరించారు. కొన్నిచోట్ల వడగళ్ళ వానలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వాన కురిసింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంగాధర మండలంలో జొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లింది. రామడుగు, చొప్పదండి మండలాల్లోను వాన ఎక్కువగానే కురిసింది. కుండపోత వర్షానికి హుజురాబాద్‌లో షాపులు, ఇళ్లల్లోకి నీరు చేరింది. కరీంనగర్ నగరంలో వర్షంలోనే గణతంత్ర వేడుకలు జరిగాయి. వేములవాడ ఆలయ పరిసరాల్లో నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వేములవాడ, చందుర్తి, కొనరావుపేట కుండపోత వర్షం కురిసింది. అటు పెద్దపల్లి జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం నమోదైంది. సిద్ధిపేట జిల్లాలోని నంగనూర్‌లో 10 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట లాంటి పలు చోట్ల వర్షం కారణంగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి సిబ్బందిని కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో 5రోజుల పాటు ఛండియాగాన్ని నిర్వహించిన మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం విశేషం.

Heavy Rain in Hyderabad