Home తాజా వార్తలు తడిసి ముద్దయిన ఉత్తర తెలంగాణ

తడిసి ముద్దయిన ఉత్తర తెలంగాణ

Heavy-Rain-in-North-Telanga

మన తెలంగాణ /హైదరాబాద్, న్యూస్ నెట్‌వర్క్ : రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ తడిసిముద్దయింది. పూర్వ ఆదిలాబాద్ జిల్లా కుంభవృష్టి ముంచెత్తడంతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఏటూరు నాగారం మండలం, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. పెన్‌గంగ, ప్రాణహిత, చాందవాగులు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. కరీంనగర్ జిలా, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.

హఠాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఆదిలాబాద్‌లో సైతం వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల మంత్రులంతా అప్రమత్తమయ్యారు. స్థానిక అధికారులనూ అప్రమత్తం చేశారు. సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాగులు ఉప్పొంగి రోడ్లు, బ్రిడ్జిలపై ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆదిలాబాద్ అతలాకుతలమయింది. కడెం ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇక్కడ 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. స్వర్ణ ప్రాజెక్టుకు 3 గేట్లు, గడ్డన్నవాగుకు 3 గేట్లు ఎత్తారు. మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నాలుగు గేట్లెత్తి నీటిని వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మంత్రి జోగు రామన్న, ఇతర ప్రజాప్రతినిధులు నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు.

బాధిత కుటుంబాలను ఓదార్చారు. వాగుపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఐదుగురు ఉపాధ్యాయులు నీటిలో కొట్టుకుపోయే సమయంలో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇచ్చోడలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నీట మునిగింది. దీంతో సిబ్బందిని, రోగులను సమీపంలోని ఇతర ప్రాంతాలకు తరలించారు. గురుకుల జూనియర్ కళాశాల గోడ కూలడంతో, పక్కనే ఉన్న వాగునీటితో కళాశాల జలమయమైంది. జైనథ్ మండలంలోని తర్నవాగు కోతకు గురయింది. మెట్‌పల్లిలో మహాలక్ష్మి అమ్మవారి వాగు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. కోరుట్ల, మెట్‌పల్లి మధ్యన ఆలపేట బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం పొంగి పొర్లుతోంది. కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్‌లో ఇంటి ప్రహరీగోడ కూలింది. వరంగల్ జిల్లా గౌరారం వాగు కరకట్టను, పుష్కర్‌ఘాట్ వద్ద కోతకు గురవుతున్న భూములను కలెక్టర్ అమయ్‌కుమార్ పరిశీలించారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, కళ్యాణఖని ఓపెన్‌కాస్టులతో పాటు బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో 106 గ్రామాలకు రవాణా సరఫరా నిలిచిపోయింది. వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదిలారు. కాగజ్‌నగర్‌లోని జగన్నాధపూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరగా, పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆర్‌టిసి బస్సు సర్వీసులు నిలిపివేశారు. కౌటగూడ ఆదివాసీ గ్రామం నీళ్ల మధ్యలో చిక్కుకుంది.

సుద్దాలవాగు ఉప్పొంగడంతో కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు సరఫరాను నిలిపివేశారు. పూసూరు వంతెన వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలంలో 163వ జాతీయ రహదారి వరద తాకిడికి కుంగిపోయింది. నిజామాబాద్‌లో వర్షాలు కురిసినా, పంటలకు నష్టం చేకూర్చేవిధంగా లేదు. పంటలకు ఊపిరిపోసేలా ఈ వర్షాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు నిండడంతో ఖరీఫ్‌కు భరోసా ఏర్పడింది. 4.66 లక్షల ఎకరాలు సాగు కాగా, సీజన్ పూర్తి చేస్తామన్న నమ్మకం రైతుల్లో ఏర్పడింది. దీనికి తోడు జిల్లాలో నిర్మించిన చెక్‌డ్యాంలు కూడా జలకళ సంతరించుకున్నాయి. భూగర్భ జలాల పెంపుకు, బోరుబావుల్లో నీటి ఊటలు పెరగడానికి ఈ వర్షాలు దోహదం చేస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

తుంగభద్ర, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా కొన్ని గ్రామాల్లో పంట నీట మునిగింది. తుంగభద్ర తీరంలోని 2000 ఎకరాల్లో పంట నీట మునిగింది. నదికి భారీగా వరద వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అయిజ మండలంలోని రాజాపూర్, కుట్కనూరు, పులికల్, కేశవరం, వేణిసోంపూర్, రాజోలి, తనగల, మాన్‌దొడ్డి, పెద్దొడ్డి, గ్రామాల శివారులోని పంట పొలాలు వరద తాకిడికి గురయ్యాయి. తుంగభద్ర నుంచి సుంకేషులకు భారీగా నీరు రావడంతో, దిగువకు నీళ్లు వదిలారు.