Home జగిత్యాల భారీ వర్షం… తడిసిన ధాన్యం

భారీ వర్షం… తడిసిన ధాన్యం

Heavy rain ... stained grain

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం

ధర్మపురి మండలం నేరెళ్లలో కూలిన ఇళ్లు

రాయికల్ మండలం ఆలూర్‌లో ఇంటిపై పిడుగు పడి వస్తువులు బుగ్గి

నర్సింహులపల్లెలో వరద నీటిలో కొట్టుకుపోయిన 140 క్వింటాళ్ల ధాన్యం

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సిఎల్‌పి ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్

అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఈ యేడు వర్షాభావ పరిస్థితులతో పంటలకు సాగు నీరు సకాలంలో అందక చాల వరకు ఎండిపోగా ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతన్న పడరాని పాట్లు పడ్డాడు. గత ఖరీఫ్ సీజన్‌లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీశాయి. వరి పంటకు దోమపోటు సోకి వేలాది హెక్టార్లలో పంట తుడిచిపెట్టుకుపోగా పత్తి పంటకు గులాబీ చీడ సోకి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఖరీఫ్ సీజన్‌లో సైతం పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కురిసి వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వు, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఇది చాలదన్నట్లు ఈ పక్షం రోజుల్లో రెండు మూడు సార్లు అకాల వర్షాలు కురిసి కొనుగోలు కేంద్రాల్లోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అన్నదాత పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బుధవారం కురిసిన వర్షంతో అన్నదాత కుదేలయ్యాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వరదనీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని, మా బతుకులకు భరోసా లేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

మనతెలంగాణ/జగిత్యాలమెట్‌పల్లి : మండలంలోని జగ్గాసాగర్ గ్రామానికి చెందిన బద్దం రాజిరెడ్డి (60) అనే రైతు బుధవారం కురిసిన అకాల వర్షంతో పిడుగు పడి మృతిచెందినట్లు ఎస్ శంకర్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మృతుడు రాజిరెడ్డి ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి సాగు పనుల కోసం వెళ్లగా అకాల వర్షంతో పిడుగు పడి మృతిచెందినట్లు ఆయన తెలిపారు.మృతుడి సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహయం అందించాలని స్థానిక సర్పంచు, గ్రామాస్థులు కోరుతున్నారు.
ధర్మపురి/బుగ్గారం: ధర్మపురి, బుగాగరం మండలాల్లో బుధవారం ఉదయం ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కురిసింది. ధర్మపురి వ్యవసాయ మార్కెట్‌యార్డుతో పాటు, తిమ్మాపూర్, రాయపట్నం, బుగ్గారం మండలంలోని గోపులపూర్, సిరికొండ, చిన్నాపూర్, యశ్వంతరావుపేట, మధ్దునూర్ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయి అపార నష్టాన్ని కలిగించింది. అదే విధంగా తూకం వేసి గోనె సంచుల్లో నింపిన ధాన్యం కూడా తడిసి ముద్దైపోయినాయి. ఈదురు గాలులకు కొన్ని ఇండ్ల రేకులు కొట్టుకు పోయాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిసీలించి, తడిసిన ధాన్యం గురించి జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులకు పోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్బంగా జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్ మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోస ఇచ్చారు. ఇప్పటికే 75శాతం కొనుగోల్లు పూర్తయ్యాయని, మిగిలిపోయిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విదంగా ధర్మపురి మార్కెట్ యార్డులోని తడిసిన ధాన్యాన్ని చైర్మన్ అల్లం దేవమ్మ పరిశీలించారు. అకాల వర్శం వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లనివ్వమని రైతులకు భరోస కల్పించారు. కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన వారిలో ధర్మపురి, బుగ్గారం తహసీల్దార్లు నవీన్‌కుమార తదితరులు ఉన్నారు.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి అపార నష్టం సంభవించింది. సుమారు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వేలాది క్వింటాళ్ళ ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరి కుప్పలు నీటమునగగా అక్కడక్కడ వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో 80 శాతం మేర కొనుగోళ్లు పూర్తి కాగా అక్కడక్కడ గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లలో జాప్యం జరగడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు తాము పడరానిపాట్లు పడుతున్నామని, కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఆకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. సాధ్యమైనంత తొందరగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే సూచించారు. కాగా ధర్మపురి మండలం నేరెల్లలో కందుల మంగవ్వ అనే మహిళ ఇళ్ళు వర్షానికి కూలిపోయింది. అలాగే ఓ వ్యక్తి పిడుగు పాటుకు గురై తీవ్ర గాయాలపాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామంలో ఇడగొట్టు బుగ్గయ్య అనే రైతుకు చెందిన ధాన్యం వర్షానికి తడిసిపోగా కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న రైతులు అడ్డుకున్నారు. బీర్‌పూర్ మండలంలోని నర్సింహులపల్లెలో భారీ వర్షం కురియగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసిన 140 క్వింటాళ్ళ ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది.ఆకాల వర్షంతో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఉదయం కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసింది. బుధవారం ఉదయం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దాంతో అమ్మకం కోసం రైతులు ధాన్యంకొనుగోలు కేంద్రాలకు తరలించిన వరిధాన్యం తడిసింది. రైతులు ధాన్యం తడువకుండా తమవద్ద ఉన్న టార్పాలిన్‌లు కప్పినప్పటికి కొంతమేరకు ధాన్యం తడిసింది.
చందుర్తి: చందుర్తి మండలం సనుగుల, మూడపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం వర్షంతో కూడిన పిడుగులు పడి రెండు పశువులు మృతి చెందాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సనుగుల గ్రామానికి చెందిన బూర్ల నడిపి కొమురయ్య తన ఆవును, మూడపల్లి గ్రామానికి చెందిన నక్క దేవయ్యకు చెందిన పాడి గేదెలను వారి చేల వద్ద ఉంచాడు. పిడుగులు పడడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. దీనితో దాదాపు ఒక్కొక్కరు రూ.50వేల వరకు నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు. వీరిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరారు.