Home వరంగల్ అంతా జలమయం..

అంతా జలమయం..

Heavy Rains Fall in All District In Telangana State

మన తెలంగాణ/మహాముత్తారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, రుతుపవనాల కారణంగా గత మూడు రోజుల నుంచి ఎడతెరపీ లేకుండా కురుస్తున్న భారీ వానలకు అంతా జలమయమైంది. మారుమూల అటవీ గ్రామాల్లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతోంది. పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచి అంతాజలమయంగా మారాయి. మహాముత్తారం మండలం దౌతుపల్లి-, యామన్‌పల్లి గ్రామాల మద్య కోణంపేట అలుగువాగు, పెగడపల్లి, కేశవాపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు సింగంపల్లి వద్ద పెద్దవాగు ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అటవీ గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఇప్పటికే రైతులు విత్తిన పత్తి చేలలో వర్షపు నీరు చేరడంతో పత్తి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంట పొలాల్లో చల్లిన నారుమడులు వర్షపు నీటితో మునగడంతో నారుమడులు మురిగి పోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరో రెండు రోజులు ఇదే విధంగా వానలు విజృంభిస్తే పత్తి మొక్కలు, నారుమడులు పెద్ద ఎత్తున దెబ్బతింటాయని రైతులు లబోదిబోమంటున్నారు.
ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు..!
గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని యామన్‌పల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో బకెట్లతో నీటిని బయటికి తోడుతున్నారు. ఇంటి చుట్టూ వర్షపు నీరు భారీగా నిలవడంతో ఇళ్లు కూలే ప్రమాదం ఉందని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితులు లేక పోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
* చెరువులకు జలకళ..!
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటల్లో వర్షపు నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి. అటవీ గ్రామాల్లో చెరువులు, కుంటల్లో వర్షపు నీరు చేరడంతో కళకళలాడుతున్నాయి. దీంతో ఈ ఏడాది వ్యవసాయ సాగులో అన్నదాతలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మండలంలోని పోలారం, స్తంభంపల్లి (పీపీ), కొర్లకుంట, జీలపల్లి, యామన్‌పల్లి, కనుకునూర్, పెగడపల్లి, బోర్లగూడెం, నల్లగుంట మీనాజీపేట, గండికామారం, రేగులగూడెం, మహాముత్తారం గ్రామ పంచాయతీల పరిదిలోని పలు గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండుతున్నాయి. దీంతో వరి సాగుకు ఈ ఏడాది డోకా ఉండదని అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.