Friday, April 26, 2024

కుండపోత వర్షాలతో ముంబై విలవిల

- Advertisement -
- Advertisement -

ముంబై: కరోనా కష్టాలు, లాక్‌డౌన్ చిక్కుల మహానగరం ముంబైని నైరుతి రుతుపవనం భారీ వర్షాలతో ముంచెత్తింది. ముంబై, సమీప ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షాలు కురిశాయి. దీనితో జనజీవితం భారీగా అస్థవ్యస్థం అయింది. రైలు పట్టాలపై నీరు నిలిచిపోయింది. వీటిపై నుంచే రైళ్లు పరుగులు తీశాయి. పలు ప్రాంతాలలో మురికివాడలు పల్లపుప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానిక రైళ్లు అనేకం నిలిచిపొయ్యాయి. ముంబై పరిసరాలలో భారీ నుంచి కుండపోత వర్షాలు పడుతాయని ముందుగానే వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. ముంబై, అక్కడికి సమీపంలోని థానే జిల్లాలకు వర్షాల తీవ్రతను బట్టి ఐఎండి ప్రమాదపు రెడ్ అలర్ట్‌ను వెలువరించింది. అదే విధంగా చుట్టుపక్కల ఉండే పల్గార్, రాయ్‌గఢ్ జిల్లాలకు కూడా ఇదే విధమైన సంకేతాలు పంపించారు. అక్కడక్కడా భారీ వర్షాలు ఉంటాయని రోజంతా వీడకుండా వానలు పడుతాయని హెచ్చరించారు. దీనితో అనేక ప్రాంతాలలో ప్రజలు అనివార్యంగా ఇళ్లకు పరిమితం కావల్సి వచ్చింది. రెండు నుంచి మూడు సెంటిమీటర్లు (గంట ప్రాతిపదికన) తీవ్రస్థాయి వరకూ వర్షాలు పడుతాయని తెలిపారు. దీనితో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో రంగంలోకి దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా శాటిలైట్ పరిశీలనలో ముంబై నగరం, శివారు ప్రాంతాలలో వర్షాల హెచ్చరికలు వెలువడ్డాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి శివార్లలోని థానే, నవీ ముంబైలోనివషీలకు వెళ్లే రైళ్లను రైల్వేట్రాక్‌లపై నీరు నిల్వ ఉండటంతో నిలిపివేశారు. కొన్ని రైళ్లు ఈ మార్గంలో బ్రేక్‌లు పడుతూ నడిచాయి. బుధవారం భారీ స్థాయిలో ముంబైలోకి రుతుపవనం ప్రవేశించిందని ఐఎండి ముంబై విభాగం అధినేత డాక్టర్ జయంత సర్కారు తెలిపారు. భారీ వర్షాలకు ముందు వెలువరించిన ప్రకటనలో నైరుతి రుతుపవనాలు ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలలోకి సకాలంలో చేరుకున్నాయనిచెప్పడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజులలోనే రుతుపవనాలు మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు అనువైన వాతావరణం, గాలిలో తేమ, కదలికలు వంటివి దండిగా ఉన్నాయని, పవనాల పయన వీలు వాలు అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. రెండు మూడు రోజులలో నాగ్‌పూర్ మీదుగా భద్రాచలం, తుని ఇతర ప్రాంతాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలపై థాకరే సమీక్ష
ముంబై ఇతర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో తలెత్తిన పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉన్నతస్థాయిలో సమీక్షించారు. పలు ప్రాంతాలలో నిలిచి ఉన్న నీటిని వెంటనే తొలిగించాలని, అధికారుల బృందాలు దిశలో చర్యలు తీసుకుని సాధారణ పరిస్థితులు, ప్రత్యేకించి రవాణా సౌకర్యాలు దెబ్బతినకుండా చూడాలని ఆదేశించారు. ఐఎండి అంచనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలను చేపట్టాలని, వచ్చే రెండు మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థల అధికారులతో సిఎం సమీక్ష జరిపారు.
రోడ్లపైకి వస్తే చిక్కులే
రెండు మూడు రోజుల వరకూ ముంబైవాలాలు అత్యవసరం అయితే తప్ప ఇళ్లు వదిలి వాహనాలతో రోడ్లపైకిరాకూడదని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచి ఉండటం వల్ల ద్విచక్రవాహనదారులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత తరుణంలో ఇప్పుడున్న కొవిడ్ చికిత్సా కేంద్రాలలో, వ్యాక్సినేషన్ సెంటర్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉందని సిఎం ఆదేశించారు.

Heavy Rains in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News