Search
Sunday 23 September 2018
  • :
  • :

సంక్షోభంలో బీడీ పరిశ్రమ

Help Telangana beedi workers  children study

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపుతున్న బీడి పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. రెండు జిల్లాల్లో రెండు లక్షల మంది కార్మికులు ఈ రంగంలో జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 18 శాతం జిఎస్‌టి విధించడంతో బీడీ పరిశ్రమ కుదేలైంది. కార్మికుల శ్రమ దోపిడీకి అలవాటు పడిన పెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిస్తున్నారు. నెలలో పది రోజులు మాత్రమే పని దొరకడంతో కార్మికులు పస్తులుండే పరిస్థితులు దాపురించాయి. బీడీ కంపెనీలు కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మూడేళ్లుగా బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు కావడం లేదు.  కార్మికుల పిల్లల దరఖాస్తులు ఏళ్ల తరబడి కమిషనర్ కార్యాలయంలో, దేశ రాజధానిలో పెండింగ్‌లో ఉన్నాయి. తంబాకుతో కార్మికుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని, వైద్యశాలలున్నా వైద్యసేవలు అందక కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు.  ఒకప్పుడు బీడీ కంపెనీలు కార్మికులకు చేతినిండా పని, సకాలంలో వేతనాలు అందించేవి. ప్రస్తుతం నెలకు 10 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారని వాపోతున్నారు. ప్రజలకు ఉపాధి లేక పరిశ్రమ  వెలవెలపోతుందని ఆందోళన చెందుతున్నారు. కార్మికులకు పెంచిన బకాయిలను చెల్లించడంలేదని ఆరోపిస్తున్నారు. కంపెనీలే టేకేదారులతో అడ్డదారుల్లో చట్ట వ్యతిరేకంగా వర్ది బీడీని తయారు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వెయ్యి బీడీలకు 156 రూపాయల కూలీల చెల్లిస్తుండగా వర్ది బీడీలో 80 నుంచి 90 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలు కార్మిక సంఘాలను  తమ అదుపులో పెట్టుకుని కార్మికుల సంక్షేమ పథకాలను నీరు కారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చనిపోతే నష్టపరిహారం మంజూరు, రాజీనామా చేస్తే వచ్చే డబ్బులు, పింఛన్ మంజూరు చేయడం, వైద్యసేవల పథకాలు మంజూరు చేయడం, ఉపకార వేతనాలు మంజూరు, బీడీ కార్మికులకు ఇండ్లు, సంక్షేమ పథకాలు కార్మికులకు  అందకుండా మోసాలు జరుగుతున్నాయని, యజమాన్యాలు సహకరించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.  వర్ది బీడీలను యజమాన్యాలే ప్రోత్స హిస్తూ తయారు చేయిస్తున్నాయి. వైద్యశాలలను విస్తరించి సంచార వైద్య సేవల వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు కార్మికులు కోరుతున్నారు. కార్మికులకు గతంలో ఉన్న వాహనాలను రద్దు చేశారు. పరిశ్రమలో బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి పనివారు పనిచేస్తున్నారు. కార్మికులకు పిఎఫ్ వర్తించడం పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. వర్ది బీడీ సెంటర్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. వర్ది బీడీతో కార్మికుల శ్రమ దోపిడీకి పాలుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. వర్ది బీడీ తయారీ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆడవుల్లో పెరిగే తునికాకు సేకరణ ద్వారా కాంట్రాక్టర్లు, ప్రభుత్వాధికారులు లాభపడుతున్నారు. పని చేస్తున్న కార్మికులందరికీ పిఎఫ్ సౌకర్యం లేక నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో దేశాయ్ బీడీ కంపెనీ, టెలిఫోన్ బీడీ కంపెనీ, శివాజి బీడీ కంపెనీ, శివసాగర్ బీడీ కంపెనీ, ఠాకూర్ బీడీ కంపెనీ, వాణి నవశక్తి బీడీ కంపెనినీ, చార్‌భాయ్ బీడీ కంపెనీలు పెద్ద ఎత్తున బీడీ తయారు చేస్తున్నారు. లోకల్‌గా వాణి నవశక్తి బీడీ కంపెనీ పెద్ద ఎత్తున బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. వేలాది కార్మికులతో, వందలాది సెంటర్లతో పరిశ్రమను విస్తరించి కార్మికులకు ఉపాధి చూపుతున్నారు.

Comments

comments