Home జాతీయ వార్తలు చెన్నైలో ముమ్మరంగా సాయం

చెన్నైలో ముమ్మరంగా సాయం

4చెన్నై వరదల్లో ఇప్పటికీ చిక్కుకుని డాబా మీద నుంచి చేతులు చాపుతున్న బాధితులకు
ఆదివారం నాడు తీర రక్షక దళం సాయం అందిస్తున్న దృశ్యం

చెన్నై: కొద్దికొద్దిగా కోలుకుంటున్న చెన్నైని ఆదివారం ఎడతెరిపిలేని వర్షాలు మరింతగా తడిసి ముద్ద చేసి, వణికించాయి. చెన్నై, శివార్లలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే వచ్చాయి. దీనితో సాధారణ జీవితం వెతుక్కుంటున్న ప్రజలకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. బస్సులు, రైళ్లు, ఫోన్లు పనిచేయడంతో క్రమంగా ఊపిరి పీల్చుకుంటున్న మహానగరం మందగమనంతో సాగాల్సి వచ్చింది. ఆదివారం చెన్నైలో 21.2 మిల్లీమీటర్లు, పరిసరాలలో 21.0 మిమిల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో ఆదివారం అయినప్పటికీ కొన్ని చోట్ల బ్యాంకులు పనిచేశాయి. దీనితో అక్కడ ఖాతాదారులు బారులు తీశారు. దాదాపు వారం రోజుల తరువాత అందుబాటులోకి వచ్చిన ప్రయాణ సౌకర్యాలను వినియోగించుకోవడానికి జనం జల్లుల్లోనూ తడుస్తూ రోడ్లపైకి వచ్చారు. పలుచోట్ల నిత్యావసర సరుకుల కోసం జనం బారులు తీరారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, కేరళలోని కొన్ని చోట్ల, కర్నాటక లోతట్టు దక్షిణ ప్రాంతాలలో తేలిక పాటి జల్లులు నమోదు అయ్యాయి. అయితే తమిళనాడులోని కడలూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే రెండు రోజులు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. చెన్నపురిలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి వర్షం పడుతూ వచ్చింది. వర్షంలోనే సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. చాలా మంది బస్సులు నడుస్తూ ఉండటంతో తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇప్పటికీ పలు కాలనీలు నీటి ముంపులోనే ఉన్నాయి. విద్యుత్ కోతతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధుల భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. మాధవరం, ఆర్కేనగర్‌లోని కాల నీల లో 5 అడుగుల వరకూ నీరు నిలిచి ఉంది. మునిగిన కాలనీలలో నీటి ని మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. అయితే ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
దేశీయ విమాన సేవలు ప్రారంభం
మూతపడి ఉన్న విమానాశ్రయం పరిసరాలలో పరిస్థితి చక్కబడటంతో ఆదివారం ఉదయం నుంచి దేశీయ ప్రయాణికుల విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. రన్‌వేలో పగటిపూట ప్రయాణాలకు వీలేర్పడటంతో విమానాల రాకపోకలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ రన్‌వేతో పాటు విమానాలు కూడా వరద నీటిలో మునిగి ఉన్నాయి. అయితే కొంచెం పరిస్థితి మారడంతో , రన్‌వేలపై తగు చర్యలు చేపట్టడంతో విమానాల రాకపోకలకు వీలేర్పడింది. ముడిచ్చురు, ఊరపక్కం ఇతర చోట్ల వరద నీరు నిలిచి ఉంది. దీనితో ఆయా ప్రాంతాలలో బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. బస్సులు చాలా నెమ్మదిగా కదులుతూ సాగాయి. అయితే షేర్ ఆటోలు, ఆటోలు ఇతర వాహనాలు రోడ్లపైకి రావడంతో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. దీనితో తిరిగి జనజీవితం కుదుటపడేందుకు వీలేర్పడింది. రెండు మూడు రోజుల వర్షబీభత్స సంబంధిత ఘటనలతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం మీద 250 వరకూ చేరిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇక సైన్యం ఇతర సిబ్బంది సాయంతో దాదాపు మూడున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మూగజీవాలనూ ఆదుకున్న సైన్యం
చెన్నైలో జనం దిక్కులేని స్థితిలో ఆసరా కోసం వెతుకులాటకు పరుగులు తీస్తూ, ఏదో ఒక నీడలో ఆశ్రయం పొందిన దశలో నగరంలో పలు మూగ జీవులు కుక్కలు, పిల్లులు, ఆవులు, ఇతర జంతువుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పలు చోట్ల వీధి కుక్కలు చాలా రోజులుగా నీటిలో తడుస్తూ గడపాల్సి వచ్చింది. ఇక వాటికి ఆకలి తీరే దారిలేకుండా పోయింది. బాధితులను ఆదుకునేందుకు కదిలిన సైన్యం ఆకలితో చివరికి అరవలేని స్థితిలో ఉన్న కుక్కలకు చూసి వాటికి బిస్కట్లు, బ్రెడ్డు ముక్కలు ఇతర ఆహార పదార్థాలు అందించింది. దీనితో పలు చోట్ల దారుణ స్థితిలో ఉన్న మూగజీవాలు బతుకు జీవుడా అనుకుంటూ కదిలాయి.
మద్రాసు కోసం తరలిన సినీ నటులు
తమిళనాడులో వరదబాధితులను ఆదుకునేందుకు దక్షిణాదికి చెందిన ప్రత్యేకించి టాలీవుడ్‌కు చెందిన సినీహీరోలు రంగంలోకి దిగారు. దగ్గుబాటి రానా, ధనుష్, అల్లరి నరేష్, సిధార్థ్ వంటి పలువురు నటులు చెన్నైకి చేరుకుని ఆదివారం పలుచోట్ల బాధితులకు ఆహారం, మందులు, బ్లాంకెట్లు అందించారు. ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తెరపైనే స్పందించడం కాదు, నిజంగా కూడా ప్రజల కష్టకాలంలో తామున్నా మంటూ ముందకు వచ్చారు. మన మద్రాస్ కోసం అంటూ వారు చేపట్టిన స్పందనకు విశేష స్పందన లభించింది. మన మద్రాసు కోసం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో హీరోల పేరిట నెలకొన్న శిబిరం వద్దకు సినీ అభిమానులు ఇతరులు వచ్చి తోచిన సాయం అందించారు. చెన్నై ఇతర ప్రాంతాల బాధితుల కోసం సంఘీభావం ప్రకటించడం తమ వంతు బాధ్యత అని హీరోలు తెలిపారు. తాము తమ వంతుగా సాయం అందిస్తామన్నారు.