Home తాజా వార్తలు నఫీజ్ చిత్రకళకు కెటిఆర్ ఫిదా

నఫీజ్ చిత్రకళకు కెటిఆర్ ఫిదా

Her pictures on metro stations

కండరాల వ్యాధితో బాధపడుతున్న చిత్రకారిణికి వైద్య సాయం
మెట్రో స్టేషన్లలో ఆమె చిత్రాలు
అనుకోని అతిథి రాకకు ఆశ్చర్యపోయిన నఫీజ్, ఆమె కుటుంబం 

మన తెలంగాణ / హైదరాబాద్ : పరిశ్రమలు, ఐటి శాఖమంత్రి కెటి రామారావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నా రు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న యువ పెయింటర్‌ను మంత్రి సర్‌ప్రైజ్ చేశారు. అరుదైన వ్యాధితో సతమతమవుతున్న షేక్ నఫీజ్ తనకున్న అద్భుతమైన పెయింటింగ్ కళను మాత్రం ఆపకుండా చిత్రాలను గీస్తూనే ఉన్నది. ఒక వైపు క్షీణించి పోతున్న కండరాల బలాన్ని సైతం ఎదిరిస్తూ కేవలం వీల్ ఛెయిర్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ తన కుంచె నుంచి అద్భుతమైన చిత్రాలను జాలువారిస్తూనే ఉన్నది. ఇలా తను గీసి న చిత్రాల్లోంచి అద్భుతమైన 50 చిత్రాలతో రవీంద్రభారతిలో శనివారం ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. సమాచారం తెలుసుకున్న మంత్రి కెటిఆర్ ఎగ్జిబిషన్‌ను తిలకించడానికి రవీంద్రభారతికి వచ్చి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అనుకోని అతిథిగా కెటిఆర్ రావడంతో నఫీజ్ ఆశ్చార్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమెతో ముచ్చటించారు.

ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. చిత్రకళా ప్రదర్శనను వీక్షించి ఆమె వేసిన పలు చిత్రాలను చూసిన కెటిఆర్ గొప్ప కళ నఫీస్ సొంతం అంటూ ప్రశంసలు కురిపించారు. ఒకవైపు అరుదైన వ్యాధి పట్టి పీడిస్తున్నా నిరాశ చెందకుండా మొక్కవోని ధైర్యంతో తన చిత్ర కళను కొనసా గిస్తున్న నఫీజ్‌కు అభినందనలు అని మంత్రి కెటిఆర్ అన్నారు. నఫీజ్ పట్టుదల ఎంతో మందికి స్పూర్తి నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు. తక్షణం పేద కళాకారులకు అందించే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని అక్కడి నుండే ఫోన్లో సాంస్కృతిక శాఖ సలహాదారు మామిడి హరికృష్ణతో మాట్లాడారు. దీంతో పాటు నఫీస్‌కు అవసరమైన వైద్య సహకారాన్ని నిమ్స్ వైద్యులతో అందిస్తామన్నారు. ఈ మేరకు తన కార్యాలయం బాధ్యత తీసుకుంటుందని భరోసానిచ్చారు. అలాగే నఫీజ్ చిత్రపటాలను మెట్రో స్టేషన్లలో ప్రదర్శించాలని తన వెంట ఉన్న మెట్రోరైల్ ఎమ్‌డి. ఎన్‌విఎస్ రెడ్డిని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అందుకు స్పందించిన ఎన్‌విఎస్.రెడ్డి పలువురికి స్పూర్తి కలిగించేలా నఫీస్ చిత్రపటాలను మెట్రో స్టేషన్లతో ఉపయోగిస్తామన్నారు. నఫీస్ రాష్ట్రంలోని పలువురి ప్రముఖుల చిత్రపటాలతో పాటు దేశ విదేశాలలోని ప్రఖ్యాతి గాంచిన వారి చిత్రాలను కూడా చిత్రీకరించింది. తన ప్రదర్శనకు అనుకోని అతిథిలా వచ్చిన మంత్రి కెటిఆర్‌ను నఫీస్ ధన్యవాదాలు తెలిపింది. ఇలా మంత్రి నుండి ప్రశంసలు దక్కడం తన చిత్రకళకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావుకు తాను గీసిన మంత్రి కెటిఆర్ స్వీయ చిత్రపటాన్ని నఫీస్ బహూకరించింది.