Home సినిమా మంచి నటుడు అనిపించుకోవాలనేదే నా కోరిక

మంచి నటుడు అనిపించుకోవాలనేదే నా కోరిక

aadi

వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నెక్ట్ నువ్వే’. ప్రభాకర్ దర్శకత్వంలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదితో ఇంటర్వూ విశేషాలు…

ఒక గొప్ప అనుభవం…
దర్శకుడు ప్రభాకర్ 20 నిమిషాల పాటు ఈ స్టోరీ లైన్ చెప్పారు. కథ నచ్చగానే వెంటనే ఈ సినిమాకే ఓకే చెప్పాను. ఆతర్వాత ఇది గీతా ఆర్ట్ నిర్మించనున్న చిత్రం అని చెప్పగానే సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేయడం ఒక గొప్ప అనుభవం.
సింగిల్ షెడ్యూల్‌లోనే…
తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు ప్రభాకర్ మంచి అనుభవం ఉన్న వ్యక్తిలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేవలం సింగిల్ షెడ్యూల్‌లో 37 రోజుల్లోనే సినిమా పూర్తిచేశారాయన.
మంచి కథలు చేస్తా…
హర్రర్ జోనర్‌లో నేను చేసిన తొలి సినిమా ఇది. ఫలానా జోనర్ సినిమాలే చేయాలనే రూల్ పెట్టుకోలేదు నేను. మంచి నటుడు అనిపించుకోవాలనేదే నా కోరిక. అందుకే మంచి కథలు ఎలాంటివైనా చేస్తాను.
అందుకే ఈ సినిమా చేశా…
ఈ సినిమా స్క్రీన్‌ప్లే నాకు చాలా బాగా నచ్చింది. హర్రర్‌తో పాటు కామెడీ కూడా కలగలిసి ఉన్న చిత్రమిది. అదే నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న అంశం. అందుకే ‘నెక్ట్ నువ్వే’ సినిమా చేశాను.
నా స్టైల్లోనే…
ఈ రీమేక్ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఒరిజినల్ వర్షన్ నుండి కథను మాత్రమే తీసుకున్నారు. తెలుగులో 60 నుంచి 70 శాతం మార్పులు చేశారు. అంతేకాకుండా అక్కడి హీరోను అనుకరించకుండా నా స్టైల్లో నేను ఈ సినిమా చేశాను.
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తా…
ఇకనుండి రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్తగా ఉండే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేయాలని అనుకుంటున్నాను. కొత్త దర్శకులతో పనిచేయాలని కోరుకుంటున్నాను.
నెక్ట్ మూవీస్…
స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాను. వాటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా.