Home తాజా వార్తలు ప్రపంచం పరిచయమైంది…

ప్రపంచం పరిచయమైంది…

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నానితో ఇంటర్వూ విశేషాలు…
బలమైన కారణం…
ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలోని స్టోరీ కాబట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టామని మాత్రం అనుకోవద్దు. ‘జెర్సీ’ అనే టైటిల్‌కు చాలా బలమైన కారణం ఉంటుంది. అదేంటన్నది సినిమా చూశాకే తెలుస్తుంది.
చాలా చెప్పేశాం…
ట్రైలర్‌లోనే సినిమా కథకు సంబంధించి చాలా చెప్పేశాం. అర్జున్ అనే క్రికెటర్ జీవితంలో ఏం జరిగిందనేదే ఈ కథ. కథ విన్న తర్వాత తక్కువ సమయంలోనే ఈ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్నా.
లాస్ట్ బ్యాట్స్‌మెన్‌ని…
నేను గల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో నేను లాస్ట్ బ్యాట్స్‌మెన్‌ని. కొన్నిసార్లు నా టీమ్‌లో అందరూ ఔట్ అయితే లేదంటే ఎవరికైనా దెబ్బలు తగిలితే నాకు అవకాశం వచ్చేది. ఇక ఈ సినిమా కోసం డేనియల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నాను.
ఆ ప్రకారమే చేశాం…
ఈ సినిమాలో నా పేరు అర్జున్ అయితే మా అబ్బాయి పేరు నాని. దర్శకుడు గౌతమ్ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు కూడా ఈ పేర్లతోనే రాసుకున్నాడట. ఆ ప్రకారమే ఈ సినిమా చేశాం. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
ఎంతో నమ్మకంగా ఉన్నా…
ఈ సినిమా విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాను. నటుడిగా నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. చాలా గొప్ప సినిమా చేశాననే ఫీలింగ్ నాకు కలిగింది. వంద శాతం హ్యాపీ ఎండింగ్ సినిమా ఇది.
ఎలాంటి ఇబ్బంది కలగలేదు…
దర్శకుడు గౌతమ్ తన కథను రెండున్నర గంటల్లో అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమాలో తండ్రిగా నటించినా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మంచి పాత్ర దొరికితే ముసలివాడిగా నటించమన్నా చేస్తా.
ప్రతి సీన్‌లోనూ కనిపిస్తాడు..
దర్శకుడు గౌతమ్‌ను చూడగానే చాలా నిజాయితీగా ఉన్నాడని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆయనలో ఇంత లోతు మనిషి ఉన్నాడా అనిపించింది. ఈ సినిమా చూశాక ప్రేక్షకుడికి ప్రతి సీన్‌లోనూ గౌతమ్ కనిపిస్తాడు.
ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా…
ఒకసారి విక్రమ్ వేదా పాట చూశాను. అందులో శ్రద్ధను చూడగానే చాలా జెన్యూన్‌గా అనిపించింది. సెట్‌లో ఆమె నటనను చూసి ఆశ్చర్యపోయాను. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంది.
గొప్ప అనుభవం…
సీనియర్ నటుడు సత్యరాజ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్నట్టుగా అనిపించింది.
ప్రపంచం పరిచయమైంది…
మనం ప్రపంచానికి పరిచయం కావడం కన్నా… ప్రపంచం మనకు పరిచయం కావడం ముఖ్యం. బిగ్‌బాస్‌తో అలా నాకు ప్రపంచం పరిచయమైంది.

Hero Nani Jersey movie interview