Home బిజినెస్ ఈ వారంలోనూ ఊగిసలాటే…

ఈ వారంలోనూ ఊగిసలాటే…

 bss

డెరివేటివ్స్ గడువు, బ్యాంకుల మోసం కేసులు, అంతర్జాతీయ అంశాలు కీలకం
 ఆచితూచి వ్యవహరించాలంటున్న నిపుణులు

ముంబై: ఈ వారంలోనూ ఊగిసలాటే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, బ్యాంకు మోసాల కేసులు, డెరివేటివ్స్ గడువు ఈవారంలోనే ఉండడం వంటివి మార్కెట్‌ను శాసిస్తాయని నిపుణులు అంటున్నారు. గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు తేదీ ఉండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని వారు సలహా ఇస్తున్నారు. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. మార్కెట్లు తీవ్ర ఒదిడుకులకు లోనవుతున్నాయి. వారమంతా ఒక రోజు లాభాలు.. మరో రోజు నష్టాల మధ్య ఆటుపోట్లకు లోనయ్యాయి. గత శుక్రవారం మార్కెట్ ముగింపునాటికి సెన్సెక్స్ 5 పాయింట్ల నామమాత్ర లాభంతో 34,011 వద్ద నిలిచింది. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం నీరసించగా, స్మాల్ క్యాప్ మాత్రం 0.75 శాతం బలహీనపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో రూ. 11,500 కోట్ల కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో గత వారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్‌బిఐ 8.3 శాతం, యస్‌బ్యాంక్ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. నీరవ్ మోడీ మోసం ఉదంతం ప్రభావంతో గీతాంజలి జెమ్స్ 36 శాతం, పిఎన్‌బి 20 శాతం చొప్పున కుప్పకూలాయి. అయితే ఇన్ఫోసిస్ 1.2 శాతం లాభపడింది. డిసెంబర్‌లో ఐఐపి(పారిశ్రామికోత్పత్తి సూచీ) వరుసగా రెండో నెల 7.1 శాతంతో పటిష్ట వృద్ధిని నమోదు చేసింది. జనవరిలో వినిమయ ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం 5.07 శాతానికి దిగివచ్చింది. డిసెంబర్లో ఇది 5.21 శాతంగా నమోదైంది. ఇక జనవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపిఐ) డిసెంబర్‌లో నమోదైన 3.58 శాతం పెరుగుదలతో పోలిస్తే 2.84 శాతానికి తగ్గుముఖం పట్టింది. జనవరిలో ఎగుమతులు 9 శాతం పుంజుకుని 24.38 బిలియన్ డాలర్లను చేరాయి. దిగుమతులు మరింత అధికంగా 26 శాతం వృద్ధితో 40.7 బిలియన్ డాలర్లను తాకాయి.

26న హెచ్‌జి ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ ఐపిఒ

bs1

జోధ్‌పూర్‌కు చెందిన హెచ్‌జి ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ ఈనెల 26న ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)తో రానుంది. ఈ ఆఫర్ లక్షం రూ.462 కోట్లు సమీకరణ అని కంపెనీ వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కంపెనీ హెచ్‌జి ఇన్‌ఫ్రా  షేరుకి రూ. 263-  270 ధర శ్రేణిలో చేపట్టిన ఇష్యూ చేపట్టనుంది. ఈ ఆఫర్ 28న(బుధవారం) ముగియనుంది. నిధులను పరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపు, సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 55 షేర్లకు దరఖాస్తు చేయాలని, ఇంతకంటే అధికంగా అంటే రూ.2 లక్షల విలువకు మించకుండా ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండటంతోపాటు 60 లక్షల షేర్లను విక్రయం చేపట్టనుంది. వీటిలో ప్రమోటర్లు రూ. 162 కోట్ల విలువైన షేర్లను సేల్ చేయనున్నారు. 2003 సంవత్సరంలో ప్రారంభమైన హెచ్‌జి ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల రంగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్(ఇపిసి) విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తోంది. రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో కార్యకలాపాలు విస్తరించింది. వీటితోపాటు నీటిపారుదల ప్రాజెక్టులలోకి ప్రవేశించింది. రాజస్తాన్‌లో టర్న్‌కీ పద్దతిలో నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతోంది.  2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 36 శాతం వృద్ధితో రూ. 974 కోట్ల ఆదాయం సాధించింది. నికర లాభం 63 శాతం వృద్ధితో రూ.49 కోట్లను చేరింది.

టాప్ 10లో ఐదింటికి నష్టాలు

bs

గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఐదు సంస్థలు భారీగా రూ.38,724 కోట్ల మార్కెట్ విలువ(ఎంక్యాప్)ను కోల్పోయాయి. వీటిలో ఎస్‌బిఐ అత్యధికంగా నష్టపోయాయి. ఇంకా టిసిఎస్, ఐటిసి, మారుతీ సుజుకీ, ఒఎన్‌జిసి వంటి కంపెనీలు కూడా ఎంక్యాప్‌ను కోల్పోయాయి. మిగతా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు మాత్రమే గతవారం లాభాలను అందుకున్నాయి. ఎస్‌బిఐ మార్కెట్ విలువ రూ.21, 278 కోట్లు తగ్గి రూ.2,34,576 కోట్లకు చేరింది. ఐటి దిగ్గజం టిసిఎస్ విలువ రూ.6,719 కోట్లు పడిపోయి రూ.5,62, 265 కోట్లు అయింది. ఎఫ్‌ఎంసిజి దిగ్గజం ఐటిసి ఎంక్యాప్ రూ.6,036 కోట్లు క్షీణించి రూ.3,24, 765 కోట్లకు చేరగా, మా రుతీ సుజుకీ ఇండియా మార్కెట్ విలువ రూ.3,216 కోట్లు తగ్గుముఖం పట్టడంతో మొత్తం విలువ రూ.2,67,039 కోట్లకు చేరింది. ఆయిల్ దిగ్గ జం ఒఎన్‌జిసి ఎంక్యాప్ చూస్తే రూ.1,476 కోట్లు పడిపోయి రూ.2,39,468 కోట్లకు తగ్గింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.15,045 కోట్లు పెరిగి రూ.5,83,817 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విషయానికొస్తే మార్కెట్ విలువ రూ.7,037 కోట్లు పెరిగి రూ.4,87,243 కోట్లు కాగా.. హెచ్‌డిఎఫ్‌సి ఎంక్యాప్  రూ.6,803 కోట్లు జంప్ చేసి రూ.2,90,140 కోట్లు అయింది. ఇక హెచ్‌యుఎల్ విలువ చూస్తే  రూ.3,690 కోట్లు లాభపడి రూ.2,92,735 కోట్లు అయింది. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2,850 కో ట్లు పెరిగి రూ.2,45,678 కోట్లకు చేరింది. గత వారం సెన్సెక్స్ దాదాపు 286.71 పాయింట్లు (0.84 శాతం) పడిపోగా, నిఫ్టీ 93.20 పాయింట్లు (0.88 శాతం) క్షీణించింది. టాప్ 10 ర్యాంకింగ్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, మారుతీ సుజుకీ ఇండియా, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ ఉన్నాయి.