Tuesday, April 23, 2024

అయోధ్యలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

High Alert in Ayodhya following Terror Threat

 

ఐఎస్‌ఐ సైగలతో ఉగ్రదాడికి పన్నాగం
రామాలయ భూమిపూజ విఘ్నానికి ప్లాన్
ఇంటలిజెన్స్ సమాచారంతో నిఘా తీవ్రం

న్యూఢిల్లీ/అయోధ్య: ఉత్తర ప్రదేశ్‌లోని రామజన్మభూమి స్థలాన్ని లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగుతారనే నిఘా సమాచారం అందింది. దీనితో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అత్యున్నత స్థాయి నిఘా హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణానికి సంబంధించి భూమిపూజ, శంకుస్థాపన జరుగుతుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భారత్‌లో రామాలయ నిర్మాణం అత్యంత సున్నితమైన మత విశ్వాసాల అంశం కావడంతో ఈ ప్రాంతంలోనే దాడులకు దిగాలని, రామజన్మభూమి స్థలానికి తీవ్రస్థాయి నష్టం కల్గించాలని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ స్చెచ్ వేసుకుంది.

ఇందుకోసం కశ్మీర్ మీదుగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటేలా చేసిందని నిఘావర్గాలకు సమాచారం అందింది. రామమందిర నిర్మాణ పనుల భూమిపూజ వేడుకను భగ్నం చేసేందుకు ఆగస్టు 5వ తేదీన లేదా ఆ తరువాత ఆగస్టు 15లోగా విధ్వంసకాండ సృష్టించాలని తలపెట్టారని వెల్లడైంది. అయోధ్యకు వచ్చే అన్ని మార్గాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ప్రత్యేకించి కశ్మీర్ సరిహద్దులలో, ఢిల్లీ నుంచి యుపి వైపు వచ్చే దారులలో భద్రతా బలగాలు, మఫ్టీ నిఘావర్గాలు సిద్ధంగా ఉంచారు. అయోధ్యలో అత్యంత సామరస్య వాతావరణం నడుమ రామజన్మభూమి పనులు నిర్వహించేందుకు ఓ వైపు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక ముస్లింసోదరులు కూడా ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని ప్రకటించారు.

పట్టణంలో అసంఖ్యాకమైన మసీదులు, దర్గాలలో తరాలుగా తమ మతపరమైన విధివిధానాలను ఎటువంటి ఆటంకం లేకుండా అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, తమకు సామరస్య అయోధ్య ముఖ్యమని తెలిపారు. భూమి పూజ నిర్వహణ రోజు, జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు రోజు ఒక్కటే కావడం, ఇవి రెండు కూడా ఆగస్టు 5వ తేదీనే రావడంతో ఉగ్రవాదులు దాడులకు దిగి తమ ఉనికిని చాటుకుంటారని వెల్లడైంది. భూమి పూజకు వచ్చే అత్యంత ప్రముఖులు, అయోధ్య రామాలయ నిర్మాణ ప్రక్రియలో ఫైర్‌బ్రాండ్‌లు అయిన అద్వానీ, జోషీ, ఉమాభారతి వంటివారు, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు తరలివస్తున్నారు. దీనితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, యుపి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు.

ఈ జాబితాను పరిగణనలోకి తీసుకుని ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నినట్లు వెల్లడైంది. ప్రధాని హెలికాప్టర్ దిగే సాకేత్ మహావిద్యాలయం నుంచి రామజన్మభూమి వరకూ ఇప్పటికే భద్రతా దళాలు మోహరించాయి. రామ్‌కోట్ ప్రాంత నివాసితుల రాకపోకలకు వీలుగా ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. ఈ పాస్‌లు లేని వారిని రామజన్మభూమి ప్రాంతమైన రామ్‌కోట్‌లోకి అనుమతించడం లేదు. ఇంటింటి తనిఖీలు కూడా చేపట్టారు. భద్రతా బలగాలు మాక్ డ్రిల్స్‌నిర్వహించాయి. ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు కదలికలను పసిగడుతున్నట్లు అధికారులు తెలిపారు.

High Alert in Ayodhya following Terror Threat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News