Home తాజా వార్తలు సభ రద్దు ఎందుకు ?

సభ రద్దు ఎందుకు ?

High Court is straightforward question for pill petitioner

పెట్టుకుంటే తప్పేమిటని పిల్ పిటిషనర్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
పార్టీలు సభలు జరుపుకోవడం సహజమని స్పష్టీకరణ : 7కి వాయిదా

మన తెలంగాణ/ హైదరాబాద్ : ‘రాజకీయ పార్టీ ఏదైనా సభలు నిర్వహించడం పరిపాటి. ఏ పార్టీ సభ పెట్టినా భారీగా జనం వచ్చేలా చేస్తాయి. రాజకీయ పార్టీల లక్ష్యం అలాగే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్టీ సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రగతి నివేదిన సభకు అనుమతిని ఏ విధంగా రద్దు చేయాలి. పైగా సభ నిర్వహించేది ఆదివారమాయే. ఆదివారం సభ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందో చెప్పండి. ఫలానా వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి. కచ్చితంగా విచారించి ఉత్తర్వులు ఇవ్వగలం. పదేపదే అసౌకర్యం.. అసౌకర్యం.. అని చెప్పడంతో సరిపోదు. అవేమిటో చెప్పాలి’ అని హైకోర్టు ప్రశ్నించింది. టిఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు అనుమతిస్తే చట్ట పరంగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా ఉల్లంఘనే అవుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా నడిగడ్డ పర్యావరణ సమితి అధ్యక్షు డు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు పైవిధంగా పిటిషనర్‌ను నిలదీసింది.

న్యాయమూర్తులు రమేశ్ రంగనాథన్, ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట శుక్రవారం పిల్ తరఫున లాయర్ శిశకిరణ్ వాదనల సందర్భంగా హైకోర్టు ఈ ప్రశ్నలు సంధించింది. ఆదివారం సభ అంటే ఎవరికీ ఇబ్బందులు ఉండబోమని, రోగులకు, ప్రజలకు, విద్యార్థులకు ఇలా ఎవరికైనా ఇబ్బందులు వస్తే జోక్యం చేసుకునేందుకు వీలుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించాయని, ఎప్పుడూ కోర్టులు జోక్యం చేసుకోలేదని పేర్కొంది. భారీ సభలు నిర్వహించడమే పార్టీల ఉద్దేశమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని బెంచ్ అభిప్రాపయడింది. సభ కోసం ఆదివారం జరగాల్సిన మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ పరీక్షను కూడా రద్దు చేశారని న్యాయవాది చెప్పగానే హైకోర్టు బెంచ్ కల్పించుకుని.. దీనిపై విడిగా కోర్టును ఆశ్రయించవచ్చునని సూచన చేసింది. ‘టీఆర్‌ఎస్ పార్టీ రూ.200 కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తోంది. రికార్డు స్థాయిలో జనసమీకరణ చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 25 లక్షల మందిని తరలింపునకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు లక్ష వాహనాల్లో జనాన్ని తీసుకురావాలని అధికార పార్టీ హుక్కుం జారీ చేసింది. ఏకంగా 1600 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం భూమిని చదును చేశారు.

పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే విధంగా అడ్డు వచ్చి చెట్లను నరికేశారు. ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకునేందుకు జిల్లాలకు వెళ్లడమో, టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా వంటి వాటి ద్వారా ప్రచారం చేసుకునే వీలున్నా పాతిక లక్ష మందిని సభకు తీసుకునేందుకు భారీగా ధన వ్యయం చేస్తున్నారు… అని న్యాయవాది శిశకిరణ్ వాదించారు. అధికార టీఆర్‌ఎస్ సభ అనగానే అధికారులు, పోలీసులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు.  సభకు అవసరమైన భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని న్యాయవాది చెప్పగానే.. ఈ విషయంలో భూముల యజమానులు కోర్టుకు వస్తారు కదా అని బెంచ్ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ వాదిస్తూ.. హైదరాబాద్ మహానగరానికి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నిర్వహించే సభ వల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండబోవన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వంటి మార్గాల ద్వారానే వాహనాలు వస్తాయని, ట్రాఫిక్ ఇబ్బందులు ఉండబోవన్నారు. సభ వల్ల ఎదురయ్యే ఇబ్బందుల్ని పిటిషన్‌లో పెద్ద వివరించలేదన్నారు. సభకు రాచకొండ పోలీసు కమిషనర్ ఇంకా అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి కోసం టీఆర్‌ఎస్ చేసుకున్న దరఖాస్తు రాచకొండ పోలీస్ కమిషనర్ పరిశీలనలో ఉందన్నారు.