Home తాజా వార్తలు కోటాపై సుప్రీం కోర్టుకు

కోటాపై సుప్రీం కోర్టుకు

Prohibition on transfers

 పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం  

మన తెలంగాణ / హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50% దాటొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖ లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో ని పంచాయతీరాజ్ సంస్థల్లో బిసిలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు దాదాపు 61 శాతానికి చేరుకున్నాయని, గతంలో సుప్రీంకోర్టు అనుమతిచ్చినట్లుగానే ఇప్పుడు కూడా ఈ మేరకు రిజర్వేషన్లు అమలు చేసుకునేలా వెసులుబాటు ఇవ్వాలని, గతంలోని ఉత్తర్వులను పునరుద్ధరించేలా సుప్రీంకోర్టు ను కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం కసరత్తు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేలా బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని సిఎం ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను చర్చించాల్సి ఉన్నందున ఈ సమావేశానికి అదనపు అడ్వొకేట్ జనరల్‌తో పాటు సంబంధిత అధికారులను కూడా ఆహ్వానించాలని సూచించారు. అన్ని విషయాలను లోతుగా, కూలంకశంగా చర్చించి, పిటిషన్‌లో ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా పరిశీలించి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల్లో 61% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరా న్ని నొక్కిచెప్పేలా వాదనలను ఖరారు చేయాలని సిఎం ఆదేశించారు. వెనకబడిన తరగతులవారికి 34% రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాం గ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ స్వప్నారెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వే యించిన ఆ పార్టీ బిసిల రిజర్వేషన్లకు గండి కొట్టిందని సిఎం విమర్శించారు. బిసిలకు 34% రిజర్వేషన్‌ను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉందని, దాన్ని అమలుచేయడానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఆ ప్రకటనలో సిఎం పేర్కొన్నారు. అందువల్లనే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి అధ్యక్షతన బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది.
విద్య, ఉద్యోగాలకే పరిమితం? : మొత్తం రిజర్వేషన్లు50%కి మించరాదని న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులు విద్య, ఉద్యోగ అంశాలకు మాత్రమే పరిమితమని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాజకీయపరమైనది కనుక వర్తించదనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లకు 50% విధానం అమలు కావాల్సిన అవసరం లేదని, ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న పిటిషన్‌లో ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసిందని, ఇప్పు డు కూడా అదే తరహాలో అనుమతి కోసం ప్రయత్నం చేయాలని భావిస్తోంది. జనాభా దామాషా ప్రకారం అదే నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించినట్లయితే పరిస్థితి మరో రకంగా ఉంటుందని, కానీ ఆ ప్రకారం దేశంలో ఎక్కడా అమలుకావడంలేదని ఒక న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఎస్‌సిలకు పంచాయతీరాజ్ సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్దిష్టమైన కారణం ఉందని పేర్కొన్న ఆయన, మొత్తం జనాభాలో ఎస్‌సిలు 16% మాత్రమే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం 20% ఉన్న ట్లు వివరించారు. నగర స్థానిక సంస్థలను మినహాయించాల్సి ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు మాత్రమే పంచాయతీరాజ్ చట్టా న్ని వర్తింపజేయాలని, ఆ ప్రకారమే ఎస్‌సిలకు 20% రిజర్వేషన్‌ను ఖరారు చేయడం సహేతుకంగా ఉంటుందని భావించిందని పేర్కొన్నారు. జనాభా లో ఎస్‌సిల లెక్కలను తేల్చడానికి పట్టణ, గ్రామీణ అనే విభజన చేయడం శాస్త్రీయంగా ఉండదనే వాదనను కూడా ఆ న్యాయ నిపుణులు వ్యక్తం చేశారు.