Home ఖమ్మం వసూల్ రాజాలు!

వసూల్ రాజాలు!

Corruptionఅవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా డిఅండ్‌హెచ్‌ఒ కార్యాలయం!
అనుమతుల నుంచి పదోన్నతుల వరకు చక్రం తిప్పేది వీరే!
వసూళ్లకు యూనియన్ ముసుగు!
పాలన వ్యవహారంలో వీరిదే హవా !

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనుమతుల మొదలు అన్ని విషయాల్లోనూ డబ్బులు ఇస్తే చాలు పని ఇట్టే అయిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ఆసుపత్రులు నడుస్తున్నా, ల్యాబ్‌లు పనిచేస్తున్నా అసలు అర్హత లేని డాక్టర్లే ఆసుపత్రులు నిర్వర్తిస్తున్నా పట్టించుకున్నా నాథుడే లేడు. ఇటువంటి వాటి నుంచి నెలనెల రావాల్సిన మామూళ్లు వస్తే చాలు. అవే రాకపోతే అప్పుడప్పుడు అకస్మిక తనిఖీలు జరుగుతాయి. అంతే చర్యలు ఉండవు. అక స్మిక తనిఖీలతో అంతా సర్దుకుంటుంది. ఇక జిల్లా కార్యాల యాల్లో ఐదారు సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగి వసూళ్లే పనిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒక దశలో వైద్య ఆరోగ్యశాఖలో పని చేసేందుకు పనికి రాడని బయటకు పంపినా ఈయనే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో చక్రం తిప్పుతున్నాడు. ముఖ్యంగా టీఏ, డీఏ పేరిట నెలకు లక్షల్లో పొగేసుకుంటున్నాడు. వైద్య ఆరోగ్యశాఖలో ఏ ఉద్యోగి బదిలీ జరగాలన్న ఈయనే కీలకం. డీఎంఅండ్‌హెచ్‌వో ఎవరైనా ఈ ఉద్యోగి మాట వినాల్సిందే. సదరు వసూళ్ల రాజా ఇప్పటికే ఖమ్మంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో పాటు కోట్లాది రూపాయల విలువైనా పదుల సంఖ్యల్లో నివాస స్థలాలు కొనుగోళ్లు చేశారు. దొడ్డి దారిన అనేక మందిని వైద్య ఆరోగ్యశాఖలో చేర్పించిన ఈయనపై విచారణ జరిపితే అవినీతి డొంక మొత్తం కదులుతుంది. ఆ శాఖలో పనిచేస్తున్న ఎవరికీ ఎటువంటి పనినైనా రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తాడు.

ఉద్యోగులు సాధారణ పన్మిష్‌మెంట్‌కు గురై తిరిగి ఉద్యోగంలో చేరాలంటే ఒక రేటు, సస్పెన్షన్ కాలానికి జీతం రావాలంటే 20శాతం ఈయనకు చెల్లించాలి. ఇదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మరొకరు అసలు పనికంటే వసూళ్ల పనే ఎక్కువగా చేస్తుంటారు. ఈ ఉద్యోగి రావడమే దొడ్డి దారిన వచ్చారు. డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో తిష్టవేసిన ఈయన ఇటీవల రెగ్యులర్ అయిన ఉద్యోగుల నుంచి రూ.5వేల చొప్పున 60 మందికి పైగా వసూళ్లు చేశారు. సీహెచ్‌ఎన్‌ఎస్ (క్లస్టర్) ఉద్యోగులకు సంబంధించి అశ్వారావుపేట, వెంకటాపురాల్లో జరిగిన నియమాకాలకు సంబంధించి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినవ స్తున్నాయి. అనేక సంవత్సరాలుగా ఒకే సీటులో తిష్టవేయడమే వసూళ్లకు కారణమని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు నోరు మోదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగుచూడడంతో పాటు ప్రజలకు, ఆ శాఖలోని ఉద్యోగులుకు మేలు జరుగుతుంది.