Home ఎడిటోరియల్ డిజిటల్ ఇండియా గొంగళి

డిజిటల్ ఇండియా గొంగళి

High speed Internet for rural areas in India

డిజిటల్ ఇండియా ప్రచారం హోరుగా సాగుతున్నప్పటికీ డిజిట్ భారతాన్ని సాధించే భారత్ నెట్ ప్రాజెక్టు నత్తనడక నడుస్తోంది. ఈ నాలుగేళ్ళలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కాని ఇప్పటి వరకు దేశంలో ఇంటర్‌నెట్ ఇంకా నెరవేరని కలగానే మిగిలిపోయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీల్లో కేవలం 2.5 శాతం పంచాయతీలకు మాత్రమే ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆగష్టు 2014లో కేబినెట్ ఆమోదించిన డిజిటల్ ఇండియా స్కీం ప్రకారం రెండున్నర లక్షల గ్రామాలన్నింటికీ డిసెంబర్ 2016 నాటికి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావాలి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పరిధిలోకి ఈ గ్రామాలన్నింటినీ తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుందని చెప్పారు. డిజిటల్ ఇండియాలో పేర్కొన్న తొమ్మిది పిల్లర్లలో మొట్టమొదటిది రెండున్నర లక్షల గ్రామాలకు కనెక్టివిటీ సాధించడం. 2018 ఫిబ్రవరి నాటికి లక్షా పదివేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వచ్చేసినట్లే అన్నారు. కాని, పనిచేసే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లభించిన గ్రామాల సంఖ్య కేవలం 5,010 మాత్రమే. టెలీకమ్యూనికేషన్స్ విభాగం గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. టెస్ట్ కనెక్షన్స్ ఏర్పాటు చేసిన గ్రామాల సంఖ్య 56,700 వరకు ఉంది. కాని, ఇవి ఉచితంగా ఇచ్చిన కనెక్షన్లు. కేవలం ఆరునెలల పరిమిత కాలానికి మాత్రమే ఉద్దేశించినవి. ఫైబర్ ఆప్టిక్ సదుపాయం కల్పించడం, ఉచిత కనెక్షన్లు పరిమిత కాలానికి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు.

ప్రజలు ఈ కనెక్షన్లను ఉపయోగించుకుంటున్నారా, తర్వాత ఈ కనెక్షన్లను కొనసాగిస్తారా లేదా అన్నదే ముఖ్యం అని సి డాట్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎన్.గుప్తా అన్నారు. ఊళ్ళలో నీటి సరఫరాకు పైపులు వేసినంత మాత్రాన ఏమవుతుంది? అందులో నీరు రావాలి కదా అన్నారాయన. పైగా నీళ్ళు లేకుండా అలా వదిలేస్తే పైపులు తుప్పుపట్టిపోతాయి. ఇటీవల టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఈ విషయమై బిఎస్‌ఎన్‌ఎల్‌ను హెచ్చరిస్తూ లేఖ కూడా రాసింది. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా వేసిన ఆప్టికల్ ఫైబర్ దెబ్బతింటుందని తెలియజేసింది. దీనికి కారణం కేబుల్ వాడకంలో లేకపోవడమే అని కూడా తెలుస్తోంది.
అనుకున్న లక్ష్యం సాధించడం కష్టమని గుర్తించిన తర్వాత ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రెండున్నర లక్షల గ్రామాలకు కనెక్టివిటీ లక్ష్యాన్ని లక్ష గ్రామాలకు కనెక్టివిటీగా మార్చుకుంది. మిగిలిన లక్షన్నర గ్రామాలకు కనెక్టివిటి ఇచ్చే బాధ్యత రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది. ఉసామా మంజర్ వంటి డిజిటల్ కనెక్టివిటీ నిపుణులు ఈ విషయమై మాట్లాడుతూ కేబుల్స్ మాత్రమే వేసి వదిలేస్తున్నారని, కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం, ఇంటర్నెట్ పనిచేయడం వంటి ముఖ్యమైన విషయాలను విస్మరిస్తున్నారని చెప్పారు.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకురావలన్న ప్రాజెక్టు యుపిఎ 2 కాలం నుంచి ఉన్నదే. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కొత్తగా నిధులు సమకూర్చారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అన్న పేరును కూడా భారత్ నెట్ గా మార్చారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాని సాధించింది చాలా తక్కువ. ఇప్పుడు జవాబు చెప్పుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ విభాగంతోను, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అధికారులతోను తరచూ సమావేశమై పనివేగం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 11 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది గమనిస్తే, ఇదో పెద్ద కుంభకోణంగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. టెలీకం పరిశ్రమలో ఇప్పుడు భారత్ నెట్ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది.

ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 2014 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో డిజిటల్ ఇండియా గురించే ప్రముఖంగా చెప్పారు. నాలుగేళ్ళ తర్వాత కూడా అది పూర్తయ్యే సూచనలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్టక్చర్ కోసం ఖర్చు చేయవలసిన యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నిధులు భారత్ నెట్ కోసం ఉద్దేశించారు. 2014లో ఈ నిధులను అద్భుతంగా నిర్వహించిన అరుణా సుందరరాజన్‌ను మళ్ళీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటరుగా తీసుకువచ్చింది. కాని ఇప్పుడు ఆమె కూడా పనిచేసే పరిస్థితులు లేవని కొందరి అభిప్రాయం. చాలా మంది అధికారులు అనవసరమైన కొర్రీలు పెట్టి ప్రాజెక్టులు ఆలస్యమయ్యేలా చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

డిజిటల్ ఇండియాలో మరో ముఖ్యమైన విషయం మొబైల్ కనెక్టివిటీ. దేశంలో ప్రస్తుతం 55,619 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా మొబైల్ కవరేజ్‌లేని గ్రామాలకు కూడా కవరేజ్ కల్పించాలని నిర్ణయించారు. కాని ఈ పథకం కూడా నత్తనడక నడుస్తోంది. మేఘాలయలోను, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోను ఫేజ్ 2 క్రింద 6,245 టవర్ల నిర్మాణ కార్యక్రమాలను యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అధికారులు ఆపేశారు. దీనికి కారణం, బిఎస్‌ఎన్‌ఎల్ చెప్పిన అంచనా వ్యయం పట్ల అభ్యంతరాలు. కాని విచిత్రమేమిటంటే, ఈ పని చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్కువ వ్యయం చూపించలేదు. తక్కువ చూపించింది. యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అంచనా ప్రకారం 11,241 కోట్ల రూపాయలు ఖర్చు. కాని బిఎస్‌ఎన్‌ఎల్ కేవలం 5,312 కోట్ల రూపాయలకే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పింది. బిఎస్‌ఎన్‌ఎల్ ప్రతిపాదనను హై లెవెల్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాని యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అధికారులు దీన్ని ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మరో ప్రాజెక్టులో 1001 మొబైల్ టవర్ల నిర్మాణం కూడా పెండింగ్‌లో పడి ఉంది.

డిజిటల్ ఇండియా ఇంకా సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో 2,817 టవర్ల నిర్మాణానికి కేబినెట్ 2014లోనే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 2,258 కోట్ల రూపాయలు. కాని ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ప్రారంభమే కాలేదు. టెండర్లు ప్రారంభమైన తర్వాత కూడా అనేక అడ్డుపుల్లలు వేస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఒకసారి ఈ ఆంక్షలన్నింటిని ఒప్పుకున్నప్పటికీ కూడా యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అధికారులు నిధులు విడుదల చేయలేదని తెలిసింది. వామపక్ష తీవ్రవాద ప్రభావంలో ఉన్న దాదాపు 4000 గ్రా మాలకు మొబైల్ కవరేజి లభించవలసిన ప్రాజెక్టు ముందుకు సాగనే లేదు. మరో 20,000 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీకి సం బంధించిన ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు ఉంది. డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు చదువుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయన్న స్వప్నం ఇంకా కలగానే మిగిలిపోయింది.

High speed Internet for rural areas in India

Telangana Latest News