Home దునియా హిందీ సినిమాలకు పూర్వ వైభవం వచ్చేనా…?

హిందీ సినిమాలకు పూర్వ వైభవం వచ్చేనా…?

Hindi-Movies

హిందీ అనేది జాతీయ భాష అయినప్పుడు భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కాస్తోకూస్తో హిందీ మాట్లాడగలిగి అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉంటే సమంజసంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో హిందీ భాష ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ  ఊహించలేదు. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణలో హిందీ లేదా ఉర్దూగా పిలువబడే వాడుకభాష తెలుగులో సమానంగా చలామణిలో ఉండేది. ఒకప్పుడు హిందీ తెలిస్తేగాని హైదరాబాద్‌లో ఉండలేమనే అభిప్రాయం ఉండేది. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో హిందీ భాషకు, హిందీ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. 1980 దశకం నుంచి క్రమక్రమంగా తెలంగాణలో హిందీ భాష ఉనికిని కోల్పోతూ వస్తోంది. దీనికి కారణం సీమాంధ్ర పాలకుల విధానంతో పాటు కోస్తా తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వలసలు ఎక్కువ కావడం అని చెప్పవచ్చు.

రెండు దశాబ్దాల కిత్రం ఇంటర్మీడియట్, డిగ్రీలో విద్యార్థులు తెలుగుతో సమానంగా హిందీని సెకండ్ లాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకునే వారు. సీమాంధ్రుల పిల్లలకు హిందీ పరిజ్ఞానం తక్కువగా ఉండేది కాబట్టి హిందీ స్థానంలో సంస్కృత భాషను ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రవేశపెట్టి సులభతరంగా పాస్ అయ్యే విధంగా సిలబస్ రూపొందించారు. దీంతో సహజంగానే విద్యార్థులు సంస్కృత భాష వైపు మొగ్గు చూపారు. హిందీతో ఉన్న కాస్త అనుబంధం యువతకు దూరమైంది. నేడు యువతకు బత్తిగా హిందీ భాషపై అవగాహన లేకుండా పోయింది. తెలంగాణ పట్టణాల్లో ఒకప్పుడు హిందీ సినిమాలు విరివిగా ప్రదర్శించబడేవి. నేడు అభిరుచి ఉన్న ప్రేక్షకులకు చూద్దామంటే హిందీ సినిమాలు కరువయ్యాయి. తెలుగు సినిమాలు సెంటిమెంట్ కథాంశాలతో నిండి ఉంటే ఆరోజుల్లో హిందీలో యాక్షన్ సినిమాలు వచ్చేవి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే యువత హిందీ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడే వారు.

గంగాజమునా సంగమంలాగా తెలంగాణలో హిందువులు, ముస్లింల సహజీవనం ఇక్కడి జీవనవిధానం, పృథ్వీరాజ్‌కపూర్ నటించిన మొగల్ ఎ అజం నుండి రాజీవ్‌కపూర్ నటించిన రాం తేరీ గంగా మైలీ వరకు జనాదరణ పొందిన హిందీ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆరోజుల్లో ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలకు కూడా అభిమాన సంఘాలు ఉండేవి. జీనా యహా, మర్‌నా యహా, ఇస్కే సివా జానా కహా అని రాజకపూర్ పండించిన ట్రాజెడికి స్పందించని ప్రేక్షకులు లేరు. మేరే సప్‌నోంకి రాణికబ్ ఆయేగీతూ అంటూ రాజేష్ ఖన్నా యువతను ఊర్రూతలూగించాడు. జంజీర్ సినిమాతో యాంగ్రీయంగ్ మన్‌గా సంచలనం సృష్టించిన అమితాబ్ తన హవాను మూడు దశాబ్దాలు కొనసాగించాడు. డిస్కోడాన్సర్‌తో మిథున్‌చక్రవర్తి ఓ ఊపు ఊపాడు. చాక్లెట్ బాయ్ రిషికపూర్ సినిమాలను కాలేజీ అమ్మాయిలు ఎగబడి చూసేవారు. మరో చరిత్ర, సిరిసిరిమువ్వ లాంటి తెలుగు సినిమాలు హిందీలో తీస్తే అంతే హిట్ అయ్యాయి. తెలంగాణలో సినిమా థియేటర్లు ఉన్న పట్టణంలో హింది సినిమాల కోసం ప్రత్యేక థియేటర్లు ఉండేవి.

హైదరాబాద్‌లోనైతే తెలుగు సినిమాల కంటే హింది సినిమాలే ఎక్కువగా  ఆడేవి. షోలే సినిమా విడుదలైన కొత్తలో ఆ సినిమాను హైదరాబాద్ రామకృష్ణ థియేటర్‌లో చూడాలనే కోరికతో ప్రత్యేకంగా ఆ సినిమా కోసం హైదరాబాద్ వెళ్లి చూసిన అభిమానులు ఉన్నారు. మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లలో ఎన్నో హిందీ సినిమాలు ఆడాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కూడా హిందీ సినిమాల కోసం ప్రత్యేక థియేటర్లు ఉండేవి. వరంగల్ పట్టణంలో కృష్ణ థియేటర్, గీత్ థియేటర్లలో హింది సినిమాలు తప్ప వేరే సినిమాలు ఆడేవి కావు. కరీంనగర్ పట్టణంలో ఆ రోజుల్లో ఆరు థియేటర్లు ఉంటే అందులో మూడు థియేటర్లు నటరాజ్, తీరందాజ్, రోజ్ థియేటర్లలో కేవలం హిందీ  సినిమాలే ప్రదర్శింపబడేవి. ఒక్కొక్క సినిమా నెలల తరబడి ఆడేవి. ముఖ్యంగా అమితాబ్ నటించిన షోలే, డాన్, ముకద్దర్‌కా సికిందర్, లావారిస్, నసీబ్ లాంటి సినిమాలు, మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్, రిషికపూర్ నటించిన కర్జ్ సినిమాలు ఆరోజుల్లో తెలంగాణలో నెలల తరబడి ప్రదర్శింపబడ్డవి. దీనికి తోడు ఆర్ట్  ఫిల్మ్‌లను ఆదరించేవారు నసీరుద్దీన్‌షా, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీలాంటి కళాకారులకు మంచి ఆదరణ ఉండేది. వారు నటించిన సినిమాలను చూసే ప్రత్యేకమైన వర్గం ఒకటి ఉండేది.

అర్థ్, అర్ధసత్య, మిర్చిమసాల, మండి లాంటి ఎన్నో అవార్డు సినిమాలను తెలంగాణ ప్రేక్షకులు ఆదరించారు. ఇలాంటి సినిమాలు ఆ రోజుల్లో థియేటర్లలో మార్నింగ్ షోలో ప్రదర్శించే వారు. సినిమాలే కాదు. హిందీ టివి సీరియల్స్ కూడా జనాదరణ పొందాయి. ఆ రోజుల్లో డిడి వన్‌లో ప్రసారమైన నుక్కడ్, రజని, తమస్, లాంటి సీరియల్స్ సంవత్సరాల కొద్ది ధారావాహికంగా వచ్చాయి. ఆ సీరియల్స్ వస్తున్నప్పుడు ఇంటిల్లి పాది టివిల ముందు కట్టిపడేసినట్లు కూర్చునేవారు. అలాంటి పరిస్థితి ఉన్న తెలంగాణలో నేడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. తెలంగాణ ప్రజలు క్రమక్రమంగా హిందికి ఎందుకు దూరమయ్యారు. అని ప్రశ్నించుకుందాం. దీనికి కారణం తెలుగులో ప్రైవేట్ చానల్స్ రంగప్రవేశం చేయడం, 1980 తరువాత కోస్తా తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలకు ముఖ్యంగా హైదరాబాద్‌కు వలసలు అధికం కావడంతో ఈ పరిస్థితిలోకి తెలంగాణ సమాజం నెట్టివేయ బడింది. ఇరానీ చాయ్‌కు ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌లో ఈ రోజు ఇరాని చాయ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. క్రమక్రమంగా తెలంగాణ సమాజం తమ సహసిద్ధతను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏది ఏమైనా తెలంగాణలో గతించిన వైభవం తిరిగి వస్తుందని ముఖ్యంగా హిందీ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

– ఎర్ర సురేష్‌కుమార్,
సబ్ ఎడిటర్, వరంగల్