Home లైఫ్ స్టైల్ సంస్కృతిని కాపాడుకుందాం

సంస్కృతిని కాపాడుకుందాం

శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామీజీ 

                 Priest

దుర్గామాత ప్రసన్న రూపం శారదామాత. ఈ అమ్మవారిని దర్శించాలంటే కర్నాటకలోని శృంగేరి పీఠానికి వెళ్ళాల్సిందే! అక్కడ జరిగే పూజాదికాలు, వ్రతాలు, హోమాలు కన్నుల పండువగా, పరమ నిష్ఠగా, శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఈ పీఠాన్ని శంకరభగవత్పాదులు స్థాపించారు. నాలుగువేదాల ప్రచారానికి శంకరులు నాలుగు పీఠాలు ఏర్పాటుచేశారు. అందుకే వీటిని చతురామ్నాయ పీఠాలు అంటారు. ఇది యజుర్వేదాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటైన మఠం. అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠం ప్రచారం చేసే మహావాక్యం. దివ్యమైన గురుపరంపర గలిగిన ఈ మఠాన్ని అభినవ విద్యాతీర్థ మహాస్వామీజీ 36వ శంకరుడిగా నిర్వహిస్తున్నారు. గుంటూరుజిల్లా నరసారావుపేటకు చెందిన అచ్చమైన తెలుగు గురువుగారు మన మహాస్వామి. నియమానికి, నిష్ఠకు, అద్భుతమైన గురూపదేశానికి ఆయన పెట్టిందిపేరు.

అమ్మవారి ఆలయాలను నిర్వహించడం, పోషించడం, ఆ ఆలయాలలో అనుసరించాల్సిన విధివిధానాలను నిర్దేశించడంలో ఆయన సిద్ధహస్తులు. నిరంతరం శారదామాత ధ్యానం, అనుష్ఠానాలలో నిమగ్నులయ్యే మహాస్వామి సమాజంలో వస్తున్న పెడపోకడలను చూసి కలత చెందారు. భావిభారతానికి ప్రతినిథులుగా నిలవవలసిన వారు సంస్కృతీ సంప్రదాయాలకు దూరమైపోతున్నారని ఆవేదన చెందారు. అందుకు ఆయన ఏ ఒక్కరినీ తప్పుపట్టలేదు. అందరి సమిష్ఠి కృషితో దేశానికి పూర్వ వైభవం రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సామివారి మనోగతాన్ని ఆయన మాటలలోనే తెలుసుకుందాం.

* సొంత తప్పులు, లోపాలు తెలుసుకుని సరిదిద్దుకునే వాడే ఉత్తముడు. మారాలి బాగుపడాలి అనే కోరిక ఉండాలేకానీ ఈ సృష్టిలో ఏదీ అసాధ్యం కాదు. మన శక్తియుక్తులను సరైన మార్గంలో వాడడంలోనే మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది.
* ధర్మం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పండితుడుపామరుడు, సంపన్నుడుసామాన్యుడు, పాలకుడుపాలితుడు అన్న భేదం లేదు. ప్రతీ ఒక్కరికీ దీనిపై అవగాహన ఉండాలి. సాక్షాత్తు దేవదేవుడే ధర్మం తగ్గిపోతున్నప్పుడు దాని కాపాడడానికి భూమికి దిగివస్తున్నాడంటే అది ఎంతో గొప్పదో..దాని అవసరం ఈ భూమండలానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

* భగవంతుడు సర్వనియామకుడు. జగత్కార్యాలలో ఎప్పుడు కల్పించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన జోక్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించడానికి లేదు. ఒక కంపెనీలో సర్వోన్నత అధికారి అయిన ఛైర్మన్ జోక్యం చేసుకుని దాని పాలనా విధానాలను సంస్కరిస్తే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఎందుకిలా చేశావ్ అని ఎవరైనా అడుగుతారా..? అడగ్గలరా..? అలాగే భగవంతుడు కూడా తనదైన ఈ సృష్టి బాగుకోసం..జీవుల మేలుకోసం..ధర్మం కోసం జోక్యం చేసుకున్నప్పుడు ఆయన విచక్షణాధికారాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.

* ఆనందం కోసం అర్రులు చాచడం, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదని బాధపడడం మానవ నైజం. ఆనందం కోసం ఆరాటపడడం వల్ల ఆనందంలేదు. బాధే ఉంది. ఉన్నదానితో తృప్తి పడడం..ఉన్నంతలోనే సర్దుబాటుచేసుకోవడం ఉత్తమం. సంతృప్తికి మించిన సంతోషం మరొకటిలేదు. కోరికలు అదేపనిగా పెరిగితే మనశ్శాంతికి స్థానం ఎక్కడ? డబ్బుంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు పామరులు. మనసుకు శాంతిలేకపోయాక ఎంత డబ్బున్నా ఏమిటి ప్రయోజనం? కోట్లున్నా తినేది కడుపుకు చాలినంతే కదా..! ఈ మాత్రం దానికి తాను తప్పుదోవపట్టడం, తన వారిని అక్రమ మార్గాల వైపు నెట్టేయడం దేనికి?
* చిన్నపిల్లలు మాట వినడంలేదని..మొండిగా ఉంటున్నారని ఈ మధ్య పెద్దలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారు. దోషమంతా పిల్లలదేనా? ఇందులో పెద్దల బాధ్యత లేదా? ఇంట్లోకాని, విద్యాలయాలలో కాని వారికి మంచి ప్రవర్తన అంటే ఏమిటో చెబుతున్నారా? మన సంస్కృతి, మన జీవన విధానాల గురించి ఎవ్వరైనా మాట్లాడుతున్నారా? మంచి అంటే ఏమిటో చెప్పకుండా పిల్లలు బాగా ఉండడంలేదని అంటే వాళ్ళెలా బాగుంటారు?

* మంచి ప్రవర్తన అంటే ఏమిటో మన పెద్దలు రామాయణ, భారత, భాగవతాలలో విడమరచి చెప్పారు. ఉపదేశాలేకాక ఉదాహరణలతో సరిపెట్టకుండా ఎందరి జీవితకథలనో వాటిలో పొందుపరిచారు. వాటి గురించి ఎవరైనా చెబుతున్నారా? వాటి గురించి మాట్లాడడమంటే అనాగరికంగా తయారవుతోంది. మన ఆచారమంతా అనాచారంగా ముద్రపడిపోతోంది.
* మన రాక్షసుల గురించి, వారి ప్రవర్తన గురించి చెప్పడం తప్పుగా, ఏలియన్స్ గురించి చదవడం అధునాతనంగా పరిగణించే స్థితిలో మన సమాజం ఉంది. టివిలు, సినిమాలు మనవికాని సంప్రదాయాలను హోరెత్తిస్తుంటే.. నూరిపోస్తుంటే ఎవ్వరూ దాని గురించి మాట్లాడడం లేదు. మంచి వెగటైపోయింది. మన ధర్మం మోటైపోయింది. పరధర్మం పరమాద్భుతంగా కనిపిస్తోంది..వినిపిస్తోంది. విదేశీ హీరోలే హీరోలుగా కనబడుతున్నారు. జగతికి ఆదర్శంగా నిలిచిన మన హీరోలు ఎందుకూ కొరగాకుండా పోయారు.

* మంచికి మారుపేరుగా నిలిచిన వారి గురించి చెప్పకపోవడం వల్ల అదేంటో కూడా ఈ తరానికి తెలియకుండా పోతోంది. అందువల్ల పిల్లలు మంచి మాటా, మర్యాదాలేకుండా తయారవుతున్నారు. పెద్దలంటే గౌరవం ఉండడంలేదు. తల్లిదండ్రులను అభిమానంగా చూడాలన్న ఆలోచన కూడా వారికి రావడంలేదు. ఈ స్థితికి పిల్లలెంత వరకు బాధ్యులు? పెద్దలే పెడదారి పట్టిపోతుంటే వాళ్ళు మంచి మార్గంలో ఎలా నడవగలుగుతారు?

* మా చిన్నప్పుడు బడులలో రామాయణ, భారత, భాగవతాల నుంచి కథలు తీసి పాఠాలుగా చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పాఠాలు ఉన్నట్టు కనబడదు. అపట్లో లేని అరమోటుతనం ఇప్పుడెందుకు కనబడుతోందో పెద్దలే చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలేవీ వాటి సొంత సంస్కృతిని మరిచిపోలేదు. మనం మాత్రం మన ఘనత వహించిన చరిత్రను, సంస్కృతీ, సంప్రదాయాలను వదులుకోడానికే ఇష్టపడుతున్నాం. మన ముద్రను పోగొట్టుకోడానికి సిద్ధపడుతున్నాం. అందుకే ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న మన మహర్షుల గురించికానీ, మన పురాణపురుషుల గురించికానీ మన పిల్లలు ఒక్కముక్క కూడా చెప్పలేకపోతున్నారు.

* మన మేమిటో మన జీవిత విధానమేమిటో ఈ గడ్డమీది సభ్యత, సంస్కారమేమిటో తెలిస్తే ఇతరుల నుంచి మనమేం నేర్చుకోవాలో, వారికి మనమేమి నేర్పాలో తెలుస్తుంది.
అలా చేయకపోవడం వల్లే వేలం వెర్రితనంగా అధునాతన సమాజం వెంటపడి మన మాట వినకుండాపోతున్నారు.
* చదువుల కోసమో, సంపాదన కోసమో ఈ దేశం వదిలిపోయిన వారు కూడా భారతీయులే! అమెరికాలోనో, లండన్‌లోనో మరో దేశంలోనో ఉన్నంత మాత్రాన వారు ఆ దేశం వారైపోరు. అక్కడ ఇమడడం కోసం అప్పటిదాకా అవలంభించిన ఆచారవ్యవహారాలను త్యాగం చేయక్కర్లేదు. మాతృభాషను మరిచిపోవడం, మాతృభూమిని మరిచిపోనక్కర్లేదు. తమ పిల్లలను అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల సంస్కృతి నుంచి, భాష నుంచి విడదీయనక్కర్లేదు.

* దేవుణ్ణి తలచుకోవడం, పెద్దల పాదాలకు నమస్కరించడం, ఎక్కడైనా మనవాళ్ళు ఎదురుపడితే మాతృభాషలో పలకరించుకోవడం మాననవసరంలేదు. కమ్యునికేషన్ కోసం పిల్లలు ఇంగ్లీషు నేర్చుకున్నా ఇంటి భాషను వదులు కోనక్కర్లేదు.