Home ఎడిటోరియల్ వెర్రితలలు

వెర్రితలలు

ప్రజల ఆహారపుటలవాట్లను నియంత్రించాలనే ఆలోచన దుర్మార్గం, దురుద్దేశపూరితం. బహుళ మతవిశ్వాసాలున్న మనలాంటి దేశంలో ఒకరి మతవిశ్వాసాలను మరొకరు గౌరవించటమే శ్రేయోదాయకం. వాటిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదు. అదేరాజ్యాంగం హామీ ఇచ్చిన లౌకికత. 

parivarహిందూత్వ శక్తుల వికృతచేష్టలు దేశంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. ప్రజలు ఏమి తినకూడదో శాసిస్తున్న ఈ శక్తులు రేపు కట్టు, బొట్టును కూడా శాసిస్తాయి. స్త్రీలు వంటింటికి పరిమితం కావాలని కోరుకునే అభివృద్ధి నిరోధక శక్తులు వారి ఆధునిక వస్త్రధారణపై విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు చేయటం అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాం. ఆవుమాంసం విక్రయాన్ని నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం అడుగుజాడల్లో, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ , జైనుల ఉపవాసదీక్షల పవ్రిత కాలమంటూ ఈనెల 10, 13, 17,18 తేదీల్లో మహానగరంలో పశువధను, మాంసం విక్రయాన్ని నిషేధించింది. రాజస్థాన్ ప్రభుత్వం జైనులు సహా పండగల పేరుచెప్పి 17,18,27 తేదీల్లో మాంసం, చేపల విక్రయాన్ని నిషేధించింది. జైనుల ఉపవాస దీక్ష కారణంగా గురువారం నుంచి వారంరోజులపాటు పశువధను నిషేధిస్తూ అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలావుండగా, మహానగరంలో నాలుగురోజులపాటు పశువధ, మాంసం విక్రయం సాధ్యంకాదంటూ బొంబాయిహైకోర్టు వ్యాఖ్యా నించగా, జమ్మూ-కశ్మీర్ హైకోర్టు హిందూ మహారాజు పాలనకాలంలో గోవధను నిషేధిస్తూ 1932లో ఇచ్చిన రూలింగ్‌ను అమలు చేయాలంటూ, ఒక పిల్ విచారిస్తూ ఆదేశించింది. మూలనపడిపోయిన విషయాలను బయటకులాగి మత ఉద్రిక్తతలు సృష్టించటంలో కొందరికి స్వార్థప్రయోజనం ఉండవచ్చు. కాని న్యాయమూర్తులు సామాజిక భౌతిక పరిస్థితులను గ్రహించకుండా చట్టం ప్రకారం ముక్కుసూటిగా పోవటంవల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు అదే జరిగింది. ఈద్ సందర్భంగా పెద్ద ఎత్తున గోవధ జరపాలని కొందరు కశ్మీర్ ముస్లిం నాయకులు అతిగా స్పందించారు. బిజెపితో పొత్తుతో రాష్ట్రాన్ని పాలిస్తున్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి మహబూబ్ బేగ్ వ్యాఖ్య వాస్తవ పరిస్థితికి అద్దంపడుతున్నదిః “ప్రజలు ఏమి భుజంచాలో ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. కశ్మీర్‌లో మహారాజా కాలంలో గోమాంసం విక్రయంపై నిషేధం ఉంది. కశ్మీర్ ముస్లిం మెజారిటీ రాష్ట్ర మైనప్పటికీ, ఈ నిషేధం చట్టంలో ఉండటం చిత్రంగా ఉంది. నిషేధాన్ని పునరుద్ఘాటించిన కోర్టు ఉత్తర్వు చర్చనీయాంశం” అన్నారాయన. ఇన్నేళ్లుగా తలెత్తని నిషేధం అమలు సమస్య ఇప్పుడెందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా దాఖలైందనేది అనుమానించాల్సిన విషయం. కశ్మీర్‌లోని ముస్లింలు గోమాంసం బహుతక్కువగా తీసుకుంటారు. శ్రీనగర్‌వాసులు గోమాంసం కన్నా గొర్రెమాంసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఒకరి మత విశ్వాసాలకు అనుగుణమైన నియంత్రణలను మరో మతం వారిపై విధించాలని ప్రయత్నించినపుడే సమస్యలు తలెత్తుతాయి, ఉద్రిక్తతలు పెరుగుతాయి, సామరస్య జీవనానికి భంగం వాటిల్లుతుంది.
మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ప్రభుత్వాలు లేదా అధికారుల ఉత్తర్వుల అవసరం ఇప్పుడెందుకేర్పడింది? జైన మతస్థులు సైతం ప్రతిఏటా ‘పర్యూషన్‌పర్వం’ (ఉపవాసదీక్ష) పాటిస్తుంటారు. వారి దీక్షల పవిత్రతను కాపాడలన్న ప్రేమ ఈ ఏడాదే ఎందుకు పుట్టుకొచ్చింది? ఉగ్రహిందూత్వశక్తుల భావజాలాన్ని పంచుకుంటున్న ప్రభుత్వాలు అధికారంలో ఉండటమే కారణం కావచ్చు. అయితే మహారాష్ట్ర చర్యను బిజెపి ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేన ఉద్దావ్ థాక్రే నాయకత్వంలో, రాజ్‌థాక్రే నాయకత్వంలో ఎంఎన్‌ఎఫ్. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సిపిలు, కార్పొరేషన్ విధించిన నిషేధాన్ని ధిక్కరించి మాంసం విక్రయించి ప్రభుత్వ చర్యను అవహేళన చేయటం హర్షించదగింది.
ప్రజల ఆహారపుటలవాట్లను నియంత్రించాలనే ఆలోచన దుర్మార్గం, దురుద్దేశపూరితం. బహుళ మతవిశ్వాసాలున్న మనలాంటి దేశంలో ఒకరి మతవిశ్వాసాలను మరొకరు గౌరవించటమే శ్రేయోదాయకం. వాటిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదు. అదే రాజ్యాంగం హామీ ఇచ్చిన లౌకికత. దీన్ని గౌరవించని, సహించలేని శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారంలో ఉన్న శక్తులు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యధర్మాన్ని పాటించాలి. అలాకాకుండా ‘స్వయంసేవక్’ ల్లాగా వ్యవహరిస్తే ప్రజల తిరస్కారానికి గురికాకతప్పదు.