Home దునియా గణపతిదేవుని ఆడపడుచు నిర్మించిన ధర్మసాగర్

గణపతిదేవుని ఆడపడుచు నిర్మించిన ధర్మసాగర్

History of Dharmasagar lake in Telugu

వేలాది సంవత్సరాలక్రితమే తెలంగాణ నేల జలసిరులతో పసిడి పంటలను పండించింది. చెరువులు జలవనరులుగానే కాకుండా జీవనాధారంగా, సాంస్కృతిక కేంద్రంగా, వారసత్వ సంపదగా పరిగణిస్తూ శతాబ్దాలక్రితమే పాలకులతో కలిసి ప్రజలు చెరువుల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ చరిత్ర గమనంలో పాతరాతియుగంలో నీటి పరివాహకప్రాంతాల్లో ప్రాచీనమానవుడు జీవనాన్ని తీర్చిదిద్దుకుంటూ ఆ తర్వాత పరిణితి చెంది జలాశయాల నిర్మాణాలపై దృష్టి సారించారు. శాతవాహనులకాలంలో రాజుల సహకారంతో ప్రజలే నీటి సౌకర్యాలను కల్పించుకుంటూ ఉదకయంత్రాల ద్వారా నేలను జలసిరులు పునీతం చేయగా పసిడి పంటలను పండించిన చరిత్ర తెలంగాణకే సొంతం. ఆ తర్వాత కందూరు చోడులు క్రీస్తు శకం 1040 నుంచి 1290 వరకు జలాశయాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కాలంలోనే పానుగల్లు దగ్గర ఉదయసముద్రం నిర్మించి నీటిసౌకర్యం కోసం మూసినదిపై సమిలె ప్రాంతంలో ఆనకట్ట నిర్మించి సాగుభూములకు నీరు అందించారు.

ఆ తర్వాత కాలంలో తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే పెరిగి, తెలంగాణను పాలించిన కాకతీయరాజులు చెరువుల నిర్మాణాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళారు. పండుగలు, పర్వదినాలు, సంతోషం, బాధ కలిగే సందర్భాల్లో పాలకులతోపాటు ఆనాటి ప్రముఖులు, రాజ ఉద్యోగులు, రాజబంధువులు చెరువులను నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. జలవనరులకు ఇచ్చిన ప్రాముఖ్యతతో తెలంగాణలోని వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. ఆనాటి నగరాలు, రాచరిక వీధులు, ముఖ్యప్రాంతాల్లో చెరువుల నిర్మాణాలతో పాటు దండకారణ్యాలను నరికి చెరువులు నిర్మించి, గ్రామాలను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో దేవాలయం నిర్మించడం ఆనవాయితీగా ఉండేది. కాకతీయులు చేపట్టిన ఈ సంస్కరణలతో చెన్నూరు, కొత్తగూడెం, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్ ఆయా ప్రాంతాల్లో నిర్మించిన చెరువులు నేటికి సాగునీరు అందిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో చెరువుల నిర్మాణాలతో వెలిసిన వేలాది గ్రామాలు నేటికి ఉన్నాయి. తెలంగాణలో సముద్రాలు లేని కొరతను తీరుస్తూ క్రీస్తుశకం 1052 నుంచి 1076 వరకు పాలించిన ప్రోలరాజు అరిగజ కేసరిపేరుతో ‘సమువూదాన్ని’ శాసనాల్లో ఉంది. ఆ తర్వాత రెండవ భేతరాజు క్రీస్తు శకం 1076 నుంచి క్రీస్తుశకం 1108 లో సెట్టికెరియ పేరుతో తటాకాన్ని నిర్మించారు. అనంతరం రుద్రదేవుని మంత్రి గంగాధరుడు హన్మకొండ (నేటి బస్‌స్టాండ్ దగ్గర) చెరువు తవ్వించారు. ఇలా ప్రారంభమైన చెరువుల నిర్మాణం గణపతి దేవుని కాలంలో ఉద్యమంగా కొనసాగి వేలాది చెరువులు, గొలుసుకట్టు చెరువులు, కాలువలు, బావులు నిర్మించి లక్షలాది ఎకరాల బీడుభూములను సాగులోకి తెచ్చారు. గణపతి దేవుని బంధువులు, అధికారులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ధనవంతులు, మంత్రులు, సేనాధిపతులు, సామంతులు చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు.

గణపతి దేవుని సోదరి మైలాంబ ఖమ్మం బయ్యారం, మరో సోదరి కుందవ్వ అదిలాబాద్‌లో కుంద సముద్రం, వరంగల్ ల్లో ధర్మసాగర్ నిర్మించి తెలంగాణ చరిత్రలో చెదరని పేజిని లిఖించారు. అలాగే అనేక ధర్మకార్యాలు చేసి ధర్మకీర్తిగా చరిత్రలో నిలిచిన కుందవ్వ చెరువు తవ్వించి, గ్రామం నిర్మించి ధర్మసాగర్ అని నామకరణం చేసింది. మిషన్ కాకతీయతో పూర్వ వైభవాన్ని పుణికి పుచ్చుకున్న ధర్మసాగర్ తటాకం పాండవుల గుట్టల నడుమ నిర్మించిన తటాకం. ఆనాడు 1200 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి జలకళతో సాగరాన్ని తలపించింది. తెలంగాణలో సముద్రం లేని కొరత తీర్చింది. దీని పైభాగాన ఉన్న ముప్పారం చెరువు మత్తడి నీరు వాగులో కలిసి ఈ తటాకంలోకి చేరే విధంగా తీర్చిదిద్దిన నిర్మాణ కౌశల్యం నేటికి ప్రశంసనీయంగానే మిగిలింది. కాకతీయుల కాలంలో ఈ చెరువు కింద 7వేల ఎకరాలసాగుభూములు ఉండేవని శాసనాధారాలు లభ్యమవుతున్నాయి. కాకతీయులకాలంతో అతిపెద్దచెరువుల్లో ఒకటైన ధర్మసాగర్ చెరువును నిజాం కాలంలో తొలిసారిగా పునరుద్ధ్దరించారు. ధర్మయుడు అనే సర్దార్ ఈ చెరువుకు మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత సమైక్య పాలనలో ధర్మసాగర్ వైభవానికి ఉనికి ప్రశ్నార్థకంకాగా మిషన్ కాకతీయలో పునరుద్ధరించబడి తాగునీరు, సాగునీరు అందిస్తూ కాకతీయవైభవాన్ని నేటికీ చాటుతుంది.

–  వి.భూమేశ్వర్