Home దునియా భక్తసులభుడు..శంకరుడు

భక్తసులభుడు..శంకరుడు

shiva temple in telangana

 

“ఓం పంచ వక్త్రాయ విద్యహే, మహావేదాయ ధీమహీ తన్నో రుద్ర: ప్రచోదయాత్‌” అని ఆది శంకరులు కీర్తించారు. శివ నామం గంగా నది లాంటిది. ఆయన ధరించే విభూది యమునా నది లాంటిది. రుద్రాక్ష సర్వపాపాలూ దహించే సరస్వతీ నది. ఇదే త్రివేణి సంగమం! శివలింగానికి అడుగున బ్రహ్మ, మధ్య పీఠంలో విష్ణువు. లింగాగ్రంలో పరమేశ్వరుడూ ఉంటారు. కనుక ఆయన పూజ సర్వదేవతల పూజ. ఆ పరమేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం. కార్తీక మాసం ప్రత్యేకంగా హరిహరాదులకు ప్రీతికరమైన మాసం. అందుకే కార్తీకమంతా శివాయగురవే నమ: అంటూ, శివోహం అంటూ భక్తులందరూ వివిధ శైవ క్షేత్రాలలో ఆ జగత్పిత దర్శనం చేసుకుని తరిస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కీసర గుట్ట సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. నిత్యం దర్శించుకునే భక్తులతో ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండే మన కీసరగుట్ట క్షేత్రం (హైదరాబాద్)కి 40.కి.మీ. దూరంలో ఉంది. ఆ శంకరుడు శ్రీరామలింగేశ్వరుడిగా స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రం.

Keesara Temple

పురాణకథ: పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యనగరానికి తిరిగి వెళుతూ.. మార్గమధ్యలో కీసర గట్టు కొండమీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణ ప్రభావం వల్ల శ్రీరామచంద్రునికి ఒక ఆలోచన కలిగిందట. అదేమిటంటే, రావణుడిని సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టించాలనుకుంటాడు. అందులో భాగంగానే .. ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని ఆలోచన కలిగింది. దాంతో అక్కడున్న మహర్షులతో తన ఆలోచన గురించి వివరించగా అంతా ఆలోచించి ఆ ప్రదేశంలో శివ లింగాన్ని ప్రతిష్టించడానికి ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుడిని పిలిచి.. కాశీ నుంచి శివ లింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.

దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హనుమంతుడు ఆకాశంలో ఎగురు కుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే రాజర్షులు నిర్ణయించిన సుముహూర్త సమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికి కనిపించ లేదు. ఎందుకు ఆలస్యమవుతోంది? నా సంకల్పం నెరవేరదా అని శ్రీరాముడు మనసులో ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోనే శంకరుడు, రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి ముహూర్త సమయమునే ప్రతిష్టించమని చెప్పి..అదృశ్యమైపోతాడు. ముహూర్తం దాటిపోతుందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్టించాడు. కానీ ఇంతలోనే ఆంజనేయుడు నూటొక్క శివలింగాలను తన భుజాల మీద మోసుకుని రామచంద్రుని ముందు వాలాడు. తను రావడానికి ముందే అక్కడున్న పరిస్థితులను, ఆత్మలింగాన్ని ప్రతిష్టించడం చూసి చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా ఒక్కసారిగా వృథా అయిందని.. ఉక్రోషంతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన ఎక్కబడితే అక్కడ బాధతో విసిరేశాడు. అయితే శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు చేసిన చేష్టలకు కోపగించుకోకుండా, చిరునవ్వుతోనే అనుగ్రహించి, దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు.

“ఆలయంలో ఈశ్వర దర్శనానికి ముందే, నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తరువాతే శ్రీరామ లింగేశ్వరునిని దర్శించుకుంటారు.” అని వరమిస్తాడు. ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా “ కేసరి గిరి” గా ఆ ప్రాంతాన్ని పిలుస్తారని అనుగ్రహించాడు. అలా కేసరి గిరి” కాల క్రమంలో కీసరిగిరి, కీసర, కీసరగుట్టగా మారిపోయింది.
చారిత్రక విశిష్టత: క్రీ.శ. 4-లేదా -5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన ప్రభువైన రెండవ మాధవవర్మ రాజధానియైన “ఇంద్రపాలనగరం” ఇదే నని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పదకొండు ఆశ్వ మేధయాగాలు చేసి, తన సామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింప జేసిన మహావీరుడు రెండవ మాధవవర్మ. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర భూమి ఈ కీసరగుట్ట. ఈ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించిన పునాదులు, బయటపడ్డాయి. కొన్ని శిథిల కట్టడాలు అక్కడక్కడ కనిపిస్తాయి.

Keesara Temple

క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కోండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో లక్ష్మ నృశింహ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం కలదు. ఈ స్తంభంపై మత్స, కూర్మ, వరహ, ఆంజనేయ విగ్రహాలు చెక్కి ఉన్నాయి.

shiva temple in telangana

Telangana news