Home ఎడిటోరియల్ అసలు చరిత్ర

అసలు చరిత్ర

subhash-chandra-bose2“చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగి పోదు” అని మునుపటి ఓ సినిమాలో డైలాగు . నిజమే! కానీ చరిత్రను వక్రీకరించే వారూ, అసలు ఘటనలనూ, వ్యక్తులనూ, చరిత్రకెక్కకుండా చూసే వారూ వుంటూంటే “ఇతి హాసపు చీకటికోణం-అట్టడుగున పడి కన్పించని-కథలన్నీ కావాలిప్పుడు – దాచేస్తే దాగని సత్యం!” అన్న శ్రీశ్రీ గర్జన ‘ఆవశ్యకత’ బలీయంగా ఉంటుంది! బలీయమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు కూడా – సాహిత్యంలో కానీ, సామాజికంగా కానీ, తమ చరిత్రను తొక్కిపెట్టారనీ, చరిత్రలో తమ ప్రాంతానికీ, వ్యక్తులకూ, సంస్కృతికీ, తగిన ప్రాధాన్యం ఇవ్వ లేదనీ – తెలంగాణా పౌరులు పొందిన ఒక ఆర్తి కూడా బలీయమైన కారణమై ప్రజ్వరిల్లింది! తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే ‘బతుకమ్మ’ పండుగకు ప్రాధాన్యం వచ్చింది! తెలంగాణ సాహిత్య చరిత్ర సమగ్ర రూపకల్పనం జరుగుతోంది. ఆంధ్ర సార స్వత పరిషత్తు – తెలంగాణ సారస్వత పరిషత్తుగా పరిణమించింది. విద్యారంగంలో పాఠ్యగ్రంథాలలో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత కల్పించబడినది. పోటీ పరీక్షలలో తెలంగాణ సమగ్ర అధ్యయనం అభ్యర్థులకు అనివార్యమయ్యింది. ఒక ఆహ్వానించ దగిన పరిణామమొచ్చింది.

‘చరిత్ర అడక్కు-చెప్పింది విను’ అనే పెత్తనపు వైఖరి ఇక చెల్లదు. అసలు ‘చరిత్ర’- ‘చరిత్ర కారులు’ గురించి తెలుగు విషయంలోనే కాదు, భారతదేశం మొత్తాన అసంతృప్తులు వున్నాయి. అసలు కన్నా కల్పితాలూ, ఊహాగానాలూ చారిత్రక అంశాలుగా అయి కూర్చున్న సందర్భాలూ వున్నాయి! స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కూడా కొందరికే ప్రాధాన్యం లభించి, నిజమైన సమరయోధులు మరుగునపడ్డారన్న మాటా వుంది. అంతెందుకు? స్వాతంత్య్ర సమరయోధులుగా పింఛనులు, తామ్ర పత్రాది గౌరవాదులు అందుకున్న వారిలోనూ ‘కుహనాయోధులు’ చాలామంది వున్నారనీ, నిజమైన సమరయోధులు, త్యాగధనులు ప్రభుత్వం ఇచ్చే పింఛనులూ, భూములూ, తామ్రపత్రాలూ త్రోసిరాజని తమ అంత్యదశను దుర్భర జీవనంలో చాలిం చారనీ చరిత్ర కందని కథలున్నాయి! అవి కటిక వాస్తవాలు.

అంతవరకు ఎందుకు? ‘అజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి, భారత స్వాతంత్య్ర సంగ్రామానికి – బ్రిటీష్ వారిని వణికించే మలుపు నిచ్చిన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘మరణం’ దేశస్వాత్రంత్యం వచ్చి ఇన్నేళ్ళయినా, ఇంకా మిష్టరీగానే మిగిలిపోయింది! అసలు చరిత్ర తెలియనే లేదు. ప్రభుత్వమే నేతాజీకి సంబంధించిన అనేక ఫైళ్ళను గుప్తంగా ఉంచేసింది. కారణమేమిటో ఎవరికీ తెలియదు. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే- ఉన్న చరిత్ర నమ్మబలికింది! కానీ అప్పట్లోనే స్వయంగా మహాత్మా గాంధీయే “నేతాజీ మరణించారంటే నమ్మశక్యంగా లేదు” అని 1945లో ఓ సభలో ప్రకటించాడు. 1946 ఏప్రిల్ 8న ఇంటెలిజెన్స్ వర్గాలు రూపొందించిన నివేదికలో ఇలా వుంది “నేతాజీ పై గాంధీజీ చేసిన ప్రకటన కేవలం ఆయన స్వీయ భావన కాదు. ఆయన వద్ద కీలక సమాచార మున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాను రష్యాలో ఉన్నట్లు నేతాజీ నుంచి నెహ్రూకు ఒక లేఖ అందిందనీ, అక్కడినుంచి తప్పించుకునిభారత్‌కు రావాలని అనుకుంటున్నానని బోస్ పేర్కొన్న దాని ఆధారంగానే – గాంధీ ఆ ప్రకటన చేసి వుండవచ్చు’ అని ఆ నిఘానివేదికలో వుంది. ‘పలు రహస్యాలు గాంధీకి తెలుసు. బోస్ మరణం ప్రశ్నార్థకమైనందునే కర్మకాండలు జరిపించవద్దని గాంధీజీ ఒత్తిడి చేశారు” అని నేతాజీ మునిమనుమడు చంద్రబోస్ తెలిపారట!

చరిత్రను ‘దాచ టం’ సరి యైనది కాదు! ముఖ్యంగా మహనీయుల విష యంలో పారదర్శ కత వుండాలి. స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద రహస్యంగా మారిన నేతాజీ అదృశ్యంపై చిక్కు ముడులు వీడి, ఇప్పటి కయినా అసలు చరిత్ర తెలిసేందుకు మార్గం సుగమం చేస్తూ, గాజు తెరలమాటున, పోలీసు భద్రత మధ్య ఉన్న, నేతాజీకి చెంది న 64 ఫైళ్ళను పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గత శుక్రవారం సెప్టెంబర్ 18న బయటపెట్టారు. బోస్ ఫైళ్ళకు సంకెళ్ళు వీడాయి’ ఈ మీ కాలమిస్టు సుధామ నాడు సతీసమేతంగా కలకత్తాలోనే వుండ డమేకాదు, శనివారం 19వ తేదీ ‘నేతాజీ భవన్’ను సందర్శించి, ఆ మహనీయుడు జన్మించి జీవించిన భవనాన్నీ, ఆయన దుస్తులనూ, వస్తుసంచ యాన్నీ, 1941లో ఏమెట్లమీదుగా దిగి, ఏ కారులో, సిసిర్ కుమార్ బోస్ నడపగా ప్రయాణించి, భారత్ నుండి అంతర్థానమైందీ చూస్తుంటే – ఆ సమర యోధుని జ్ఞాపకాలతో, శరీరం రోమాంచితమైంది. దేశభక్తితో హృదయం ‘జైహింద్’ అని నినదించింది. నేతాజీ అసలు సిసలు ‘భారతరత్న’ కాడా? అన్పించింది.
“ఇదో చరిత్రాత్మక సందర్భం. నేతాజీ ఫైళ్ళను బహిర్గతం చేశాం! భరతమాత వీరపుత్రుడి గురించి తెలుసుకునే హక్కు దేశంలో ప్రతిఒక్కరికీ వుంది. మా పని మేం చేశాం. ఇక కేంద్రం కూడా స్పందించాలి” అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ‘మమతాబెనర్జీ’ ఆ 64 పైళ్ళకూ, మొత్తం దానిలో పన్నెండువేల ఏడువందల నలభైనాలుగు పేజీలకూ, డిజిటల్ కాపీ డివిడిని బోస్ వారసులైన కుటుంబసభ్యులకు అంద చేస్తూ, పారదర్శకతను కల్పించారు.

నేతాజీ ముని మనుమడు చంద్రబోస్ – చారిత్రక యథార్థ సత్యావిష్కరణలకు తోడ్పడే ఈ చర్యను స్వాగతిస్తూ, కేంద్రంవద్ద కూడా సుభాష్ చంద్రబోస్‌కు సంబం ధించిన 130 రహస్య ఫైళ్ళు వున్నాయనీ, వాటిని కూడా బహిర్గతం చేయాలనీ కోరారు. అది అవశ్యం జరగవలసిన పని! “సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై ఇప్పటి దాకా వదంతులు, ఊహాగానాలే ప్రచారంలో వున్నాయి. ఇప్పుడు నిజాలు బయటకి వస్తాయి.” అని నేతాజీ కుటుంబా నికి చెందిన మాజీ పార్ల మెంటు సభ్యులు కృష్ణబోస్ ఆశించినట్లుగా ‘అసలు చరిత్ర’ ఆవిష్కృతమవు తుందని ఆకాంక్షిద్దాం! పశ్చిమబెంగాల్‌లో నేటి మమతాసర్కార్ ఈ పారదర్శక చర్య ఒక చరితార్ధకమైనదిగా భావిం చడంలో తప్పులేదు! చరిత్ర-దాచేస్తే దాగని సత్యం గా ‘కాలనాళిక’నూ చీల్చుకుని, ఎప్పటికయినా బయటపడుతుందని చారిత్రకప్రియుల దృఢ విశ్వా సం! టాల్‌స్టాయ్ అన్నట్లు “విశ్వాసమే దేవుడు”!