Home తాజా వార్తలు రాష్ట్ర బడ్జెట్‌పై హెచ్‌ఎండిఎ ఆశలు

రాష్ట్ర బడ్జెట్‌పై హెచ్‌ఎండిఎ ఆశలు

HMDA

 

రూ. 1813 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఓఆర్‌ఆర్ బిఓటి ప్యాకేజీలకు రూ. 1300 కోట్లు
ఔటర్‌కు వచ్చే జైకా, రాష్ట్ర వాటాగా రూ. 512 కోట్లు

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై హెచ్‌ఎండిఎ ఆశలు పెంచుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీ పథకాలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్న అథారిటీ రాష్ట్ర బడ్జెట్‌లోనూ తమకు ప్రాధాన్యత లభించాలని ఆశిస్తున్నది. ప్రతి ఏటా అథారిటీకి ఓఆర్‌ఆర్ పథకానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. ఏటా ఔటర్ పథకానికి చెందిన రెండు పద్దులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇవ్వాల్సి ఉన్నది. ఒక పద్దులో ఔటర్ రింగ్ రోడ్ పథకంలో భాగంగా నిర్వహించే బదిలీ చేయు(బిఓటి) పద్దతిన నిర్మించిన 5 ప్యాకేజీలకు సంబంధించినది. రెండవది ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి వస్తున్న నిధులు ప్రభుత్వ ఖాతాలో జమజరుగుతుంది. కానీ, ఆ నిధులు తిరిగి అథారిటీకి బదిలీ కావాల్సి ఉన్నది.

ఈ రెండు పద్దులతో పాటు ప్రభుత్వ వాటాగా ఔటర్ నిర్మాణానికి సంబంధించి ఏటా రూ. 66. 90 కోట్లు విధిగా అథారిటీకి మంజూరు చేయాల్సి ఉన్నది. బిఓటి పద్ధ్దతిలో నిర్మించిన ఓఆర్‌ఆర్ 5 ప్యాకేజీలకు ఏటా రూ. 332 ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. అయితే ఈ విధంగా చెల్లించాల్సిన నిధులు మొత్తం ఇప్పటి వరకు రూ. 600 కోట్లుగా ఉన్నదనేది సమాచారం. ఇదిలా ఉండగా ఓఆర్‌ఆర్‌కు, ఇన్నర్ రింగ్ రోడ్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న రేడియల్ రోడ్లు 14,20, 26,31,32ల అభివృద్ధికి నిధులను, ఓఆర్‌ఆర్‌లో భూములు కోల్పోయిన వారికి ఆర్‌అండ్‌ఆర్ కింద అభివృద్ధి చేస్తున్న కోహెడ, ఇతర ప్రాంతాలకు గానూ రూ.370 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు.

వీటికి మొత్తం రూ.1300 కోట్లుగా అథారిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 158 కి.మీ.లు నిర్మించేందుకు వెచ్చించిన రూ.6696 కోట్లు కాగా ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కేటగిరీలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.512 కోట్లుగా నిర్ణయించినట్టు అందులో సుమారు రూ.67 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగానూ, రుణదారుడి కోటాలో రూ.446 కోట్లు కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ.110 కోట్లు ఓఆర్‌ఆర్‌లో చేపట్టాల్సిన పనులైన టోల్ పరిపాలనా వ్యవహారాలకు, రేడియల్ రోడ్లు, ఐటిఎస్, సిటి ఐటిఎస్ వంటి పనులు చేపట్టాల్సి ఉన్నది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని అథారిటీ ప్రభుత్వం నుంచి రెండు ఖాతాల ద్వారా సుమారు రూ.1813 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని కోరనున్నట్టు తెలిసింది.

HMDA Hopes on State Budget