Home రంగారెడ్డి మంత్రి మనస్సుపడితే …!

మంత్రి మనస్సుపడితే …!

సమీకృత మాస్టర్‌ప్లాన్ ముందుకు?
గత మార్చిలో మొదలైన రూపకల్పన
జాప్యంలో భూ వినియోగ మార్పిడి, నిబంధనలు
ఐదు ప్లాన్‌లు కలిపి ఒకే ప్లాన్‌గా ఏర్పాటు
జిఐఎస్ టెక్నాలజీలోకి మార్చడం పూర్తి

HMDA-19

మనతెలంగాణ, సిటిబ్యూరో : మంత్రి దృష్టిసారిస్తేనే సమీకృత మాస్టర్‌ప్లాన్-2041 ముందుకుపోయే పరిస్థితులు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ)లో నెలకొన్నాయి. ప్రస్తుతం ప్లాన్‌కు సంబం ధించిన పనులు పూర్తికావచ్చాయి. ప్రత్యేక మార్పులుచేర్పులు మినహాయిస్తే మిగతా ప్రధాన విషయాలు ప్రణాళికలో పొందుపరి చినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. తుదిగా పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించి, అభిప్రాయాలను వెల్లడిస్తే మిగతా పనులపై అధికారులు శ్రద్దపెట్టాలని భావిస్తున్నారు. బృహత్తర ప్రణాళికయందు అథారిటీ పరిధిలో ప్రణాళికబద్దమైన అభివృద్ధికి అవసరమయ్యే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, వాటికివ్వాల్సిన ప్రాధాన్యతనివ్వడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు హెచ్‌ఎండిఎ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గత ప్లాన్‌లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని, అక్రమలేఅవుట్లు, అనుమతిపొందిన లేఅవుట్లను కూడా ప్రణాళికలో పొందుపరిచినట్టు అధికారులు వివరిస్తున్నారు.
ఇప్పటికివి పూర్తి….
అథారిటీ పరిధిలోని అమలులో ఉన్న విభిన్నమైన ఐదు మాస్టర్‌ప్లాన్‌లను సమీకృతం చేయడం పూర్తయ్యింది. ఆ ప్లాన్‌ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడం జరిగింది. భౌగోళిక మైన సూచిక సమాచారాన్ని, డిజిటలైజేషన్, భూమిమీదున్న వాస్తవ పరిస్థితి సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ప్లాన్‌తో వాటాదారులుగా ఉన్న విభాగాలతో సమావే శాలను నిర్వహించడం పూర్తయింది. లేఅవుట్ లను పొందుపరిచారు. ప్రజల నుండి సలహా లు, సూచనలు, అభిప్రాయాలను సేకరించింది అథారిటి. కాగా భూవినియోగ మార్పిడి, సాధారణ మండలి నియమ నిబంధనలు, డ్రాఫ్ట్ ప్లాన్ అనే మూడు అంశాలు పూర్తిచేసే పనిలో అథారిటీ అధికారులున్నారు.
ఏడాది కావస్తోంది…
సమీకృత మాస్టర్‌ప్లాన్ చేప్పట్టి రెండు మాసాలు గడిస్తే ఒక ఏడాది పూర్తికావస్తుంది. ఒక నగరానికి ఒకే ప్రణాళిక అమలులో ఉండాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 11న జిఓ 138ను విడుదలచేసింది. అప్పటి వరకు నగరంలో మొత్తం ఐదు(హడా, హుడా, సిడిఎ, ఎంసిహెచ్, ఎండిపి-2031) మాస్టర్‌ప్లాన్‌లు అమలులో ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ (172.6చ.కి.మీ.), హడా(171చ.కి.మీ.లు) ప్లాన్‌లో ఆటోక్యాడ్ పద్దతిలో.. హుడా (836.31చ.కి.మీ.లు), సిడిఎ(51.07చ.కి, మీ.లు) ప్లాన్‌లు కాగితం పద్దతిలో, ఎండిపి-2031(5985చ.కి.మీ.లు) జిఐఎస్ పద్దతిలో ఉన్నాయి. ఈ ఐదు ప్రణాళికలను జిఐఎస్ విధానంలోకి మార్చి, అన్నిటినీ కలిపేసి ఒకే మాస్టర్‌ప్లాన్-2041ను రూపకల్పన చేయాలని ప్రభుత్వం అథారిటీని అదేశించింది. దీంతో హెచ్‌ఎండిఎ ఈ ప్రణాళి కపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుతం అన్ని ప్లాన్‌లు కలిపడం, జిఐఎస్ సాంకేతిక పరిజ్ఞానంలోకి మార్చడం పూర్తయ్యింది.
మంత్రికై ఎదురుచూపులు…
ప్రణాళికలోని కొన్ని ప్రత్యేక అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రి కెటిఆర్ ఇప్పటి వరకు సమగ్రంగా అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. పలు సందర్భాల్లో హెచ్‌ఎండిఎలో సమావేశాలకు హాజరైన ఆయన బృహత్తర ప్రణాళికపై ప్రత్యేక ఆసక్తిని కనబరచలేదని, అందుకే రూపకల్పన పనులు కొంత జాప్యంతో సాగుతున్నట్టు పేర్కొంటు న్నారు.
ముఖ్యంగా గ్రోత్ కారిడార్ విస్తరణ, ప్రధానంగా 100 అడుగుల ప్రతిపాదిత రహదారుల వెంబడి ఇరువైపుల ఉన్న ప్రాంతాలను వ్యాపార కేటగిరిలోకి మార్చడం, భూవినియోగమార్పిడి(చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్), జోనింగ్ నియమ నిబంధనలు, వినియోగమార్పిడిల రుసుంల ఖరారు, భూమి వినియోగ కేటగిరీలను నిర్ణయించడం వంటి పలు కీలక అంశాలను మంత్రి ముందుకు అధికారులు తీసుకెళ్ళా నున్నట్టు సమాచారం. ఈ సంక్రాంతి పండుగలోపు కెటిఆర్‌తో సమీక్షా సమావేశం జరుగనున్నందున ప్లాన్‌పై ఆయనకు సమగ్రంగా వివరించాలని కమిషనర్ చిరంజీవులు యోచిస్తున్నారు.