Home తాజా వార్తలు ఓటేసే ఉద్యోగులకు 22న సెలవు

ఓటేసే ఉద్యోగులకు 22న సెలవు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌పై సిఇఒ ప్రకటన

Voters

 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలిలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ కోటాలో ఎంఎల్‌ఎసిలను ఎన్నుకునేందుకు ఈ నెల 22న జరిగే పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సెలవు దినం ప్రకటించింది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నందున వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ప్రత్యేక క్యాజువల్ లీవ్’ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిన సిఇఓ రజత్‌కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లకు సెలవు మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు.

అయితే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెలవు దినంగా ప్రకటించే నిబంధన లేనందున సెలవు ఇవ్వడం సాధ్యం కాదని, అయితే ఆలస్యంగా విధులకు హాజరయ్యేందుకు లేదా ఓటు వేయడానికి వెళ్ళేందుకు కొన్ని గంటల ప్రత్యేక అనుమతిని మంజూరు చేయవచ్చని స్పష్టం చేశారు. నిర్దిష్ట పని గంటల కంటే కొంచెం తక్కువగా పనిచేసినా వారిని ఇబ్బంది పెట్టరాదని రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి, ఇదే జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ నెల 26న ఓట్ల లెక్కిపు జరగనుంది.

పోలింగ్ జరిగే చోట మూడు రోజులు సెలవు

పై మూడు ఎంఎల్‌సి ఎన్నికలకు పోలింగ్ జరిగేచోట ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవు మంజూరు చేస్తున్నట్లు సిఇఓ రజత్‌కుమార్ మరొక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ జరిగే కేంద్రాల్లో ముందురోజున ఏర్పాట్లు చేయాల్సిన ఉన్నందునా, పోలింగ్ రోజున ఉదయం మొదలు సాయంత్రం వరకు సాధారణ విధులకు సాధ్యపడనందునా, ఓట్ల లెక్కింపు రోజున రోజువారీ విధులకు ఆటంకం ఏర్పడుతున్నందున ఆ కార్యాలయాలకు సెలవును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మిగిలిన ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని, మూడు రోజుల పాటు సెలవు ఉన్నందున ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు సెలవు రోజున సేవలు పొందే వీలు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ మూడు రోజుల సెలవు కేవలం పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.

 

Holiday in MLC Elections Polling in Telangana