శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మదన్‌పల్లి కొత్తతండాలోని ఇల్లు నేల కూలింది. మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మదన్‌పల్లి కొత్తతండాలో వెంకటయ్యనాయక్ నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు ఎగిరి పోగా గోడలు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో వెంకటయ్యతో పాటు అతని భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న సర్పంచ్ లాలీచందర్ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, తహసీల్దార్ సురేష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తానని తెలిపారు. ఎర్రగుంట తండా, కవ్వగూడ, బోటిగూడ, నర్కూడ, చౌదరిగూడ, ఘాంసిమియాగూడ, పెద్దషాపూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది.