Home వార్తలు ఆశలు ఉన్నాయి కానీ..

ఆశలు ఉన్నాయి కానీ..

tennis

భారత్‌కు ఒలింపిక్స్ పతకం అందించిన క్రీడల్లో టెన్నిస్ కూడా ఒకటి. 1996 ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ సింగిల్స్‌లో దేశానికి కాంస్యం సాధించిపెట్టాడు. అయితే ఈ క్రీడలో ఆ తరువాత భారత్ ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయింది.
కెరీర్‌లో ఉచ్వస్థితికి చేరుకున్న పేస్-భూపతి జోడీ ఆశలు రేపినా పతకం అందుకోవడంలో విఫలమైంది. నాలుగేళ్ల క్రితం అద్భుత అవకాశం ఉన్నా వ్యక్తిగత వివాదాలతో పతక ఆశలు ఆవిరి చేశారు ఆటగాళ్లు. ఇసారీ అలాంటి వివాదాలే చుట్టిముట్టినా పతక ఆశల మాత్రం భారత్ పుష్కలంగానే కనిపిస్తోన్నాయి.

విశ్వక్రీడలు వచ్చేస్తున్నాయ్ మరో 22 రోజుల్లో

విభాగం టెన్నిస్
మొత్తం ఈవెంట్‌లు : 5
భారత్ ప్రాతినిధ్యం వహించే ఈవెంట్లు : 3(మహిళల, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్)
మొత్తం ప్లేయర్ల ప్రాతినిధ్యం : 4(లియాండర్‌పేస్, రోహన్‌బోపన్న, సానియామీర్జా, ప్రార్థన తోంబారే)

గత రెండుమూడేళ్లుగా భారత టెన్నిస్ ప్లేయర్లు చారిత్రత్మక విజయాలు సొంతం చేసుకున్నారు. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా, పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ అద్భుత విజయాలు సాధించారు. కలిసి ఆడకపోయినా వేర్వేరు భాగస్వాములతో గతమూడేళ్ల నుంచి కనీసం రెండు గ్రాండ్‌స్లామ్‌లు అయినా దేశానికి అందించారు. దీంతో రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా దక్కవచ్చనే నమ్మకం వచ్చింది. ముఖ్యంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు ఏదో ఒక పతకం దక్కే అవకాశం ఉంది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెం.1 ర్యాంకర్‌గా కొనసాగుతున్న సానియామీర్జా, రోహన్‌బోపన్న మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ ఆశలు మోయడానికి సిద్ధమయ్యారు. మొదట పేస్-సానియా జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీకి దిగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావించినా.. పేస్‌తో జతకట్టేందుకు సానియా అంగీకరించలేదు. దీంతో అఖిల భారత టెన్నిస్ సమఖ్య సానియా(ఎఐటిఎ) కోరినట్లే ఆమె జోడీగా బోపన్నను ఎంపిక చేసింది. ఇక పురుషుల డబుల్స్‌లో ఆశలు అంతంత మాత్రంగానే కనిపిస్తోన్నాయి. పురుషుల డబుల్స్‌లో బోపన్న అద్భుత విజయాలు సాధిస్తున్నా.. పేస్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. పైగా మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాతో జోడీ కట్టేందుకు 2012 లండన్ ఒలింపిక్స్‌లాగే ఈసారీ వీరిద్దరి మధ్య పెద్ద రాద్ధంతం చోటు చేసుకుంది. సానియాతో ఆడేందుకు పేస్ ఒలింపిక్స్ ఆశలకే గండిపెట్టాడు బోపన్న. చివరికి ఎఐటిఎ రంగంలోకి దిగి పేస్‌తో కలిసి ఆడేందుకు బోపన్నను ఒప్పించింది. అయితే రియోను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాల డబుల్స్ ఆటగాళ్లూ వింబుల్డన్‌లో కలిసి ఆడితే వీరిద్దరు మాత్రం వేర్వేరు భాగస్వాములతో దిగారు. కనీసం రియోలోనైనా మనస్పర్థాలను పక్కన పెట్టి దేశం కోసం తమ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే పతకం రావడమైతే ఖాయం. ఇక మహిళల డబుల్స్‌లోనూ భారత్ పతక ఆశలు అంతంతమాత్రమే. మార్టినా హింగిస్ జతగా సానియామీర్జా మహిళల డబుల్స్‌లో వరుస విజయాలు సాధించినా రియోలో ఆమె జోడీగా బరిలోకి దిగుతోంది ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని ప్రార్థనా తోంబారే. గత రెండేళ్లుగా రియో కోసమే ప్రార్థనాకు సానియా తన టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. మరి ప్రార్థనను సమన్వయం చేసుకొని సానియా దేశానికి పతకం అందిస్తుందేమో చూడాలి.

ప్రాక్టీస్ మొదలు పెట్టారు
రియో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి ఆడేందుకు మొదట విముఖత చూపిన రోహన్ బోపన్న.. అతనితో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. రేపటి(15న) నుంచి కొరియాతో జరిగే ఆసియా/ఒసియనియా జోన్ గ్రూప్-1 డేవిస్‌కప్ కోసం చండీగడ్ క్లబ్‌లో బోపన్న, పేస్ కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. పేస్ సాధించిన విజయాలను చూసిన వాళ్లు అతడిని ఖచ్చితంగా గౌరవిస్తారు. ప్రపంచంలోనే డబుల్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో పేస్ ఒకడు’ అని బోపన్న చెప్పాడు. పేస్‌తో కలిసి ఆడనని తానెప్పుడు చెప్పలేదని, నా ఆటతీరుకు, పేస్ ఆటతీరుకు సరిపోదని అందుకే రియోకు వేరే భాగస్వామి అయితే సౌకర్యంగా ఉంటుందని ఎఐటిఎకు చెప్పినట్లు వెల్లడించాడు. ఇక గతంలో చోటు చేసుకున్న విషయాలపై మాట్లాడడం తనకు ఇష్టం లేదని, దేశం కోసం ఏ ఆటగాడయినా కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని పేస్ అన్నాడు. వందల కోట్ల ప్రజల కోసం ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఈగోలను పక్కన పెడతామని చెప్పాడు. బోపన్న చాలా శ్రమిస్తాడంటూ తన భాగస్వామిని పేస్ ప్రశంసించాడు.