Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ధైర్యముంటే చాలు..

Hotel-on-Hills

విలాసవంతమైన హోటల్ అనగానే మంచి ఖరీదైన భోజనం పడకలాంటివి ఉంటాయని తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోటల్లో కూడా అన్నీ లభిస్తాయి. కానీ అక్కడి వెళ్లాలంటే మాత్రం కొంచెం కాదు ఎక్కువే గుండె ధైర్యం ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ హోటల్ కొండ అంచున ఉంది. అక్కడికి వెళ్లే వాళ్లు సాహసవంతులై ఉండాలి. దీని పేరు కస్కే లాడ్జి. దక్షిణ అమెరికాలోని పెరూలోని కుస్కే దగ్గర సాక్రేడ్ వ్యాలీలోని ఆండీస్ పర్వతాలపై ఉంది. భూమిపై నుంచి 13 వందల 12 అడుగుల ఎత్తులో ఉంది. కొండ అంచుకు వేలాడేసి మూడు గదులుంటాయి. ఒక్కో గదికి చుట్టూ గాజు అద్దాలుంటాయి. బయట ప్రదేశాలు కనబడేలా అమర్చారు. చూడ్డానికి గాజు అద్దాల్లా కనిపించినా అవి చేసింది మాత్రం గాజుతోకాదు పాలీ కార్బనేట్ అనే పదార్థంతో. 24 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే గదులు అల్యూమినియం ఫ్రేమ్‌తో కొండకు అటాచ్ చేయబడి ఉంటాయి.

ఒక్కో గదిలో 8 మంది మాత్రమే సరిపోతారు. మరి ఈ గదులను చేరడం ఎలాగంటే..కింద నుంచి మెట్లలాగా ఏర్పాటుచేసిన నాలుగు వందల అడుగుల ఎత్తున ఉండే నిచ్చెనపై వెళ్లాలి. అది ఎక్కిన తర్వాత కొండలపై ఉన్న దారుల గుండా ఈ గదులను చేరుకోవచ్చు. అంత ఎత్తున ఎక్కలేమనుకుంటే కొండ మధ్యలో ఉండే కజిక్ వైర్లు సాయంతో హోటల్‌కి చేరుకోవచ్చు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య కింద చూస్తే మనసుకు ఆనందాన్ని కలిగించే వాతావరణం కనువిందు చేస్తుంది. హోటల్ గదుల్లో సకల సౌకర్యాలుంటాయి. తినడానికి ఆహార పదార్థాలు నిర్వాహకులు ఏర్పాటుచేసి పెడతారు. ఇందులో స్నానాల గదులు, ఫర్నీచర్, టీవీ కూడా ఉంటుంది. సోలార్‌తో వీటిలో లైట్లు అమరుస్తారు.

హైకింగ్, జిప్ లైనింగ్ ద్వారా మాత్రమే వెళ్లగలిగే ఈ హోటల్ పర్యాటకులకు 2013 నుంచి అందుబాటులోకి వచ్చింది. పెట్స్ తీసుకెళ్లడానికి వీల్లేదు. నిషేధం. చిన్నపిల్లలు వెళ్లేందుకు అనుమతి లేదు. ఒకసారి వెళ్తే ఆ అందమైన అనుభూతిని జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చు. కొండ ఎక్కేటప్పుడు తేలికపాటి దుస్తులు ధరించాలి. సౌకర్యవంతమైన షూ ధరించాలి. పైకి ఎక్కేకొద్దీ చల్లగాలి వీస్తుంటుంది. అదనంగా బట్టలుతీసుకెళ్లాలి. ఒక రోజు లేదా రెండు రోజుల బసకు అవకాశం ఉంటుందక్కడ. ఇంగ్లీషు, స్పానిష్ భాషలు వచ్చి ఉంటే చాలు.

Comments

comments