Home దునియా కాఫీ బ్రేక్

కాఫీ బ్రేక్

Cartoons

నరసింహులు మళ్లీ తాగి వచ్చినట్టున్నాడు. పెద్ద పెద్దగా అరుపులు, చెవులు చిల్లులు పడేన్ని బూతులు. అవన్నీ అసలు వినబడనట్టే పొయ్యి దగ్గర కూర్చుని జొన్న రొట్టెలు కాల్చుకుంటోంది గౌరమ్మ. ఆమె ఏం మాట్లాడదని అతనికి తెలుసు. మరింత రెచ్చగొడుతూ మరిన్ని తిట్లు తిడుతూ అక్కడక్కడే తూలుతూ తిరుగుతున్నాడు. ఖాళీ స్థలాన్ని ఎవరూ కబ్జా చేయకుండా ఓనర్ ప్రహరీ గోడ కట్టి వీళ్లకి అప్పచెప్తే అక్కడే గుడిసె వేసుకుని ఉంటున్నారు వీళ్లు. నరసింహులు గుడిసె ముందు అది ఎప్పుడూ జరిగే వ్యవహారమే. చుట్టుపక్కల వాళ్లకీ అలవాటు. అందుకే ఎవరూ బయటకు కూడా రారు. పట్టించుకోరు. గౌరమ్మకి కూడా అతని మాటలకు కోపం వస్తుంది. అతని ప్రవర్తనను అసహ్యించుకుంటుంది. కాని ఎందుకు గౌరమ్మ అతనికి ఎదురు తిరగదు? ఎందుకంటే మహిళ సెక్సువాలిటీ ముందు ఆమె ఇండివిడ్యువాలిటీ తల వంచేస్తుంది.

తన శరీరమే ఒక తిట్టు. మగవాడికి ఉపయోగపడే ఒక వస్తువు. ఏ దేశమైనా, ఏ కమ్యూనిటీ అయినా ఈ రూల్ అన్ని చోట్ల ఒకటే. ఒక మహిళను కించపరచాలంటే ఆమె శరీరాన్ని కించపరుస్తూ తిడితే ఆమె సిగ్గుతో తల దించుకోవాలి. తిట్ల వెనక ఉన్న శాడిస్టిక్ ఆలోచన అదే. మన సమాజంలో మగవాడిని తిట్టడానికి ప్రత్యేకంగా తిట్లేమీ లేవు. అతని తరపు మహిళల్ని తిడితే ఇతనికి రోషం రావాలి. అంతే. ఉన్నవి రెండు జెండర్లు. ఆడ, మగ. మూడో జెండర్ అనేది కూడా ఉంటుంది. కాని దాన్నెవరు లెక్కలోకి రానిస్తారు? ఇక్కడ రెండు జెండర్లలో ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రెండవ జెండర్ ఎప్పటికీ తన ఉనికి కోసం, అస్థిత్వం కోసం పాకులాడుతూనే ఉండాలి. పుట్టినప్పటి నుంచి తన శరీరాన్ని కాపాడుకోవడమే స్త్రీధర్మం. తన శరీరాన్ని తాను చూసుకుని సిగ్గు పడాలి. అదే న్యాయం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లతో ఎక్కువశాతం మహిళలు చనిపోడానికి కారణం తన శరీరం అంటే తనకు ఉన్న సిగ్గు వల్లే. గమనించుకోరు. గమనించుకున్నా బయటకు చెప్పడానికి సిగ్గు.

బస్సులో వెనకే నుంచుని చెయ్యి తగిలిస్తూ ఏమీ తెలియనట్లు అటు ముఖం పెట్టుకున్నవాడికి తనను అలా ముట్టుకున్నందువలన ఏం వస్తుందో అర్థం కాదు. స్కూల్లో చదువుకునే పసిపిల్లల మీద టీచర్, ప్రిన్సిపాల్, వాచ్‌మేన్, పిటి మాస్టర్, పక్కింటివాడు ఇలా ఏ రూపంలో ఎవడు వచ్చి తన శరీరాన్ని కబళిస్తాడో తెలీదు. అంతేనా.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కూడా ఆమెలో సెక్సువాలిటీనే చూస్తున్న సంఘటనలు, సందర్భాలు చూస్తూనే ఉంటాం. ఏ చుట్టాన్ని నమ్మి ఆడపిల్లని అప్పచెప్పడానికి లేదు. ఇలాటి పరిస్థితుల్లో తనకీ ఇండివిడ్యువాలిటీ ఉందని నిరూపించుకోడానికి, కనీసం తనకి తాను ఫీల్ అవడానికి అయినా ఆస్కారం ఉందా. ఉన్నా దానికోసం జీవితమే ఒక పోరాటం అవదా? పని ప్రదేశాల్లో కూలీ నుంచి ఆఫీసరు పదవి వరకు ఏ పనిలో ఉన్నా అక్కడ కూడా ఆమె ఇండివిడ్యువాలిటీని సెక్సువాలిటీ ఓడిస్తుంది. పని ఇచ్చేవాడు ఆమె సెక్సువాలిటీని చూస్తాడు. ట్రై చేద్దాం పడుతుందేమో చూద్దాం. ఒక రాయేస్తే పోయేదేముంది అన్న భావన నూటికి ఏమాత్రం అనుమానం లేకుండా తొంభైశాతం మంది మగవాళ్లకి ఉంటుంది.

అత్యున్నత స్థాయి అధికారిగా ఉన్న ఒక మహిళ అభిప్రాయం ఇది, ‘జెండర్ తేడా నేను ఎదుర్కుంటూ ఉంటాను. మగవాళ్లయితే సాయంత్రం కలిసి పార్టీలు చేసుకుంటారు. బృందంతో, పైవాళ్లతో పనులు చేయించుకుంటారు. నేను మగవాళ్లతో పని గురించి తప్ప సోషల్ కాంటక్ట్‌లు పెట్టుకోలేను. అది నా బాధ్యత మీద ప్రభావం చూపిస్తుంది.’అని. ఒకవేళ సోషల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆమెలో ఇండివిడ్యువాలిటీని కాకుండా సెక్సువాలిటీని చూస్తాడు. అదే భయం. కలెక్టర్ స్థాయిలో ఉన్న నిజాయితీ గల ఆఫీసర్లో కూడా ఆమె తెలివి కాదు, ఆమెలో కూడా సెక్సువాలిటీ మాత్రమే చూడగలిగిన ప్రబుద్ధులున్నారు. ఆమెలో తెలివి తేటలు, స్వంత ఆలోచన, స్వతంత్ర భావాలు, స్థిరమైన వ్యక్తిత్వం ఇలా ఎన్నో పాజిటివ్ కోణాలుండగా మహిళ అంటే శరీరం అన్న కోణంలో చూసేవాళ్లకి కొదవలేదు.

ఏం తోచకపోతే అలా టీకొట్టు వరకు వెళ్లి టీతాగి వచ్చే వీలు ఆడవాళ్లకుంటుందా. ఒక్కరే సినిమాకి వెళ్తారా మగవాళ్లలాగా. అమ్మో! ఇంకేమన్నా ఉందా. వేరేగా అనుకోరూ…అన్నయ్య రాత్రి పదకొండయినా ఇంటకి రాడు. తల్లిదండ్రులు ఏమాత్రం టెన్షన్ పడరు. కాని తాను ఏడింటిలోపల ఇంట్లో ఉండకపోతే అంత హైరానా ఎందుకు పడిపోతారు అని టీనేజ్ అమ్మాయిలు అడిగే ప్రశ్నకి సమాధానం…నీ శరీరాన్ని కాపాడుకోవాలంటే చీకటి పడ్డాక బయట తిరగకూడదు. బయట మగ అనే భయంకరమైన జెండర్ తిరుగుతుంది. అది కబళిస్తుందేమో అనే భయపడుతూ బతుకు అని చెప్పాలి. ట్రైన్‌లో కింద బెర్తులో ఆదమరిచి ఒళ్లు తెలీకుండా మగవాళ్లు నిద్రపోతే పైబెర్తులో పడుకున్నా బిక్కుబిక్కుమని రాత్రంతా ఆడవాళ్లు నిద్రపోకుండా జాగారం ఎందుకు చేయాలి? కారణం. శరీరం. ప్రకృతి సృష్టించింది దేవుడు అనే కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే మగవాడికి శారీరకంగా బలాన్నిచ్చి, జంతువులాగా రెచ్చిపోగలిగే కామ ప్రవృత్తిని ఇచ్చినప్పుడు అమ్మాయికి నెత్తి మీద రెండు కొమ్ములు ఇవ్వాల్సింది. తన శరీరం, ప్రాణం రక్షించుకోగలిగేది. తన శరీరం మీద దాడి చేసిన వారిని చీల్చి చెండాడేది.

– సిరి చాగంటి