Home ఆఫ్ బీట్ ప్లాట్లకు కృత్రిమ కొరత

ప్లాట్లకు కృత్రిమ కొరత

Housing affordability is the result of artificial scarcity

ఏజెంట్లు, రియల్టర్లు కొత్త కోణం
డిమాండ్‌ను విపరీతంగా పెంచేసిన వైనం
గ్రేటర్ శివారులో తెరపైకి రియల్ బూమ్

రియల్ ఎస్టేట్‌లో కృత్రిమ కొరత తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ధరలను పెంచేందుకు రియల్ వ్యాపారులు ఈ ప్రణాళికను అమలు పరుస్తున్నారని చర్చకు తెరలేచింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, శివారు పట్టణాల్లో ఈ తరహా పద్ధ్దతి ఉన్నది. ఇప్పుడు ఈ తరహా వ్యవహారాలు ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా లేఅవుట్లలోని ప్లాట్లకు విపరీతమైన డిమాండ్‌ను తీసుకువచ్చేందుకు రియల్ వ్యాపారులు ప్లాట్లు లేవంటూనే ఒక ప్లాటున్నదంటూ ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలైన షాద్‌నగర్, ఘట్‌కేసర్, కీసర, సంగారెడ్డి, శంకర్‌పల్లి, మోయినాబాద్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, యాదాద్రి, చుట్టూర ఈ తరహా కృత్రిమ కొరతను సృష్టించి ఖాళీ ప్లాట్లను, రీసేల్ ప్లాట్లను విక్రయిస్తూ, రియల్‌బూమ్‌ను తీసుకువస్తున్నారు. ఏజెంట్లు, రియల్టర్లు, వ్యక్తిగత ఇళ్ళ నిర్మాణదారులు ఈ రకంగా వ్యాపారం సాగిస్తున్నారని కొనుగోలుదారులు వెల్లడిస్తున్నారు. ఈ కొరతతో ఓవైపు ధరలను పెంచుతూ, మరో వైపు ఆకార రహితమైన, లోపాలున్న ప్లాట్లను ముందుగా విక్రయిస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారనేది ఆయా ప్రాంతాలకు చెందిన కొనుగోలుదారులు వివరిస్తున్నారు.

కిలోమీటర్ల మేర లేఅవుట్లు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కనీసం 5 కి.మీ.ల మేర వందలుగా లేఅవుట్లు వెలిశాయి. అక్కడ కూడా కనీస ధర రూ. 3 వేలుగా ఉన్నది. సాధారణ ప్రజలు ఓ 100 చ.గ.లు ప్లాటును కొనుగోలు చేయలేని పరిస్థితిని రియల్టర్లు తీసుకువస్తున్నారు. వరంగల్, హైదరాబాద్‌లకు చెందిన రియల్టర్లు అక్కడ భూవ్యాపారం చేస్తున్నారు. అయితే, యాదాద్రి డెవలప్ అథారిటీ అమలులోకి వచ్చింది. కానీ, లేఅవుట్లకు యాడా నుండి అనుమతిని తీసుకున్నవి వేళ్ళపైన లెక్కించవచ్చును. డిటిసిపి నుంచి కూడా లేఅవుట్లకు అనుమతి తీసుకోకుండా వందలాదిగా వెలిశాయి. కేవలం గ్రామపంచాయితీల అనుమతి ఉందంటూ ప్రచారం చేసుకుంటూ విక్రయాలు చేస్తున్నారు. ఇలాంటి లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేయడం ద్వారా పలు రకాలుగా సమస్యలు ఎదురవుతాయనేది బహిరంగ రహాస్యం. యాదాద్రి పరిధిలో అధికారికంగా అనుమతులున్న ప్లాట్లను కొనుగోలు చేయాలంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ రియల్టర్లు, ఏజెంట్లు, మీడియేటర్లు అమ్మకానికి ప్లాట్లు లేవంటూ ఒక్కప్లాటును చూపిస్తూ ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.

షాద్‌నగర్‌లో..
నగరానికి చేరువగా ఉన్న షాద్‌నగర్‌లో మునిసిపాలిటీ, డిటిసిపి అనుమతులు తీసుకుని లేఅవుట్లు వెలుస్తున్నాయి. కానీ, అక్కడ ఏజెంట్లు ప్లాట్లను ముందుగానే ఒప్పందం చేసుకోవడం, పూర్తిగా ఖరీదు చేసుకుని కొనుగోలు దారులకు విపరీతమైన డిమాండ్‌లో విక్రయిస్తున్నారు. దీంతో రియల్ బూమ్ వాతావరణం ఏర్పడుతోంది. ముందుగా ప్లాట్లు లేవనే వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ విషయం నోటి మాటల ద్వారా విపరీతంగా వ్యాప్తిచెందుతుంది. తద్వారా ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయనే భావనలో చాలా మంది ఖాళీ ప్లాట్లవైపు మొగ్గుచూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న రియల్టర్లు అదే వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ కనీస ధర రూ. 2 వేలుగా ఉంటే ఇప్పుడు అది కాస్త రూ. 4500ల నుంచి రూ. 15000లకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలుకొని శంకర్‌పల్లివైపు ఖాళీ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్‌ను తీసుకువచ్చింది. కొత్తూరులోనూ ఇదే పరిస్థితి.

శివారులో వ్యక్తిగత ఇళ్ళు
ప్రధానంగా జాతీయ రహదారులన్నీ గ్రామాలు, పట్టణాల వద్ద బైపాస్ రహదారులు రావడంతో వాటికి దగ్గరగా ఉన్న ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. బైపాస్ రోడ్ల వెంట అధికంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. నియమాల ప్రకారంగా కనీసం 40 అడుగుల రోడ్డును ఏర్పాటు చేయాలనేది విస్మరిస్తున్నారు. నగర శివారులోని తూర్పు, ఉత్తర భాగ ప్రాంతాలైన హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట్ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్ళకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.
ఇలా నిర్మిస్తుండగానే అలా అమ్మడం జరుగుతోంది. దీంతో చాలా మంది కట్టిన ఇళ్ళకు అనుమతులున్నాయా… లేవా..? అనేది పరిగణలోకి తీసుకోకుండానే ఖరీదుచేస్తున్నారు.

ముఖ్యంగా నాగారం, ఎన్‌ఎఫ్‌సినగర్, ఏదులాబాద్, కొర్రెంల, అబ్దుల్లాపూర్‌మెట్, జల్‌పల్లి, బడంగ్‌పేట్, హైదరాషాకోట్ల వంటి ప్రాంతాల్లో విపరీతంగా వ్యక్తిగ ఇళ్లు ఏర్పడుతున్నాయి.

ఇక్కడ చాలా ప్రాంతాల్లోని ఇళ్ళకు గ్రామపంచాయితీల నుంచి కూడా అనుమతులు రావడంలేదు.
వాటి ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ లేనందున ఇటు గ్రామపంచాయితీలు, అటు హెచ్‌ఎండిఎ, మునిసిపాలిటీలు కూడ అనుమతులు మంజూరు చేయడంలేదు. దీంతో చాలా నిర్మాణదారులు ఇంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నారు. అయినా, విపరీతంగా కొనుగోలుదారులు ఖరీదుచేస్తున్నారు. వీటిల్లోనూ ఒక అంతస్థు (గ్రౌండ్ ఫ్లోర్)వరకు మాత్రమే నిర్మిస్తున్నారు. రెండు, మూడు అంతస్థుల భవనాలు చాలా తక్కువగా నిర్మించడం జరుగుతోంది.

సమస్యలే..
హెచ్‌ఎండిఎ పరిధిలో అనుమతి ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. జిల్లాల్లో మునిసిపాలిటీలు, డిటిసిపి అనుమతులు తీసుకున్న వాటినే ఖరీదు చేయాలి. లేని పక్షంలో ఇంటి నిర్మాణ అనుమతి తీసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్ 33శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ప్లాట్లు అనుమతినివ్వలేని ప్రాంతంలో ఉంటున్నాయి.
మరికొన్ని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత రహదారుల్లో, ఉద్యానవనం, వ్యాపార, పారిశ్రామిక, బహుళ ప్రయోజన కేటగిరీల్లో ఉంటాయి.

దీంతో ఇంటి అనుమతులను అధికారిక సంస్థలు ఎలాంటి అనుమతులు మంజూరు చేయజాలవు. రుణాలు రావు. భవిష్యత్తులో వీటిని విక్రయించాలన్నా.. మరెవ్వరూ కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంటుంది. కొనుగోలుదారులకు లాభంచేకూర్చకపోగా తీవ్రంగా నష్టం కలిగించే విధంగా ప్లాట్లుంటాయనేది మరవరాదు. పార్కుల్లో, ప్రతిపాదిత రోడ్లలో ఉన్న ప్లాట్లను మరెవ్వరూ కొనుగోలు చేయరనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.

                                                                                                                                                       – మంచె మహేశ్వర్

Housing affordability is the result of artificial scarcity