Home కరీంనగర్ భక్తులతో కిటకిటలాడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రం…

భక్తులతో కిటకిటలాడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రం…

bugga-ramalingeshwara-swami

కరీంనగర్: శనివారం శ్రావణ ముగింపు ఉత్సవాల సందర్భంగా మండలంలోని అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దీంతో అటవీ ప్రాంతం ప్రత్యేక శోభను సంతరించుకంది. శ్రావణమాసం బహుళ పక్షం చతుర్ధశి అమావాస్య రోజును పురస్కరించుకుని పిల్లాపాపలతో వచ్చిన అనేక మంది పుణ్యస్నానాలు ఆచరించి ఇష్టదేవతలకు మొక్కులు చెల్లించారు. మహిమానిత్వమైన శివలింగానికి క్షీర, జలాభిషేకం చేసి రకరకాల పుష్పాలతో మారేడు దళాలను సమర్పించారు. మొదట ఆంజనేయస్వామికి చందనం పూసి, జిల్లేడు ఆకులతో పూజలు నిర్వహించారు. స్వామి దర్శనంతో దుష్టశక్తులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అక్కపల్లి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోగల అటవీ ప్రాంతంలో పూర్వం పాండవులు వనవాసం చేసిన కాలంలో క్షేత్రం వెలసినట్లు స్థల పురాణం వల్ల తెలుస్తుంది. ఇక్కడి చెట్లు ఆహ్లాదరకరం, కనువిందు చేయడంతోపాటు రమణీయతను పంచుతున్నాయి. గర్భగుడి అడుగుభాగం నుండి పైకి ఉబికి వస్తున్న జలం ఔషద గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఆ జలంతో స్నానం చేసినా లేదా సేవించినా దీర్ఘకాళిక జబ్బులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జలాన్ని తీసుకెళ్లి పచ్చని పంట పొలాల్లో చల్లితే తెగుళ్లు నయమవుతాయన్న నమ్మకంతో సంవత్సరంలోని ప్రతి శ్రావణమాసంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి శ్రావణమాసంతోపాటు మహాశివరాత్రి పర్వదినమును ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు.