Home రాష్ట్ర వార్తలు అమిత్ షా అండతో భారీగా నోట్ల మార్పిడి

అమిత్ షా అండతో భారీగా నోట్ల మార్పిడి

బిజెపి అధ్యక్షుడి ఆదేశాలతో గుజరాత్‌లో కొంతమందికి రెండో రోజునే బ్యాంకులు భారీ ఎత్తున నోట్ల మార్పిడి చేశాయి : సురవరం

CPIహైదరాబాద్ : నోట్లు రద్దయిన రెండో రోజు నే గుజరాత్‌లో కొంతమంది వ్యక్తులకు బిజెపి అధ్యక్షులు అమిత్ షా ఆదేశాలతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున నగదు ను మార్పిడి చేశాయన్న విషయంపై ప్రధాని సమాధానం చెప్పాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్ ప్రభుత్వంలో మోడీ మంత్రివర్గ సహచరుడుగా పనిచేసిన వ్యక్తే ఈ విషయంపై స్వయంగా ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులకు కొత్త నోట్లు అధికంగా ఇవ్వడంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మగ్దూంభవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డిలతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు తరువాత బ్యాంకులకు దాచుకున్న నోట్లు వస్తున్నాయే తప్ప దోచుకున్న నోట్లు రావడం లేదని సురవరం అన్నారు. నల్లడబ్బును దాచు కునే సౌకర్యం కల్పించేందుకే మోడీ రూ.2వేల నోట్లు ముద్రింపజేశారని, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళపై జరిగిన సోదాల్లో కోట్లల్లో రూ.2వేల నోట్లు బైట పడుతున్నాయన్నారు.
రూ.2వేలు ఎందుకు తీసుకు వచ్చారో ప్రధాని ఇంత వరకు సమాధానం చెప్పలేదని, ఇదొక పెద్ద కుంభ కోణం అని అనుమానం వస్తోందన్నారు. నోట్ల రద్దు తరువాత ప్రధాని, ఆర్థిక శాఖ, ఆర్‌బిఐ రోజుకో నిబంధనతో ప్రజలను గందర గోళపరు స్తున్నాయని చెప్పారు. బ్యాంకుల నుండి ప్రతి ఒక్కరు రూ.24వేల నగదు, పెళ్ళి ఉన్న వారు రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చన్న నిబం ధన ఒక్క శాతం కూడా అమలు కాలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుపై సమాధానం చెప్పలేకనే అధి కార బిజెపి ఉద్దేశ్యపూర్వకంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగకుండా అడ్డుకుం దని విమర్శించారు. సభ జరగకపోవడంపై నెపాన్ని ప్రతిపక్షాలపై వేసేందుకు ప్రయత్నిస్తు న్నారని, అయితే బిజెపి అగ్రనేత అద్వానీ సభ సాగకపోవడం పట్ల ప్రభుత్వాన్ని మందలించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. నోట్ల రద్దుపై సభలో మాట్లాడని ప్రధాని మోడీ దేశమంతా తిరుగుతూ జనసభలో మాట్లాడుతన్నానని చెప్పుకోవడం సిగ్గు చేటు విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలి
నోట్ల రద్దు తరువాత ప్రజలు పడుతున్న ఘోషపై తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి కేందర ప్రభుత్వానికి పంపాలని సురవరం అన్నారు. ప్రధాని మోడీకి ఆగ్రహం తెప్పించొద్దనే భయం కెసిఆర్‌కు ఉండొచ్చని, కాని ముఖ్యమంత్రిగా ప్రజల ఇబ్బందులను చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నదన్నారు.
హైదరాబాద్‌లో జాతీయ సమితి సమావేశాలు
ఈ నెల 20 నుండి 23 వరకు సిపిఐ జాతీయ సమితి సమావేశాలు జరగనున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. నోట్ల రద్దుతో సిఎం కెసిఆర్‌కు కష్టాలు లేకపోవచ్చు గాని ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కనపడడం లేదా? అని చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. నోట్ల రద్దు తరువాత ఆదాయం పడిన ప్రభావం తెలియాలంటే అక్టోబర్, నవంబర్ మాసాల ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గత రెండు నెలలుగా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకం బకాయిలు చెల్లించడం లేదని, వ్యవసాయానికి డబ్బులు దొరకడం, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామీణ వ్యవస్థ అతలా కుతలం అవుతోందని అన్నారు. సిపిఐ(ఎం) చేపట్టిన మహాజన పాదయాత్రకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆదిలాబాద్‌లో పాదయాత్ర బృందాన్ని ఒక వ్యాన్ ఢీకొన్నదని, అదృష్టవశాత్తు ప్రాణా పాయం కలగలేదన్నారు.