Home తాజా వార్తలు హెచ్‌యుఎల్ చేతికి హార్లిక్స్

హెచ్‌యుఎల్ చేతికి హార్లిక్స్

HUL Share rose by 5 per cent

 

ఈ ఒప్పందం విలువ రూ.26,761 కోట్లు
ఎఫ్‌ఎంసిజి మార్కెట్‌లో ఇదే అతిపెద్ద డీల్

న్యూఢిల్లీ : ఎట్టకేలకు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జిఎస్‌కె)కు చెందిన ఇండియన్ హార్లిక్స్ వ్యాపారాన్ని ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హిందుస్తాన్ యునీలివర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్) సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ 3.8 బిలియన్ డాలర్ల్లు(రూ.26,761 కోట్ల)గా ఉంది. ఈమేరకు ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయని హెచ్‌యుఎల్ స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది. కాగా ఎఫ్‌ఎంసిజి(ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్‌లో ఇది అతిపెద్ద డీల్‌గా పేర్కొంటున్నారు. ఇంతకుముందు ఈ డీల్ రేసులో నెస్లే కంపెనీ ముందున్నట్టు కనిపించింది. అయితే అనూహ్యంగా హిందుస్థాన్ యునీలివర్ ముందుకు వచ్చి హార్లిక్స్‌తో డీల్‌ను పూర్తి చేసుకుంది.

జిఎస్‌కెకు చెందిన హార్లిక్స్ ఇతర ఉత్పత్తులు యునీలివర్ ఆధ్వర్యంలోకి రానున్నాయనియునీలివర్ వెల్లడించింది. జిఎస్‌కె ఇండియాకు చెందిన పోషకారహార వ్యాపారం త్వరలో హెచ్‌యూఎల్ పరం కానుంది. ఈ మేరకు ఇరు సంస్థలు బోర్డులు ఆమోదం తెలిపాయని యునీలివర్ తెలిపింది. హార్లిక్స్‌ను సొంతం చేసుకునేందుకు రూ.26,761 కోట్ల డీల్ చేసుకోగా, రానున్న 12 నెలల్లో 4.39 నిష్పత్తి ప్రకారం ఈ డీల్ పూర్తికానుందని హెచ్‌యుఎల్ తెలిపింది. కాగా హార్లిక్స్ రేసులో యునిలీవర్‌తో పాటు కోకకోలా, క్రాఫ్ట్ హైంజ్, నెస్లే వంటి ఇతర దిగ్గజ కంపెనీలూ పోటీ పడ్డాయి. అయితే జిఎస్‌కె ఇండియాకు చెందిన 72.5 శాతం వాటాను చేజిక్కించుకునేందుకు 3 బిలియన్ డాలర్ల డీల్‌తో నెస్లే తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆఖరికి హెచ్‌యుఎల్ ఈ కంపెనీని సొంతం చేసుకుంది.

5 శాతం లాభపడిన హెచ్‌యుఎల్ షేరు
హార్లిక్స్‌ను సొంతం చేసుకోవడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లో హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు పైపైకి ఎగిశాయి. 5 శాతం లాభంతో జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్‌యూఎల్ షేరు ఎన్‌ఎస్‌ఇలో రూ.1,769.50ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జిఎస్‌కె కన్జూమర్ హెల్త్‌కేర్ వ్యాపారాన్ని విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతిచ్చినట్లు హెచ్‌యుఎల్ స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో హెచ్‌యుఎల్ కౌంటర్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో షేరు 4.80 శాతం లాభపడి రూ.1,838 వద్ద కనిపించింది. ఈ స్థాయి హెచ్‌యూఎల్ షేరుకు జీవితకాల గరిష్టస్థాయి. ఆఖరికి షేరు విలువ 4.68 శాతం పెరిగి రూ.1,836 వద్ద ముగిసింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలను లాభాలతో ముగియడానికి కారణం హెచ్‌యూఎల్ షేర్ల ర్యాలీనే అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,241.20లు, రూ.1,838.30లుగా నమోదయ్యాయి.

HUL Share rose by 5 per cent

Telangana Latest News