Home ఎడిటోరియల్ ఉరిబిగుస్తున్న హక్కులు !

ఉరిబిగుస్తున్న హక్కులు !

Human-Rights

మానవ హక్కుల కార్యకర్తలపై జరిగే హింసాకాండను ఎలా ఆపగలం? అందునా ప్రభుత్వం రానురానూ ఏక ఛత్రాధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్న తరుణంలో వారికి ఏదీ రక్ష? ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే వారిపై దాడుల విషయంలో మన దేశం ఏమీ తీసిపోలేదు.
ఇతరుల హక్కుల గురించి మాట్లాడేవారిని గురిపెట్టి దాడులు జరపడం దేశంలో చాలా చోట్ల మామూలైంది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పెద్ద ఎత్తున పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. చాలామంది మానవ హక్కుల కారకర్తలను అనేక అభియోగాలలో ఇరికించి, ఐపిసి (భారతీయ శిక్షాస్మృతి క్రింద కేసులు పెడుతున్నారు. జనవరి 8న వాషింగ్టన్ పోస్ట్ ఏమని రాసిందంటే – బస్తర్ పోలీసులు కనీసం 16 మంది స్త్రీల రేప్ కేసులలో దోషులని జాతీయ మానవ హక్కుల కమిషన్ కనుగొందని.
పాక్ సమాజంలో కదలిక
పాకిస్థాన్‌లో నలుగురు మానవ హక్కుల కార్యకర్తల ఆచూకీ గల్లంతైనప్పుడు ఇస్లామాబాద్, లాహోర్, కరాచిలో అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యకర్తల ఆచూకీ లభించేదాకా ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకోవాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ‘హ్యూమన్ వాచ్’ నిఘా సంస్థ ఈ ఉదంతంపై దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ఆ దేశ ఆంగ్ల దినపత్రిక డాన్ ఈ దృశ్యాల వెనుక పాక్ ప్రభుత్వ హస్తం ఉందని అనుమానాలున్నట్లు రాసింది. వామపక్ష భావాలు గల లిబరల్స్ కూడా ఈ అపహరణ లకు భద్రతా సంస్థలు, మిలిటెంట్లు కారణం కావచ్చునని వ్యాఖ్యానించారు. అయితే అందుకు తమదే బాధ్యత అని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించకపోవడం గమనార్హం.
ఆ నలుగురి సహచర కార్యకర్త గత 11న ప్రత్యక్ష మయ్యాడు. ఈనెల 4-7మధ్య వేర్వేరు నగరాలనుండి కవి సల్మాన్‌హైదర్, అహ్మద్ రెజా నసీర్ కనపడకుండా పోయారు. ఈ తప్పు చేయని విమర్శకులను మాయం చేసే ఆనవాయితీ పాకిస్థాన్‌కు ఉంది. 2016 ఆగస్టులో జీనత్ సహజాది అనే యువ జర్నలిస్టును సాయుధుల ముఠా ఎత్తుకుపోయింది. 2009-15 మధ్య ఇలా గల్లంతయిన 4,557 మంది బాధితులు శవాలై తేలారు. ప్రపంచ వ్యాప్తంగా బలవంతపు అపహరణల పర్వం ఉంది. నవంబర్ 2016లో చైనా న్యాయవాది, హక్కుల కార్యకర్త జియాంగ్ తియాన్ యాంగ్‌ను సాయుధుల ముఠా అపహరించింది. ఆయన తన సహచరుడి నిర్బంధంపై దర్యాప్తు చేస్తుండగా అపహరణకు గురయ్యారు.
చాలా దేశాల్లో ఇదే పరిస్థితి
చాలా దేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే వారిని వేధింపులకు, అపహరణలకు గురిచేయడం మామూలయింది. అల్‌జజీర ఈనెల 12 న విడుదల చేసిన నివేదిక అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను ప్రభుత్వాలు ఇందుకు వాడుతున్నట్లు ప్రకటిం చింది. రెండు నెలల పాటు తమిళనాడులోని హరిహర పాక్కం గ్రామంలో తులు కాంతమ్మన్ ఆలయం మూతపడి ఉంది. ఈనెల 11న ఆలయాన్ని తెరిచినప్పుడు శతాబ్దాల ఆచారానికి అడ్డుకట్ట వేస్తూ దళితులకు కూడా ప్రవేశం కల్పించింది. ఒక గ్రామ సభలో అందుకు నిర్ణయం తీసుకున్నారు. 400 మంది అగ్రకుల హిందు వులు ఏకగ్రీవంగా అందుకు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ కులంతో నిమిత్తం లేకుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చునన్నారు. 2016 ఆగస్టులో కొంతమంది దళితులు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించగా అగ్రకుల హిందువులు వ్యతిరేకించడంతో మూత పడింది. అందుకే దాన్ని మూసేశారు. అయితే అక్టోబర్‌లో 200 మంది దళితులకు సబ్ కలెక్టర్ సమక్షంలో ప్రవేశం కల్పించి పూజలు జరిపించారు. దీనితో అగ్రకుల హిందువులు రెచ్చిపోయి నిరసన ప్రదర్శనలు జరిపారు. అప్పుడే ఆలయం మూతపడింది. మూడునెలలపాటు ఆలయానికి అదనపు భద్రతా బందోబస్తు అవసరపడింది. చివరకు దళితులు నిత్యావసరాలు తెచ్చుకోవ డానికి కూడా ఆటో ఎక్కడం కూడదు. ఇది అగ్రకులస్థుల దాష్టీకం. చివరకు అగ్రకులస్థులు వెళ్లే దుకాణాలకు కూడా దళితులు వెళ్ళకూడదు. అందుకే అక్కడ అధికారుల సమక్షంలో ఆలయ ప్రవేశం అవసరపడింది.
అసహన దాడులపై ‘వాచ్’ నివేదిక
భారతదేశంలో అసహన వాతావరణం పెరుగుతున్నట్టు ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ 2017 ప్రపంచ నివేదికలో తెలిపింది. దేశంలో గత ఏడాది జరిగిన అనేక అసహన ఘటనల వివరాలతో నివేదిక ప్రారంభమైంది. మైనారిటీల భావప్రకటన స్వేచ్ఛపై పరిమితులు దారుణంగా ఉన్నాయని, అధికార భారతీయ జనతా పార్టీ(బిజెపి) మద్దతుదారులమని చెప్పుకుంటూ కొన్ని గ్రూపులు మైనారిటీలపై అక్రమంగా నిఘాకాసి, దాడులకు కూడా దిగుతున్నట్లు నివేదిక పేర్కొంది. చివరకు విద్యార్థులపై కూడా రాజద్రోహ నేరం మోపి జైళ్లలోకి తోస్తున్న వాస్తవాన్ని నివేదిక పేర్కొంది. పౌర హక్కులకు భంగం వాటిల్లడాన్ని ప్రశ్నించిన వ్యక్తులపై కూడా ఒకోసారి ప్రాణాంతక దాడులు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఆవులను చంపినట్లు చర్మం ఒలిచినట్లు, అపహరించి నట్లు, అమ్మినట్లు కూడ ఆరోపిస్తూ దాడులకు, అక్రమ కేసుల బనాయింపులకు దిగుతున్నట్లు కూడా ఆ నివేదిక తెలియచేసింది. జమ్మూ-కశ్మీర్‌లో హింసాకాండ అణచివేత మాటున జులైలో 90 మందిని చంపి, వందలమందిని గాయపరచినట్లు, దీనితో ప్రభుత్వ బలగాలపై ఆగ్రహం మరింతగా ప్రజలలో రాజుకొన్నుట్ల ఆ నిఘా సంస్థ వివరించింది.

అంతేకాకుండా విదేశీ స్వచ్ఛంద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని నియంత్రిస్తున్నట్లు కూడా ఆరోపించింది. మైనారిటీలు, విశిష్టాంగులు, స్త్రీ, పురుష, వర్గాల హక్కులను కాలరాసే అనేక చర్యలను సంస్థ ఏకవు పెట్టింది. ఆ సంస్థ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ కెన్నెత్ రాత్ మెజారిటీ అభీష్టానికి మానవ హక్కులను అడ్డంకిగా భావించడం పెరుగుతున్నట్లు ఆరోపించారు. సంస్థ దక్షిణాసియా డైరెక్టర్ మానీక్షి గంగూలి పౌర సామాజిక బృందాలపై భారతదేశంలో జరుగుతున్న అధికారుల దాడులను తీవ్రంగా ఎండగట్టారు. ప్రజోద్యమాలు అనే సుసంపన్న సాంప్రదా యానికి ఈ దాడులు గొడ్డలిపెట్టుగా ఆమె పేర్కొన్నారు.
పేదల మైనారిటీల, మానవ హక్కుల కార్యకర్తల రక్షణకు పూచీ వహించవలసిన ప్రభుత్వమే వాటిని కాలరాయడం మన దేశంలో గత ఏడాది యధేచ్ఛగా సాగిన విషయాన్ని హ్యూమన్ వాచ్ కడిగేసింది. కాని ఈ అంశంలో పాకిస్థాన్‌లోవలె ఇక్కడ ప్రజల్లో కదలికలేకపోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. తిరుగులేని మెజారిటీతో నెగ్గిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో ప్రజలను కదిలించే శక్తులు కొరవడ్డాయి. మానవ హక్కులకు మన మీడియా ఎంతగా ప్రచారం చేస్తున్నా ప్రజలలో స్పందన కొరవడుతోంది. కళ్లముందు జరిగే అన్యాయాన్ని కూడా ప్రశ్నించనితత్వం ప్రబలుతోంది.

– తితాష్ సేన్