Home తాజా వార్తలు వర్మి కాంపోస్టు ఎరువులో మానవ అస్థిపంజరం

వర్మి కాంపోస్టు ఎరువులో మానవ అస్థిపంజరం

Human skeleton in vermi compost manure

మెదక్ ప్రతినిధి: ఎరువును కొనుగోలు చేసి వ్యవసాయ పొలంలో జల్లుతుండగా మానవ అస్థిపంజరం బయటపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలోని తారాచంద్ తన ఫాంహౌస్ నుండి మనోహరాబాద్‌లోని సూపర్ సీడ్స్ కంపెనీ వారు వర్మికంపోస్ట్ ఎరువును మే 18వ తేదీన కొనుగోలు చేశారు. కాగా ఆదివారం నాడు పొలంలో వర్మికంపోస్టు ఎరువును కూలీలతో చల్లిస్తుండగా మనిషి (గుర్తుతెలియని) అస్థిపంజరం బయటపడింది. తల, కాళ్లు, చేతులు, వెన్నుపూస ఎముకలే కాకుండా వల, తాడు వంటివి ఆ ఎరువులో రావడంతో కూలీలు భయపడి పరుగులెత్తారు. వెంటనే సంబంధిత సూపర్ సీడ్స్ కంపెనీ యాజమానికి కూలీలు సమాచారం అందించారు. కంపెనీ యాజమాని పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వర్మి కాంపోస్ట్ ఎరువులో లభ్యమైన మనిషి ఎముకలను, తాడు, వలలను పరిశీలించి సూపర్ సీడ్స్ కంపెనీ యజమానిని విచారించగా… తాను తారాచంద్ ఫాంహౌస్ నుండి ఎరువును కొనుగోలు చేసినట్లు యాజమాని తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.